Banana Ketchup: టమోటో కెచప్ తెలుసు, మరి బనానా కెచప్ తెలుసా? ఇది కూడా అదిరిపోతుంది
టమోటో కెచప్ ఎంతో ఫేమస్. ఇప్పుడు ప్రతి ఇంట్లో కనిపిస్తుంది. అలాంటిదే బనానా కెచప్ కూడా.
ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నా, పిజ్జా తిన్నా, బర్గర్ తిన్నా పక్కన టమోటో కెచప్ కనబడాల్సిందే. పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో టమోటో కెచప్ ఇప్పుడు ఆల్ టైం ఫేవరెట్ డిష్ అయిపోయింది. ఎప్పుడూ టమోటా కెచప్ తింటే బోర్ కొట్టేస్తుంది కదా, ఓసారి బనానా కెచప్ ట్రై చేయండి. ఇంతవరకు టమోటో సాస్, చిల్లీ సాస్, సోయాసాస్ ఇలా రకరకాల సాస్‌ల గురించి వినే ఉంటారు. ఇలాంటి కోవకే చెందుతుంది బనానా సాస్ కూడా. ఇది ఫిలిప్పీన్ దేశ వంటకాలలో ముఖ్యమైనది. అక్కడ ప్రతి ఇంట్లో కూడా బనానా కెచప్ కచ్చితంగా ఉంటుంది.
అరటి పండ్లు, వెనిగర్, పంచదార, మసాలా దినుసులతో బనానా కెచప్ తయారు చేస్తారు. టమోటో కెచప్ కి ఇది సరైన ప్రత్యామ్నాయం. పసుపు రంగులో కనిపించే బనానా కెచప్ ఫ్రెంచ్ ఫ్రైస్, చేపల ఫ్రైకి జతగా బాగుంటుంది. బనానా కెచప్ మాంసం వంటకాలను చేసేటప్పుడు వాటిని మ్యారినేట్ చేసేందుకు వినియోగిస్తారు. ఇది ఆ వంటకానికి ప్రత్యేకమైన రుచిని అందిస్తుందని ఫిలిప్పీన్ దేశ వాసుల నమ్మకం.
టమోటో కొరత వల్ల
టేస్టీ టమోటో కెచప్ ఉండగా... మధ్యలో ఈ బనానా కెచప్ ఎందుకు పుట్టుకొచ్చింది? అనుకుంటున్నారా దానికి కారణం కూడా టమోటోలే. ఫిలిప్పీన్స్ లో రెండో ప్రపంచ యుద్ధం సమయంలో టమోటాల కొరత ఏర్పడింది. ఫిలిప్పీన్ జాతీయులకు ఎక్కువగా టమోటా కెచప్ తినడం అలవాటు. అది లేకుండా వారు ఆహారాన్ని తినేందుకు చాలా ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో కెచప్ కొరత తీర్చడానికి, బనానా కెచప్ తయారీ చేపట్టారు. ఫీలిప్పీన్స్ అరటితోటలు ఎక్కువ. తక్కువ రేటుకే దొరకుతాయి. దీంతో వాటితోనే బనానా కెచప్ రెడీ చేశారు. ఇప్పుడు ఆ కెచప్ ఫిలిప్పీన్స్‌లో టమోటా కెచప్ వాడాన్ని దాటేసింది. వీటిలో అనేక మసాలా దినుసులు కూడా ఉంటాయి. కాబట్టి ఆరోగ్యానికి ఢోకా ఉండదు. బనానా కెచప్ మార్కెట్లో రెడీమేడ్ గా దొరుకుతుంది. ఇది ఆన్‌లైన్ గ్రోసరీ స్టోర్లలో ఉంటుంది. మీకు ఒకసారి టేస్ట్ చేయాలనిపిస్తే ఆర్డర్ పెట్టుకోండి. పాశ్చాత్య దేశాల్లో వీటి అమ్మకాలు జోరుగానే ఉన్నాయి. మన దేశంలో కూడా ఇది లభిస్తున్నా, టమాటో కెచప్ తో పోల్చుకుంటే తక్కువనే చెప్పాలి. దీని రుచికి అలవాటు అయితే టమోటో కెచప్ పక్కన పెట్టేస్తారు ఎవరైనా. అంత రుచిగా ఉంటుంది బనానా కెచప్. ముఖ్యంగా పిల్లలు దీన్ని బాగా ఇష్టపడతారు.
Also read: దగ్గుతో బాధపడుతుంటే కేవలం 10 నిమిషాల్లో ఇలా సిరప్‌ను ఇంట్లోనే తయారు చేసుకోండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.