Dinner Time: రాత్రిభోజనం రోజుకో టైమ్‌కి చేస్తున్నారా? అయితే ఆ సమస్య వచ్చే ముప్పు అధికం
ఏ పనినైనా సమయానికి చేయాలి. లేకుంటే ప్రమాదం పొంచి ఉన్నట్టే. భోజనం, నిద్ర విషయాల్లో ఈ నియమం కచ్చితంగా పాటించాల్సిందే.
తినే ఆహారంపైనే కాదు, సమయానికి ఆ ఆహారం తింటున్నారా లేదా అనే విషయంపై కూడా ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. సమయానికి ఆహారం తినకపోతే ఎంత ప్రమాదమో కొత్త అధ్యయనం చెబుతోంది. ముఖ్యంగా రాత్రిపూట రోజూ ఒకే సమయానికి తినకుండా రోజుకో టైమ్‌కి తినేవారిలో చాలా ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నిర్ణీత సమయాల్లో కాకుండా యాదృచ్ఛిక సమయాల్లో రాత్రి భోజనం చేసేవారు హెమరేజిక్ స్ట్రోక్ (Haemorrhagic stroke) కు గురయ్యే ప్రమాదం ఎక్కువని పరిశోధకులు గుర్తించారు. తలలోని రక్తనాళం పగిలి మెదడులో రక్తస్రావం జరగడాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. రాత్రి 8 గంటలలోపు భోజనం చేసే వ్యక్తుల్లో ఇది తక్కువ ముప్పును సూచిస్తుంది. కానీ 8 దాటాకా భోజనం చేసే వారిలో, అది కూడా ఓరోజు ఎనిమిదిన్నరకి, మరో రోజు తొమ్మిదిన్నరకి, ఇంకోరోజు పదికి ఇలా భోజనాలు చేసే వారిలో స్ట్రోక్ ముప్పు అధికంగా ఉంటుందని కనుగొన్నారు.
ఇలా సాగింది అధ్యయనం
పరిశోధనలో పాల్గొన్నవారికి మూడు వర్గాలుగా విభజించారు.
1. రాత్రిపూట ఎనిమిది గంటల కన్న ముందే ఆహారం తినే వర్గం
2. ఒక సమయం లేకుండా నచ్చినప్పుడు తినే వర్గం
3. రాత్రి 8 దాటాకా భోజనం చేసే వర్గం
ఈ మూడు వర్గాల వారి డేటాను విశ్లేషించాక రాత్రి ఎనిమిది గంటల కన్నా ముందే భోజనం చేసే వారు ఆరోగ్యంగా ఉన్నట్టు గుర్తించారు. ఒక సమయం లేకుండా నచ్చినప్పుడు ఆహారం తినే వర్గానికి చెందిన ప్రజలు అధికంగా స్ట్రోక్ ప్రమాదాన్ని కలిగి ఉన్నట్టు గుర్తించారు. అందుకే ప్రజలంతా వీలైనంత వరకు రాత్రి ఎనిమిది గంటలలోపు భోజనాన్ని ముగించాలని సూచిస్తున్నారు.
స్ట్రోక్ ఎప్పుడొస్తుంది?
ధమనిలో ఏవైనా అడ్డుపడడం వల్ల మెదడుకు రక్తం, ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు అది స్ట్రోక్ కు దారి తీస్తుంది. అధిక కొలెస్ట్రాల్, సంతృప్త , ట్రాన్స్ ఫ్యాట్స్ మొదలైనవి అధికంగా ఉండే ఆహారం తినేవారిలో, ధూమపానం, ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వంటివి కూడా స్ట్రోక్‌కు ప్రమాదకారకాలుగా ఉన్నాయి.
స్ట్రోక్ లక్షణాలు ఇలా ఉంటాయి
1. ముఖం ఒకవైపుకు వంకరగా తిరగడం
2. నవ్వలేకపోవడం
3. మాట్లాడలేకపోవడం
4. భుజాల్లో నీరసంగా అనిపించడం
5. శరీరానికి ఒక వైపు అతి నీరసంగా, లేదా స్పర్శ లేనట్టు అనిపించడం
6. హఠాత్తుగా తీవ్ర తలనొప్పి రావడం
7. హఠాత్తుగామెమోరీ లాస్ కావడం
8. కళ్లు తిరిగినట్టు కావడం, కింద పడిపోవడం
ఇలాంటి లక్షణాలు ఏవి కనిపించినా వెంటనే వైద్యుడిని కలిసి చికిత్స తీసుకోవడం చాలా అవసరం.
Also read: వంట చేసేటప్పుడు అగ్నిప్రమాదాలు జరగకుండా ఈ జాగ్రత్తలు తీసుకోక తప్పదు
Also read: కొడుకు పుట్టాలని కోరుకునే జంటల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంది, సర్వేలో తేలిన విషయం