Diabetes Diet: డయాబెటిస్ బాధితులు గుడ్లు తీసుకోవచ్చా? రోజుకు ఎన్ని తింటే ఆరోగ్యానికి మంచిది?
ప్రోటీన్ పుష్కలంగా ఉండే గుడ్డు ఎంత ఆరోగ్యకరమైనది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి మధుమేహుల సంగతి ఏంటి? వీళ్ళు గుడ్డు తినొచ్చా?
ప్రపంచవ్యాప్తంగా కొన్ని మిలియన్ల మంది ప్రజల్ని ప్రభావితం చేస్తున్న వ్యాధి మధుమేహం. ఇది ఒకసారి వచ్చిందంటే చనిపోయే వరకు దీనితోనే గడపాలి. షుగర్ లెవల్స్ కంట్రోల్ లో పెట్టుకునేందుకు సరైన ఆహార ఎంపికలు చేర్చుకోవాలి. లేదంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది. తీసుకునే ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్త వహించాలి. ఈ విషయంలో ఎక్కువ మందికి వచ్చే డౌట్ మధుమేహులు గుడ్లు తీసుకోవచ్చా?
ప్రోటీన్ పుష్కలంగా లభించే గుడ్డులో 9 అమైనో ఆమ్లాలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే మాంసం కంటే గుడ్డు పోషకమైన ఆహారంగా నిపుణులు చెబుతున్నారు. ఒక పెద్ద గుడ్డులో దాదాపు 6.3 గ్రాముల ప్రోటీన్, 78 కేలరీలు, 186mg కొలెస్ట్రాల్, 44 IU విటమిన్ డి, 24 మైక్రోగ్రాముల ఫోలేట్, 28 gms కాల్షియం ఉన్నాయి. ఇవే కాకుండా విటమిన్ బి6, బి12, రిబోప్లావిన్, ఇనుము, జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాలు అందిస్తుంది.
కార్బోహైడ్రేట్లు తక్కువ
మధుమేహులు రక్తంలో చక్కెర స్థాయిలని నిర్వహించడానికి కార్బోహైడ్రేట్స్ తీసుకునే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. గుడ్లు కార్బోహైడ్రేట్ రహితంగా ఉంటాయి. తక్కువ కార్బ్ ఆహారం కోరుకునే వారికి ఇది ఉత్తమ ఎంపిక. డయాబెటిక్ బాధితులు గుడ్లుని తీసుకోవచ్చు. గుడ్లు.. మధుమేహం బాధితుల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిల మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపవని, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయని నిపుణులు తెలుపుతున్నారు.
చక్కెర స్థాయిలని నియంత్రణలో ఉంచుకోవడం కోసం ప్రోటీన్ తీసుకోవడం చాలా అవసరమని వివిధ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. గుడ్లులో అధిక మొత్తంలో అసంతృప్త కొవ్వులు ఉన్నాయి.
మరి కొలెస్ట్రాల్ మాటేమిటి?
గుడ్డు తింటే కొవ్వు అధికంగా పేరుకుపోతుందనే అపోహ చాలా మందిలో ఉంటుంది. ఎందుకంటే ఇవి కొలెస్ట్రాల్ ని కలిగి ఉంటాయి. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్, ఇతర ఆరోగ్య సంస్థల చెప్పిన దాని ప్రకారం గుడ్డు మితంగా తీసుకుంటే గుండె ఆరోగ్యానికి ఏ విధమైన హాని తలపెట్టదు. రక్త కొలెస్ట్రాల్ స్థాయిలపై గుడ్డు పరిమిత ప్రభావాన్ని మాత్రమే చూపుతుందని పరిశోధనలో తేలింది. అందుకే మితంగా వాటిని తీసుకుంటే గుడ్డు వల్ల పొందే ప్రయోజనాలు అన్నీ శరీరానికి అందుతాయి.
ఆరోగ్య పరిస్థితులు, ఆహార ప్రాధాన్యతలు దృష్టిలో పెట్టుకుని గుడ్డు డైట్ లో భాగం చేసుకోవాలి. గుడ్డు తెల్ల సొన, పచ్చ సొనలో లభించే పోషకాలు చాలా భిన్నంగా ఉంటాయి. తెల్ల సొనలో ప్రోటీన్, 15 కేలరీలు మాత్రమే ఉన్నాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు గుడ్డులోని తెల్ల సొనతో చేసిన అల్పాహారం తీసుకుంటే మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. 3 టీ స్పూన్ల వండిన ఓట్స్ తీసుకుని 2-3 గుడ్డులోని తెల్ల సొన, ఉల్లిపాయ, టొమాటో, బెల్ పెప్పర్, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు నల్ల మిరియాల పొడి, కూరగాయ ముక్కలు వేసుకుని తింటే మంచిది. డయాబెటిస్ బాధితులు పచ్చసొన తీసుకోకపోవడమే మంచిది. అయితే గుడ్డు వారానికి 2 సార్లు మాత్రమే తీసుకుంటే కొలెస్ట్రాల్ కూడా అదుపులో ఉంటుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: మధుమేహం అదుపులో ఉండాలంటే ఈ నట్స్ తినేయండి