Chicken Pakodi: చికెన్ పకోడి చిటికెలో చేసేయండిలా
చికెన్ ప్రియులకు చికోన్ పకోడి బాగా నచ్చేలా ఉంటుంది. ఓసారి చేసుకుని చూడండి.
మాంసాహార ప్రియులు చికెన్ వంటకాలను బాగా ఇష్టపడతారు. చికెన్ తో బిర్యానీ, కర్రీ, వేపుడే కాదు టేస్టీ చికెన్ పకోడీ చేసుకున్నా బావుంటుంది. సాయంత్రం పూట స్నాక్స్ లా తినవచ్చు. దీన్ని చేయడం చాలా కష్టం అనుకుంటారు కానీ శెనగపిండితో చేసిన పకోడీలాగే దీన్ని చేయడం చాలా సులువు. కేవలం అరగంటలో రెడీ అయిపోతుంది. పక్కన ఎలాంటి సాస్, చట్నీ లేకపోయినా ఆవురావురమంటూ తినేయచ్చు. రుచి కూడా అదిరిపోతుంది.
కావాల్సిన పదార్థాలు
చికెన్ (బోన్‌లెస్) - పావు కిలో
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
కారం - ఒక స్పూను
పసుపు - అరస్పూను
ధనియాల పొడి - అర స్పూను
గరం మసాలా - అరస్పూను
కార్న్ ఫ్లోర్ - రెండు స్పూనులు
పచ్చి మిర్చి - రెండు
నిమ్మరసం - ఒక స్పూను
కరివేపాకు - గుప్పెకు
గుడ్డు - ఒకటి
పెరుగు - రెండు స్పూనులు
కొత్తిమీర తరుగు - రెండు స్పూనులు
ఉప్పు - రుచికి సరిపడా
తయారీ ఇలా
1. చికెన్ ను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలు చేసుకోవాలి. పెద్ద ముక్కలు ఉంటే పకోడీ టేస్టు రాదు.
2. ఒక గిన్నెలో చికెన్ వేసి అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కార్న్ ఫ్లోర్, ఉప్పు వేసి బాగా కలపాలి.
3. రెండు స్పూనుల పెరుగు కూడా వేసి బాగా కలపాలి.
4. ఆ మిశ్రమంలో గుడ్డు కొట్టి వేసి బాగా గిలక్కొట్టాలి.
5. నీళ్లు కలపవద్దు. నీళ్లు కలిపితే మిశ్రమం గట్టిగా రాకుండా జారిపోయేలా అవుతుంది.
6. ఇప్పుడు నిలువుగా కోసిన పచ్చిమిర్చి, కరివేపాకు, నిమ్మరసం కూడా బాగా కలిపాలి.
7. మిశ్రమంలోని ఫ్లేవర్లన్నీ ముక్కకు బాగా పట్టాలంటే గిన్నెపై మూత పెట్టి ఒక ఇరవై నిముషాలు ఫ్రిజ్ లో పెట్టండి. చక్కగా మారినేట్ అవుతుంది.
8.ఈలోపు స్టవ్ వెలిగింది కాస్త లోతుగా ఉండే చిన్న బాణలి పెట్టుకుని నూనె వేసి వేడి చేయాలి.
9. లోతుగా ఉండే చిన్న బాణలి పెట్టుకుంటే తక్కువ నూనెతో వేపుడు పూర్తవుతుంది. లేకుంటే ఎక్కువ నూనె వేయాలి.
10. నూనె వేడెక్కాక చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేస్తూ వేయించాలి.
11. ముక్కలు ఎర్రగా వేగాక తీసి గిన్నెలో వేసి కొత్తిమీర చల్లుకోవాలి.
తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది చికెన్ పకోడి. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది.
Also read: సెక్స్ గురించి గూగుల్‌ను ఎక్కువ మంది అడిగిన ప్రశ్నలు ఇవే
Also read: డెంగ్యూ జ్వరం వస్తే తినాల్సినవి ఇవే, వీటితో సమర్థంగా ఎదుర్కోవచ్చు