Asthma: ఇంట్లో ఆస్తమా రోగులు ఉన్నారా? అయితే వీటికి గుడ్ బై చెప్పండి
ఆస్తమా రోగులు ఉన్న ఇళ్లల్లో కొన్ని రకాల పనులు చేయకూడదు.
మనదేశంలో ఆస్తమాతో బాధపడుతున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం ప్రపంచంలో దాదాపు 23.5 కోట్ల మంది ఆస్తమాతో బాధపడుతున్నారు. వారిలో మనదేశంలో కోటిన్నర నుంచి రెండు కోట్ల మంది ఆస్తమా రోగులు ఉన్నట్టు అంచనా. ఇంకా ఈ సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది. ఆస్తమా కారణంగానే ఏటా లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మనదేశంలో చిన్నారుల్లో కూడా ఎంతోమంది ఆస్తమా బారిన పడుతున్నారు. ఇంట్లో ఆస్తమా రోగులు ఉంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి. ఆస్తమా అనేది ఒక దీర్ఘకాలిక శ్వాస సంబంధ వ్యాధి.
ఏమిటి ఆస్తమా?
మనం గాలి పీల్చినప్పుడు అది ఊపిరితిత్తుల్లోకి వెళ్లాలి. అలాగే ఊపిరితిత్తుల నుంచి మళ్లీ బయటకు రావాలి. అయితే గాలిని మోసుకెళ్ళే వాయునాళాలలోని కండరాలు వాచిపోతాయి. దీనివల్ల వాయునాళాలు సన్నబడుతుంది. ఆ వాయు నాళాల గుండా గాలి ప్రవాహం సరిగ్గా జరగదు. దీనివల్ల ఊపిరి సరిగా అందక గాలి వేగంగా పీల్చడం, వదలడం వంటివి చేస్తారు. దీని వల్ల ఆయాసం వచ్చేస్తుంది. ఛాతీ పట్టేసినట్టు అవుతుంది. ఆస్తమా ఏ వయసు వారికైనా రావచ్చు. ఇంట్లో ఆస్తమా రోగులు ఉంటే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇంట్లో మంచి సువాసన కోసం ఎంతోమంది పరిమళాన్ని వెదజల్లే కొవ్వొత్తులను వెలిగిస్తారు. అలాగే అగరబత్తీలను కూడా వెలిగిస్తారు. ఇవి ఆస్తమా రోగులకు చికాకు తెప్పిస్తాయి. వాటి నుండి విడుదలయ్యే పొగ గాలిలో చేరి ఆస్తమాకు ట్రిగ్గర్ గా మారుతుంది. వారికి గాలి పీల్చుకోవడం కష్టంగా అవుతుంది. అంతేకాదు దీర్ఘకాలంగా ఇలా ఆస్తమా రోగులు ఇంట్లో క్యాండిల్స్, అగరబత్తులు నుంచి వచ్చే గాలిని పీలుస్తూ ఉండడం వల్ల వారి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. కాబట్టి ఇంట్లో ఆస్తమా రోగులు ఉన్నప్పుడు ఇలాంటి క్యాండిల్స్, అగరబత్తులు వెలిగించడానికి దూరంగా ఉండాలి. ఆస్తమా స్వల్పంగా ఉన్న వారిపై కూడా ఇది దీర్ఘకాలంగా తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. అలాంటివి వెలిగించినప్పుడు తలుపులు, కిటికీలు తెరిచి ఉంచాలి. అలాగే బార్బెక్యూ వంటి వంట పద్ధతులకు కూడా ఆస్తమా రోగులు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. గాలి కాలుష్యం వల్ల కూడా ఆస్తమా పెరిగిపోతుంది. ఈ చిన్న చిన్న విషయాలే ట్రిగ్గర్ గా మారి ఆస్తమాను పెంచేస్తాయి. చల్లని వాతావరణం కూడా ఆస్తమా రోగులకు పడదు. వానలు పడుతున్నప్పుడు, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ఆస్తమా మరింతగా పెరిగిపోతుంది.
Also read: కొంతమంది పిల్లల్లో నత్తి ఎందుకు వస్తుంది? తల్లిదండ్రులు ఏం చేయాలి?
Also read: మాంసాహారం తినడం తగ్గిస్తే బెటర్, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.