Dog Flu: ‘డాగ్ ఫ్లూ’ - ఇది కూడా మనుషులకు సోకుతుందా? షాకింగ్ న్యూస్ చెప్పిన చైనా పరిశోధకులు
చైనా సైంటిస్టులు మరో ప్రమాద హెచ్చరిక చేస్తున్నారు. అదే జునోటిక్ ఫ్లూ. ఇది మనుషుల అతి సన్నిహిత నేస్తం నుంచే పొంచి ఉన్ ప్రమాదం మరి.
మొన్నటి వరకు కోవిడ్-19తో ఎన్ని తిప్పలు పడ్డామో తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆ మహమ్మారి నుంచి తప్పించుకు తిరుగుతూ సాధారణ జీవితం గడుపుతున్నాం. అయితే, చైనా పరిశోధకులు మరో కొత్త వైరస్‌ను కనుగొన్నారు. అదే ‘డాగ్ ఫ్లూ’. మరి ఇది మనషులకు సోకుతుందా?
దాదాపుగా అన్నిఫ్లూ వైరస్‌లు మనుషులకు వ్యాపించేది జంతువుల ద్వారానే. వీటిలో ముఖ్యమైనవి బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ. కానీ ఇప్పుడు చైనా సైంటిస్టులు మరో ప్రమాద హెచ్చరిక చేస్తున్నారు. అదే జునోటిక్ ఫ్లూ. ఇది మనుషులకు అతి సన్నిహిత నేస్తాల నుంచి పొంచివున్న ప్రమాదం. అంటే ఇది కుక్కల నుంచి వ్యాపించే ఫ్లూ. మరోరకం జునోటిక్ ఇన్ఫ్లుయెంజా.
పరిశోధకులు కుక్కల్లో ఏవియన్ ఆరిజిన్ వైరస్ మూలాలను వాటి జన్యు, జీవసంబంధ లక్షణాల పరిణామాలను ఒక క్రమపద్ధతిలో పరిశోధించినపుడు దీన్ని గుర్తించారు. కుక్కల్లో కనిపించిన H3N2 CIVs, SAα2,6Gal రిసెప్టార్ మానవ వాయుమార్గ ఎపీథీలియల్ కణాలలో క్రమంగా పెరిగిన HA ఆసిడ్ స్థిరత్వం పొంది వంద శాతం వరకు డ్రాప్ లెట్ల ద్వారా సంక్రమించే ఆస్కారం కనిపించిందని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. ఇదే విషయాన్ని సాధారణీకరించి చెప్పాలంటే జంతువుల ద్వారా సోకే ఇన్ఫ్లుయేంజా వైరస్ లను మనావులకు సోకేందుకు అనుగుణంగా మార్చేందుకు కుక్కలు మంచి ఇంటర్మీడియెట్ హోస్టులుగా పనిచేస్తాయని పరిశోధనా ఫలితాలు వెల్లడించాయి.
డాగ్ ఫ్లూ అంటే?
మానవులకు సోకే అన్ని జునోటిక్ ఇన్ఫ్లూయేంజా వైరస్‌ల మాదిరిగానే ఇప్పుడు డాగ్ ఫ్లూగా భావించే ఫ్లూ. వాస్తవానికి ఇది బర్డ్ ఫ్లూ H3N2 మరో వెర్షన్. నిజానికి 2006 వరకు ఇది కుక్కలకు సోకుతుందని కూడా తెలీదు. కానీ అప్పటి నుంచి క్రమంగా ఏవియన్ ఇన్ప్లుయేంజా పూర్తిస్థాయిలో క్షీరదాలకు సోకే వైరస్ గా రూపం మార్చుకుని కుక్కల్లో స్థిరపడింది. అయితే కుక్కలకు దీని వల్ల పెద్దగా ప్రమాదం కనిపించలేదని పరిశోధకులు అంటున్నారు. ఇది అన్నింటికంటే ఆందోళన కలిగించే విషయం.
కొంచెం భయం - కొంచెం ఉపశమనం
ఏవియన్ ఇన్ఫ్లుయేంజా వైరస్‌లు మానవులలో తీవ్రమైన అనారోగ్యాలు కలిగిస్తాయి. అయితే ఇక్కడ కొంచెం ఊపిరితీసుకోగలిగే విషయం ఏమిటంటే ఇది మనుషుల నుంచి మనుషులకు వ్యాపించదు. కుక్కల్లో ఈ వైరస్ మార్పులు క్షీరదాల్లో వ్యాపించేందుకు అనువుగా మార్పులు చెందుతాయి. కుక్కల్లో చేరిన తర్వాత మార్పులు జరగడానికి చాలా కాలం పడుతుంది.
ఆందోళనకరమా?
ఇదేమీ కొత్త పాండమిక్ కాదనే అంటున్నారు పరిశోధకులు. దీనికి మనుషుల్లో నిరోధకత లేదు. కానీ ఇప్పటికిప్పుడు పెద్దగా ఆందోళన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. డాగ్ ఫ్లూ మానవులకు సోకిన ఆధారాలు ఇప్పటి వరకైతే లేవు. అయితే మానవులకు కూడా సోకే ప్రమాదం ఉందని మాత్రమే పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు కుక్కల్లో ఉన్న ఈ వైరస్ ఇంకా పూర్తిస్థాయిలో మ్యూటేషన్ థెషోల్డ్ ను చేరుకోలేదు. ఒకవేళ మనుషులకు సోకినా అది ఒక మనిషి నుంచి నేరుగా మరో మనిషికి సోకడం ప్రస్తుతం అసాధ్యం అని పరిశోధకుల్లో ఒకరు స్పష్టం చేశారు. ఈ వివరాలన్నీ కూడా eLife జర్నల్ లో ప్రచురితమయ్యాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.