Telugu Recipe: క్యాబేజీ వడలు, సాయంత్రానికి సింపుల్ స్నాక్ రెసిపీ
క్యాబేజీతో వండిన వడలు ఒకసారి తింటే మళ్లీ కోరికోరి మీరే తింటారు.
క్యాబేజీతో చేసే వంటలు చాలా తక్కువ. కూర, వేపుడు, మంచురియా మాత్రమే చేస్తారనుకుంటాం కానీ వాటితో వడలు కూడా చేసుకోవచ్చు. పిల్లలకు, పెద్దలకు నచ్చే స్నాక్ రెసిపీ. ఒకసారి చేసుకుంటే మళ్లీ తినాలనిపిస్తుంది.వీటిని చేయడం పెద్ద కష్టమేం కాదు.
కావాల్సిన పదార్థాలు
క్యాబేజీ తరుగు - ముప్పావు కప్పు
మినప్పప్పు - అర కప్పు
కొత్తిమీర తరుగు - పావు కప్పు
పచ్చిమిర్చి - ఒకటి
ఉప్పు -రుచికి సరిపడా
నీళ్లు - తగినన్ని
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
పచ్చి బఠానీ - పావు కప్పు
ఉల్లిపాయ - ఒకటి
తయారీ ఇలా
1. మినపప్పు నాలుగ్గంటలు నానబెట్టి రుబ్బుకోవాలి. నీరు ఎక్కువగా వేయకుండా చిక్కగా రుబ్బుకోవాలి.
2. క్యాబేజీ సన్నగా తరుక్కోవాలి. పచ్చి బఠానీలు ఉడకబెట్టాలి.
3. పచ్చిబఠానీలను మెత్తగా చేత్తో నలిపేయాలి.
4. మినపప్పు రుబ్బును గిన్నెలో వేసి అందులో పచ్చిబఠానీల పేస్టు, క్యాబేజీ తరుగు, ఉల్లిపాయల తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి కలపాలి.
5. అందులో ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలపాలి.
6. కళాయిలో నూనె వేసి వేడెక్కనివ్వాలి.
7. రుబ్బును వడల్లా నూనెలో వేయించుకుంటే క్యాబేజీ వడలు రెడీ అయిపోతాయి.
8. నూనెను పీల్చే కాగితంపై వాటిని వేస్తే వడల్లో ఉన్న నూనెను పీల్చేస్తాయి.
క్యాబేజీ ఉపయోగాలు...
క్యాబేజీ వాసన చాలా మందికి నచ్చదు. కానీ అది పోషకాల పుట్ట. ఇందులో కాల్షియం, అయోడిన్, పొటాషియం, సల్ఫర్, ఫాస్పరస్, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. విటమిన్ల విషయానికి వస్తే ఎ, బి, సి , ఇ, కెతో పాటూ ఫోలిక్ యాసిడ్లు లభిస్తాయి. ఈ కూర తినడం వల్ల బరువు పెరగరు. క్యాలరీలు చాలా తక్కువగా లభిస్తాయి. దీనిలో యాంటీ బ్యాక్టిరియల్, యాంటీ వైరల్ శక్తి అధికం. క్యాబేజీని తరచూ తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. మహిళలు దీన్ని తినడం రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. అయితే అధికంగా తింటే మాత్రం సమస్యలు వస్తాయి. ఆడవారిలో థైరాయిడ్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే వారానికి రెండు మూడు సార్లు కన్నా ఎక్కువ తినకూడదు. గుండెజబ్బులు, స్ట్రోక్ వచ్చే అవకాశాన్ని, చర్మ సంబంధిత సమస్యల్ని, అల్సర్లను తగ్గించే లక్షణం ఉంది. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీనితో చేసిన వంటలు తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. చైనీయులు క్యాబేజీ రసాన్ని ఔషధాల్లో వాడతారు. పచ్చి క్యాబేజీ రసాన్ని తాగినా ఎంతో మేలు జరుగుతుంది. క్యాబేజీని పచ్చిగా కూడా తినగం, ఫాస్ట్ ఫుడ్‌లలో పచ్చిగానే చల్లుతారు. రైస్‌కు ఇవి ఎంతో రుచిని ఇస్తాయి. ఇక టమోటా వేసి వండే క్యాబేజీ కూర,క్యాబేజీ వేపుడు చాలా రుచిగా ఉంటాయి. పిల్లలకు దీన్ని కనీసం వారానికి రెండు సార్లు పెట్టడం వల్ల చాలా మేలు జరుగుతుంది.
Also read: దీర్ఘకాలం పాటూ గర్భనిరోధకాలు వాడడం వల్ల వచ్చే సమస్యలు ఇవే
Also read: ఒక పూట బ్లాక్ రైస్ తిని చూడండి, డయాబెటిస్ అదుపులోకి వచ్చేస్తుంది