Breast feeding: పాలిచ్చే తల్లులు ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి
పాలిచ్చే తల్లులు తినకూడని కొన్ని ఆహారాలు ఉన్నాయి.
తల్లిగా మారడమే ఒక వరం. బిడ్డ పుట్టాక కొన్ని నెలల పాటు కేవలం తల్లిపాల మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ పాలు పోషకాలతో నిండి ఉండేలా చూసుకోవాలి. అలాగే కలుషితాలు, అనారోగ్యకరమైన సమ్మేళనాలు లేకుండా ఆ పాలను స్వచ్ఛంగా ఉత్పత్తి అయ్యేలా చేసుకోవడం కూడా తల్లి బాధ్యత. కొన్ని రకాల ఆహారాలను దూరం పెడితే పాలు స్వచ్ఛంగా ఉంటాయి. పిల్లలకు పోషకాలు నిండుగా అందుతాయి. తల్లి పాలు ఇచ్చే సమయంలో ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. తల్లిపాలు ఇస్తున్నప్పుడు తినే ఆహారంపై శ్రద్ధ వహించాలి. ఎందుకంటే కొన్ని రకాల ఆహారాలు శిశువు ఆరోగ్యం, తల్లిపాల నాణ్యత పై ప్రభావం చూపిస్తాయి. తల్లిపాలు ఇచ్చే సమయంలో తల్లి తినకూడని కొన్ని ఆహారాలు ఉన్నాయి.
బిడ్డకి పాలు ఇస్తున్నప్పుడు క్యాబేజీ, కాలీ ఫ్లవర్, బ్రొకోలీ వంటి పచ్చి కూరగాయలను తినడం మానేయండి. అవి జీర్ణం కావడం కష్టం అవుతుంది. తల్లీ, బిడ్డ ఇద్దరిలో జీర్ణాశయంతర అసౌకర్యం కలగవచ్చు. పచ్చి కూరగాయలలో హానికరమైన బ్యాక్టీరియాలు ఉంటాయి. వాటి ఎదుగుదలకు పురుగుమందులను కూడా వాడతారు. కాబట్టి తల్లిపాల ద్వారా అవి శిశువుకు చేరే అవకాశం ఉంది. కాబట్టి క్యాబేజీ, బ్రకోలీ, ఉల్లిపాయలు వంటివి పచ్చివి తినడం తల్లి మానేయాలి. వీటిని పచ్చివి తింటే శిశువులో గ్యాస్ ఉత్పత్తి కూడా పెరుగుతుంది. దీనివల్ల పొట్ట నొప్పి వంటివి రావచ్చు.
బిడ్డకి పాలు ఇస్తున్నంతకాలం తల్లి కెఫీన్ ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. కెఫీన్ పాల ద్వారా శిశువుకు చేరుతుంది. ఇది వారిలో చిరాకు, అశాంతికి కారణం అవుతుంది. నిద్ర లేకుండా చేస్తుంది. అధిక కెఫీన్ తీసుకోవడం వల్ల తల్లీ బిడ్డల్లో డిహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంది. తల్లిపాలు ఇస్తున్నప్పుడు కాఫీ, టీలు, ఎనర్జీ డ్రింక్స్ వంటివి తాగడం మానేయాలి. వీటి బదులుగా పండ్ల రసాలను, నీళ్లను తాగడం మంచిది. కొబ్బరి నీళ్ళు తాగితే ఇంకా మేలు.
చేపలను కూడా తక్కువగా తింటే మంచిది. ఎందుకంటే చేపల్లో పాదరసం స్థాయిలు ఎక్కువవుతున్నాయి. పాదరసం అనేది మానవ ఆరోగ్యానికి హానికరమైన ఒక విషపూరిత లోహం. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలు పాదరసం అధికంగా చేపలను తినకూడదు. సముద్రం, నదులు కలుషితం అయిపోయి... పాదరసం అధికంగా చేరుతుంది. ఆ పాదరసం చేపల్లోకి ఇంకిపోతుంది. ఈ పాదరసం శరీరంలో చేరితే నాడీ వ్యవస్థ, మెదడు అభివృద్ధిపై తీవ్ర ప్రభావం తప్పదు. ఆరోగ్యకరమైన ఆహారం కోసం సాల్మన్, తిలాపియా, రొయ్యలు వంటివి తినడం ఉత్తమం. వీటిలో పాదరసం చాలా తక్కువగా ఉంటుంది.
ఔషధ మూలికలు తీసుకోవడం కూడా మానేయాలి. చాలా మంది తెలియక ఔషధ మూలికలతో చేసిన చూర్ణాలు, పొడులు వంటివి తింటూ ఉంటారు. బిడ్డకు పాలు ఇస్తున్నప్పుడు ఇలాంటివన్నీ మానేయడమే ఉత్తమం. కొందరు పాలు ఎక్కువగా పడతాయని మూలికలపై ఆధారపడతారు. ఇలాంటివి తినే ముందు వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం. తల్లీ బిడ్డ ఇద్దరి శ్రేయస్సును వారు దృష్టిలో ఉంచుకొని సలహాలు ఇస్తారు.
Also read: ఇలాంటి పనులు చేస్తే మైగ్రేన్ సమస్య ఇంకా పెరిగిపోతుంది, జాగ్రత్త
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.