స్మార్ట్ ఫోన్ అతిగా చూస్తున్నారా? జాగ్రత్త, త్వరగా ముసలోళ్ళు అయిపోతారు, ఎందుకంటే..
ప్రతి ఒక్కరికీ స్మార్ట్ ఫోన్స్ లేకుండా జీవితమే లేకుండా పోతుంది. ఒక్క రోజు కూడా ఫోన్ లేకుండా ఉండలేరు. కానీ వాటి నుంచి వచ్చే కాంతి వృద్ధాప్య సంకేతాలకి కారణం అవుతుంది.
మనం నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు చేతిలో ఉండేది స్మార్ట్ ఫోన్. డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్ లేకుండా తమ పని మొదలు పెట్టడం లేదంటే జీవితంలో అవి ఎంత ముఖ్యమైనవిగా ఉంటున్నాయో అర్థం చేసుకోవచ్చు. చాలామంది నిద్ర లేవగానే ఫోన్ ముఖమే చూస్తున్నారు. అంతగా అవి మన జీవితాన్ని ఆడిస్తున్నాయి. చిన్న పని దగ్గర నుంచి ఆఫీసు పని వరకు అన్ని ల్యాప్ టాప్ లేకుండా పని జరగదు. అయితే స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ టాప్ నుంచి వచ్చే నీలి కాంతి వల్ల వృద్ధాప్యం త్వరగా వచ్చే అవకాశం ఉందని కొత్త అధ్యయనాలు చెప్తున్నాయి. అంతే కాదు వాటి వల్ల మరణాలు సంభవించే అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.
టీవీలు, ల్యాప్‌టాప్, ఫోన్లు వంటి రోజువారీ పరికరాల నుంచి నీలి కాంతిని ఎక్కువగా బహిర్గతం చేయడం వల్ల మన శరీరంలోని చర్మం, కొవ్వు కణాల నుంచి ఇంద్రియ న్యూరాన్‌ల వరకు విస్తృత శ్రేణి కణాలపై హానికరమైన ప్రభావం పడుతుందని అధ్యయనం చేసిన నిపుణులు చెబుతున్నారు. నీలి కాంతి ఎక్కువగా పడటం వల్ల శరీరంలోని కణాలు సరిగా పనిచెయ్యడానికి ఉండే రసాయనాలకు ఆటంకం ఏర్పడుతుంది. దాని వల్ల వృద్ధాప్య ఛాయలు త్వరగా వచ్చేస్తున్నట్టు వెల్లడించారు.
ఫోన్స్, ల్యాప్ టాప్స్ నుంచి వెలువడే బ్లూ లైట్ కళ్ళని బాగా దెబ్బ తీస్తుంది. దాని వల్ల కళ్ళు మంటలు,తల నొప్పి, కళ్ల నుంచి నీరు కారడం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓరెగాన్ స్టేట్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం బ్లూ లైట్ మైటోకాండ్రియాపై ప్రభావం చూపుతుంది. ఈ నీలి కాంతి ఎక్కువగా శరీరం మీద పడటం వల్ల దీర్ఘాయువు మీద కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాని వల్ల అకాల మరణాలు సంభవించే ప్రమాదం లేకపోలేదు. బ్లూ లైట్ ఎక్స్పోజర్ వల్ల జీవక్రియల స్థాయిలలో గణనీయమైన వ్యత్యాసాలను గమనించినట్టు పరిశోధకులు వెల్లడించారు.
ఫోన్‌లు, డెస్క్ టాప్స్, ల్యాప్ టాప్స్, టీవీలు వంటి వాటి డిస్‌ప్లే స్క్రీన్‌లలో LED లు ప్రకాశవంతంగా ఉంటున్నాయి. ఇవి సమీప భవిష్యత్ లో ఏ విధంగా ప్రభావం చూపిస్తాయనే వాటి మీద ఇంకా విస్తృతమైన పరిశోధనలు అవసరమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆరోగ్యకరమైన జీవితం పొందాలంటే ఏం చెయ్యాలి
గ్యాడ్జెట్స్ ఎంత అవసరమో అంత ప్రమాదకరం కూడా. వాటిని అవసరం ఉన్నంత వరకు మాత్రమే వినియోగించాలి. అతిగా వినియోగించడం వల్ల వాటికి బానిసలుగా మారి జీవితాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే మన మీద మనకి నియంత్రణ ఉండాలని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. యుక్త వయస్సు వాళ్ళు ఎక్కువగా డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల వాటి ప్రబావనికి లోనై మానసిక క్షోభని అనుభవిస్తున్నారు.
బ్లూ లైట్ ఎక్స్ పోజర్ నుంచి బయటపడటం ఎలా?
☀ ప్రాణాయామం, శ్వాస వ్యాయామాలతో రోజును ప్రారంభించాలి. మీ శ్వాసపై నియంత్రణ ఉంటే అది మెదడును ప్రశాంతంగా ఉండేలా చెయ్యడంలో సహాయపడుతుంది. డిజిటల్ పరికాలను ఆయన చేసే ముందు వ్యాయామం చెయ్యడం, పళ్ళు తోముకోవడం, నడవటం వంటివి చేస్తూ ఆ పరికరాల ముందు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. మనసు, మైండ్ మీద నియంత్రణ చాలా అవసరం.
☀ నోటిఫికేషన్స్ ఆపేయాలి. ప్రతిసారి నోటిఫికేషన్ వచ్చినప్పుడు వచ్చిన శబ్దానికి వాటి వైపు చూస్తూ ఉంటాం. దాని వల్ల ఎక్కువ సేపు ల్యాప్ టాప్స్ లేదా ఫోన్ స్క్రీన్ చూడాల్సి వస్తుంది.
☀ చాలా మంది అవసరం ఉన్నా లేకపోయినా నిమిషానికి ఒకసారైన తమ ఫోన్ పదే పదే చూస్తూ ఉంటారు. అలా కాకుండా గంటకు ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే చూడటం అలవాటు చేసుకోవాలి.
☀ వారాంతం గడిపేందుకు చక్కటి ప్రదేశాని చూసేందుకు ఫ్రెండ్స్ తో బయటకి వెళ్లొచ్చు. అటువంటి సమయంలో ఫోన్ మీద ఎక్కువ దృషి పెట్టకుండా హాయిగా గడపొచ్చు. వాకింగ్ చేసేటప్పుడు ఫోన్ చూడకుండా పక్కన ఉన్న వారితో మాట్లాడుతూ ఎంజాయ్ చెయ్యొచ్చు.
☀ నిద్రకి ఉపక్రమించే ముందు ఫోన్ ముట్టుకోకపోవడమే ఉత్తమం. దాన్ని ఎక్కువగా చూడటం వల్ల నిద్రకి ఆటంకం ఏర్పడుతుంది. నిద్రకి సహకరించే మెలటోనిన్ ఉత్పత్తిని ఇది హరించివేస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read: గుడ్ న్యూస్ గుండె పోటు తర్వాత గుండెని రక్షించేందుకు ఇంజెక్షన్ - శాస్త్రవేత్తల సరికొత్త ఆవిష్కరణ
Also Read: పవన్ కళ్యాణ్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే, మీరు కూడా ట్రై చేయండి