Blood Formation : రక్తం ఎక్కడ తయారవుతుందో తెలుసా? ఎముకలు ఈ ప్రక్రియలో ఎలా సహాయపడతాయి?
Bone Marrow to Blood Cells : రక్తం శరీరానికి చాలా ముఖ్యం. ఇది తగ్గితే అనేక రోగాలు వస్తాయి. మరి ఈ రక్తం శరీరంలో ఎలా తయారు అవుతుంది?

Blood Formation Details : అందరికీ శరీరంలో రక్తం ఉంటుందని తెలుసు. కానీ ఈ రక్తం మన శరీరంలో ఎక్కడ తయారవుతుంది.. లేదా ఎక్కడి నుంచి వస్తుంది అనే విషయాలు చాలామందికి తెలియదు. సాధారణంగా రక్తం అనేది జీవితాన్ని కొనసాగించే ద్రవం. ఇది శరీరంలోని రక్త నాళాలలో నిరంతరం ప్రవహిస్తుంది. దీనిలో మూడు రకాల నాళాలు ఉంటాయి. అవి ధమనులు, సిరలు, శోషరస నాళాలు. రక్తం వీటి ద్వారా శరీరం అంతటా ప్రయాణిస్తుంది. ఆక్సిజన్, పోషకాలు, అవసరమైన మూలకాలను అందిస్తుంది. వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది.
రక్తం ఎలా తయారవుతుందంటే..
మన శరీరంలోని రక్తం ఎముకల లోపల ఉండే బోన్ మ్యారోతో తయారవుతుంది. ఈ బోన్ మ్యారో ఒక రకమైన మృదువైన, స్పంజి పదార్ధం. ఇది ఎముకల మధ్యలో నిండి ఉంటుంది. శరీరంలోని దాదాపు 95 శాతం రక్త కణాలు ఇక్కడే తయారవుతాయి. పెద్దయ్యాక బోన్ మ్యారోలో ఎక్కువ భాగం మన తుంటి ఎముకలు, ఛాతీ ఎముక, వెన్నెముకలో కనిపిస్తుంది. శరీరంలోని మరికొన్ని అవయవాలు రక్త కణాలను సమతుల్యం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వీటిలో లింఫ్ నోడ్స్, ప్లీహము (స్ప్లీన్), కాలేయం కూడా ఉన్నాయి. ఈ అవయవాలు కలిసి ఏ సమయంలో ఎన్ని రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి? ఎప్పుడు విచ్ఛిన్నమవుతాయి? ఎప్పుడు ఒక నిర్దిష్ట రకం కణంగా మారాలి అనేవి నిర్ణయిస్తాయి.
బోన్ మ్యారోలో ఏర్పడే అన్ని రక్త కణాలు ప్రారంభంలో మూల కణంగా ఉంటాయి. ఈ మూల కణాలు నెమ్మదిగా మారి వివిధ రకాల కణాలుగా అభివృద్ధి చెందుతాయి. వీటిలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్‌లెట్స్ ఉన్నాయి. ఇవి అసంపూర్ణంగా ఉన్నప్పుడు.. వాటిని 'బ్లాస్ట్' అంటారు. కొన్ని బ్లాస్ట్‌లు బోన్ మ్యారోలోనే ఉండి అభివృద్ధి చెందుతాయి. మరికొన్ని శరీరంలోని వివిధ భాగాలకు వెళ్లి పూర్తిగా అభివృద్ధి చెందిన కణాలుగా మారతాయి.
రక్త కణాల విధులు
- ఎర్ర రక్త కణాలు : వీటి ప్రధాన పని ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్‌ను మొత్తం శరీరానికి చేరవేయడం, శరీరంలో ఏర్పడే కార్బన్ డయాక్సైడ్‌ను తిరిగి ఊపిరితిత్తులకు తీసుకురావడమే. ఈ కణాలలో ఉండే హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఈ ప్రక్రియను సులభతరం చేస్తుంది.
- తెల్ల రక్త కణాలు : ఇవి శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. వీటిలో న్యూట్రోఫిల్స్, ఇసినోఫిల్స్, లింఫోసైట్లు, మోనోసైట్లు, బాసోఫిల్స్ వంటి అనేక రకాల కణాలు ఉన్నాయి. ప్రతి రకం కణం ఏదో ఒక నిర్దిష్ట రకం ఇన్ఫెక్షన్‌తో పోరాడడంలో హెల్ప్ చేస్తాయి.
అంతేకాకుండా ప్లేట్‌లెట్స్ శరీరంలో రక్తం గడ్డకట్టడానికి సహాయపడతాయి. తద్వారా గాయమైనప్పుడు రక్తం కారకుండా ఆపవచ్చు. శరీరంలో ఈ మూడింటిలో దేనిలోనైనా లోపం ఏర్పడితే.. శరీరంలో దాని లక్షణాలు కనిపిస్తాయి.






















