మనిషి మాంసం తినే ఈ బ్యాక్టీరియాతో జాగ్రత్త, వీటి వల్ల ప్రాణానికే ముప్పు
11 ఏళ్ల బాలుడు బాలుడికి చిన్న గాయం తగిలింది, ఆ గాయం వల్లే అతను మరణించాడు. దానికి కారణం మాంసం తినే బ్యాక్టీరియా.
ఫ్లోరిడాలోని 11 ఏళ్ల బాలుడి మరణం అక్కడ ఎంతో మందిలో వణుకు పుట్టించింది. దానికి కారణం అతను మరణించింది ‘మాంసాన్ని తినే బ్యాక్టీరియా’ వల్ల. అతనికి చీలమండ భాగంలో చిన్న గాయం అయితే ఆ గాయం ద్వారా మాంసాన్ని తినే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించింది. దీని వల్ల ఇన్ఫెక్షన్ తీవ్రంగా కలిగింది. ఆ బ్యాక్టీరియా రక్తంలోకి చేరి అవయవాలను పనిచేయకుండా చేసి మరణం సంభవించేలా చేసింది. అందుకే మనిషి మాంసం తినే బ్యాక్టీరియాతో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు వైద్యులు. చిన్న గాయమైనా కూడా దాన్ని తేలికగా తీసుకోకూడదని, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ క్రీములు వంటివి పూసి త్వరగా నయం అయ్యేలా చేసుకోవాలని సూచిస్తున్నారు.
అసలు ఏంటి బ్యాక్టీరియా?
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం మాంసం తినే ఈ బ్యాక్టీరియా పేరు ‘గ్రూప్ A స్ట్రెప్టోకోకస్’. ఈ బ్యాక్టిరియా చిన్న అనారోగ్యాలు, గాయాలు, వ్యాధులు కలిగినప్పుడు శరీరంలో చేరి ప్రాణాంతకంగా మారుతుంది. ఈ బ్యాక్టీరియా వల్ల రక్తంలో ఇన్ఫెక్షన్ వస్తుంది . కీళ్లు ఎర్రగా మారిపోవడం, గుండె కణజాలం దెబ్బ తినడం లేదా మాంసం తినే బ్యాక్టీరియాగా అభివృద్ధి చెందడం వంటివి కలుగుతాయి. ఇవన్నీ కూడా ప్రాణాంతకమైనవే.
ఎందుకు వస్తుంది?
అపరిశుభ్ర వాతావరణం వల్ల, గాయాలు కలిగినప్పుడు వాటిని పట్టించుకోకుండా వదిలేయడం వల్ల ఈ బ్యాక్టీరియా శరీరంలో చేరుతుంది. ఇది రక్తంలో చేరి అనేక ఇన్ఫెక్షన్లను కలిగిస్తాయి. టాక్సిక్ షాక్ సిండ్రోమ్ వంటివి కలిగే అవకాశం ఉంది.
ఈ బ్యాక్టిరియాలు రోగ నిరోధక వ్యవస్థను నిర్వీర్యం చేస్తాయి. ఈ బ్యాక్టీరియాను చంపే శక్తి మన శరీరంలో ఉండదు. ఈ బ్యాక్టీరియా ఒక అంటు వ్యాధి. ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి చాలా సులువుగా వ్యాపిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ బారిన పడిన వ్యక్తులు దగ్గడం, తుమ్మడం ద్వారా బ్యాక్టీరియాను బయటికి పంపిస్తారు. ఆ బాక్టీరియా చర్మం మీద పడినా కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
శరీరంపై గాయాలు తగిలినప్పుడు వారం రోజుల్లోనే అవి దాదాపు తగ్గిపోవాలి. అలా కాకుండా పుండులా మారి, పచ్చిగానే ఉంటే జాగ్రత్త పడాలి. అలాంటి పుండ్లు వచ్చినప్పుడే ఈ బ్యాక్టిరియాలో లోపలికి చేరుతుంది. డ్రైనేజీలకు దూరంగా ఉండాలి. యాంటీ బ్యాక్టిరియల్ హ్యాండ్ వాష్‌ను ఉపయోగించి చేతులు కడుక్కోవాలి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తినాలి. ధూమపానం, ఆల్కహాల్ వంటి అలవాట్లను వదిలేయాలి. పరిశుభ్రత పాటించాలి.
Also read: పాదాలకు పగుళ్లు ఎందుకు వస్తాయి? వాటిని తగ్గించే ఇంటి చిట్కాలు ఇవిగో
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.