Benefits of Sesame Seeds: రోజుకో నువ్వుల లడ్డూ తింటే ఎన్నిలాభాలో...
ప్రాచీన కాలం నుంచి మన వినియోగంలో ఉన్న ఆహారపదార్థాలలో నువ్వులు కూడా ఒకటి.
ఆధునిక కాలంలో నువ్వులు వాడకం చాలా తగ్గిపోయింది. పిజ్జాలు, చాక్లెట్లకు అలవాటు పడిన పిల్లలకు నువ్వుల లడ్డూల్లాంటి వాటి గురించి కనీసం తెలియని పరిస్థితి ఏర్పడింది. తల్లిదండ్రులే ఇలాంటి ఆరోగ్యకరమైన అలవాట్లను పిల్లలకు నేర్పాల్సి ఉంది. నువ్వులతో చేసిన వంటలు కేవలం పిల్లలకే కాదు, పెద్దలకూ చాలా అవసరం. వీటి నుంచి అందే పోషకాలు సంపూర్ణ ఆరోగ్యానికి సహకరిస్తాయి. ముఖ్యంగా మహిళలకు నువ్వులు చాలా మేలు చేస్తాయి. రుతుక్రమం సమయంలో చాలా రక్తాన్ని కోల్పోతారు స్త్రీలు. అందుకే వాళ్లు తరచూ నువ్వులతో చేసిన వంటలను తినడం అలవాటు చేసుకోవాలి. ఇందులో ఉండే ఇనుము, రక్త ఉత్పత్తిని పెంచుతుంది. తద్వారా రక్తహీనత సమస్యలను దూరం చేస్తుంది. నువ్వులు, బెల్లం కలిపి లడ్డూల్లా చేసి తింటే చాలా మంచిది. బెల్లంలో కూడా ఇనుము లభిస్తుంది.
కొన్ని అధ్యయనాల ప్రకారం నల్లనువ్వులు రొమ్ము క్యాన్సర్ ను నివారించడంలో ముందుంటాయి. అంతేకాదు మెదడులో కణితిలు ఏర్పడడాన్ని అడ్డుకుని, క్యాన్సర్ రాకుండా నిరోధిస్తాయి. క్యాన్సర్లలో భయంకరమైనది లుకేమియా. నల్లనువ్వుల్లో ఉండే ఆప్టోప్టోసిన్ లుకేమియాకు గురికాకుండా కాపాడుతుంది. నువ్వుల్లో ఇనుముతో పాటూ కాపర్, విటమిన్ బి6 పుష్కలంగా ఉంటాయి. ఇవి కణజాలాల నిర్మాణానికి అత్యవసరం. మొక్కల నుంచి లభించే ప్రోటీన్ నువ్వుల్లో కూడా లభిస్తుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారు రోజూ ఒక స్పూను నువ్వులు తింటే మంచి ఫలితం ఉంటుంది. హార్మోన్ సమస్యలను కూడా నువ్వుల్లో ఉండే ప్రోటీన్ పరిష్కరిస్తుంది. రక్తపోటుతో బాధపడుతున్న వారు కూడా నువ్వులను రోజూ వారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. రక్త పోటును నియంత్రణలో ఉంచగల గుణాలు నువ్వుల్లో ఉన్నాయి.
రోజూ నువ్వుల పొడిని గోరువెచ్చటి నీళ్లలో కలుపుకుని తాగితే చర్మరోగాలు, కీళ్ల నొప్పుల నుంచి బయటపడొచ్చు. శ్వాసకోశ సమస్యలు వేధిస్తున్నప్పుడు నల్లనువ్వులను నీటిలో నానబెట్టి, ఆ నీటిని వడకట్టుకుని అందులో కాస్త తేనె కలుపుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఎముకల పటుత్వానికి కాల్షియం చాలా అవసరం. నువ్వుల్లో కాల్షియం లభిస్తుంది. ఇది పూర్తిగా జీర్ణమవుతుంది. నిజానికి టాబ్లెట్ల రూపంలో తీసుకునే కాల్షియం సగమే జీర్ణమవుతుంది. కాబట్టి నువ్వుల ద్వారా కాల్షియాన్ని స్వీకరించడం ఉత్తమమైన పద్ధతి.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: సోనూసూద్ కు మరో గుడి... ఈసారి ఏ గ్రామంలో కట్టారంటే?
Also read: ఊరగాయలు, పెరుగు రోజూ తినడం మంచిదేనా? స్టాన్ ఫోర్డ్ అధ్యయనం ఏం తేల్చింది?