US Terror Attack: న్యూ ఇయర్ వేడుకల్లో ఉగ్రదాడి- జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు - 12 మంది మృతి
US Road Accident : న్యూ ఓర్లీన్స్‌లో ఒక ట్రక్కు జనంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 12 మంది మరణించారు, 30 మంది గాయపడ్డారు. ఈ ఘటనను ఉగ్రవాద దాడిగా అభివర్ణించారు.
US Road Accident : కొత్త సంవత్సరం అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపితే.. మరికొన్ని జీవితాలు మాత్రం విషాదంగా ముగిసిపోయాయి. ఓ పక్క సెలబ్రేషన్స్.. మరో పక్క యాక్సిడెంట్స్, మర్డర్స్. న్యూ ఇయర్ సంబరాల్లో లీనమైన వేళ అమెరికాలో విషాదం అలుముకుంది. లూసియానా రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో 30మంది గాయాల పాలయ్యారు. ఈ సంఘటన న్యూ ఓర్లీన్స్‌లోని ప్రసిద్ధ కెనాల్ - బోర్బన్ స్ట్రీట్‌లో జరిగింది. ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానిక అధికారులు ఈ సంఘటనను ఉగ్రవాద దాడిగా పేర్కొన్నారు.
ఉద్దేశపూర్వకంగానే చేశాడా..?
ఈ సంఘటన ఉద్దేశపూర్వకంగా జరిగినట్లు కనిపిస్తోందని స్థానిక అధికారులు అభిప్రాయపడుతున్నారు. దాడి చేసిన వ్యక్తి ట్రక్కుతో జనాన్ని చిదిమేయడమే కాకుండా, ఆ తర్వాత తన ఆయుధంతో కాల్పులు జరపడం భయాందోళనలకు గురిచేసింది. ఘటన అనంతరం అక్కడక్కడా ప్రజలు పరుగులు తీస్తుండగా గాయపడిన వ్యక్తులు నేలపై పడి కనిపించారు. సమాచారమందుకున్న న్యూ ఓర్లీన్స్ పోలీసులు వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే దాడికి పాల్పడిన వ్యక్తి ఇంకా పరారీలోనే ఉన్నట్టు సమాచారం.
Also Read : Yoon Suk Yeol: త్వరలో దక్షిణ కొరియా అధ్యక్షుడు అరెస్ట్.. మళ్లీ ఎన్నికలు తప్పవా..?
ఈ ఘటనపై పోలీసులతో పాటు ఎఫ్‌బీఐ (FBI) కూడా దర్యాప్తు చేస్తోంది. ఘటనా స్థలంలో 'ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్‌లు' (ఐఈడీలు) కూడా లభ్యమయ్యాయని, దీంతో దాడి మరింత తీవ్రమవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ దాడిపై న్యూ ఓర్లీన్స్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ, ఈ సంఘటనకు సంబంధించిన దర్యాప్తు ఇప్పుడు ఎఫ్‌బీఐ చేతిలో ఉందని, అందుకోసం దాదాపు మూడు వందల మందికి పైగా అధికారులు మోహరించారన్నారు. అయినప్పటికీ, దాడి చేసిన వ్యక్తి బారికేడ్లను బద్దలు కొట్టి తన ప్లాన్ ను అమలు చేసి, పరారైనట్టు తెలుస్తోంది. అయితే దాడి చేసిన వ్యక్తి.. ఉద్దేశపూర్వకంగానే ఈ చర్యకు పాల్పడినట్టు అనిపిస్తోందని అధికారి చెప్పారు.
తాజా ఘటనతో న్యూ ఓర్లీన్స్ పరిసరాల్లో భయానక వాతావరణం నెలకొంది. అంతా కొత్త సంవత్సర వేడుకలను జరుపుకుంటుండగా ఒక్కసారిగా వాహనం దూసుకు రావడంతో అంతా భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఆ వ్యక్తి అసలు ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డాడు, దీని వెనక ఇంకా ఎవరైనా అన్న కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : Bangladesh: పేనుకు పెత్తనం ఇచ్చినట్లుగా బంగ్లాదేశ్ పరిస్థితి - రాజ్యాంగాన్ని మార్చేయమంటున్న ఆందోళనకారులు !