4-Day Working Week: ఆ దేశంలో ఇక నాలుగు రోజులే పని.. 3 రోజులు వీకెండ్ హాలీడేస్!
ఆ దేశంలో ఇక నాలుగు రోజులే పని దినాలు. పని గంటలు ముగిసిన తర్వాత కూడా పనిచేయాలని అడిగితే.. బాస్‌ను తిరస్కరించే హక్కు ఉంది.
Four Day Work Week | కార్మిక చట్టాలు మన దేశంలో ఎలా అమలవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారం రోజులపాటు వెట్టి చాకిరీ చేయించుకున్నా పట్టించుకొనే నాథులే ఉండరు. 5 రోజుల పనిదినాలు అమలు చేయాలనే నిబంధన కేవలం కాగితాలకే పరిమితం. ఫలితంగా ఎంతోమంది ఉద్యోగులు విశ్రాంతి లేకుండా గంటలకొద్ది పనిచేస్తున్నారు. ముఖ్యంగా ప్రైవేటు సంస్థల్లో పరిస్థితి దారుణంగా ఉంది. భారతీయ చట్టాల ప్రకారం (Factory Act, 1948) ప్రకారం.. 48 గంటలు మాత్రమే పనిచేయాలి. కానీ, ఇది ఎంతవరకు అమలవుతుందో తెలిసిందే. అయితే, కొన్ని దేశాలు ఈ విషయంలో చాలా కచ్చితంగా ఉంటాయి. అలాగే, ఉద్యోగులు కూడా రాజీ పడరు.
ఉద్యోగులకు రెండు రోజులు వీక్-ఆఫ్‌లు ఇవ్వడానికే ఆలోచిస్తున్న ఈ రోజుల్లో.. బెల్జియం ఏకంగా తమ ఉద్యోగులకు 4 రోజుల పని దినాలను అమల్లోకి తెచ్చింది. అంటే.. 4 రోజులు పనిచేసి, మిగతా మూడు రోజులు వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాదు, రోజుకు కేటాయించిన పని గంటలు కంటే ఎక్కువ పని చేయించుకంటే యజమానులను తిరస్కరించే హక్కును కూడా ఉద్యోగులకు కల్పించింది. వేరియబుల్ వర్కింగ్ షెడ్యూల్‌ను కూడా అభ్యర్థించవచ్చు.
కొత్త చట్టం ప్రకారం కార్మికులు వారంలో నాలుగు రోజుల పని దినాలను ఎంపిక చేసుకోవచ్చు. అలాగే.. యజమానులకు భయపడకుండా పని గంటల తర్వాత తమని ఆపేయడం లేదా, పరికారాలను నిలిపేయడం వంటి హక్కులు కూడా లభిస్తాయి. ఈ సందర్భంగా బెల్జియం ప్రధాన మంత్రి అలెగ్జాండర్ డి క్రూ మాట్లాడుతూ.. ‘‘కోవిడ్ వల్ల రెండేళ్ల ఎన్నో కష్టాలను అనుభవించాం. ఈ చట్టంతో మేం మరింత వినూతన, స్థిరమైన, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దారి చూపుతాం. ప్రజలను, వ్యాపారులను బలోపేతం చేయడం మా లక్ష్యం’’ అని తెలిపారు.
పని గంటలు పెరుగుతాయ్: మూడు రోజుల వారాంతాన్ని పొందడానికి ఉద్యోగులు పనివారంలో ఎక్కువ గంటలు పని చేయాల్సి ఉంటుంది. అంటే.. మూడో ఆఫ్ కావాలంటే.. 38 గంటలు పనిచేయాలి. ఇందుకు కార్మికులు వేరియబుల్ వర్క్ షెడ్యూల్‌లను కూడా అభ్యర్థించగలరు. కార్మిక మంత్రి పియర్ వైవ్స్ డెర్మాగ్నే మాట్లాడుతూ.. కార్మికులు తమ పిల్లలతో ఎక్కువ సమయం గడిపేందుకు ఉపయోగపడుతుందని, విడాకులు తీసుకున్న లేదా విడిపోయిన తల్లిదండ్రులు తమ పిల్ల బాధ్యతలను పంచుకొనేందుకు ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు.
Also Read: ఖి‘లేడీ’ కిల్లర్ - అమ్మాయిలను చంపేసి, శవాలతో కేకులు చేసుకుని తినేసింది, కారణం పెద్దదే!
20 కంటే ఎక్కువ మంది సిబ్బంది ఉన్న యజమానులందరికీ ఈ కొత్త చట్టం వర్తిస్తుంది. నాలుగు-రోజుల పని వారానికి ఉద్యోగి పెట్టుకొనే అభ్యర్థనను తిరస్కరించే హక్కు యజమానులకు ఉంది. అయితే, ఇందుకు వారు వ్రాతపూర్వకంగా వివరణ ఇవ్వాల్సి ఉంది. ఉద్యోగులు ఆరు నెలలకు నాలుగు రోజుల పని దినాలను ఎంపిక చేసుకోవచ్చు. అవసరమైతే తిరిగి 5 రోజుల పని దినాలకు తిరిగి వెళ్లవచ్చు.
Also Read: చీమలే దెయ్యాలా? ఆ అడవిలో ఇతర చెట్లను చంపేస్తున్న చెట్లు.. అసలు నిజం వేరే ఉంది!