Devil's Garden: చీమలే దెయ్యాలా?.. ఆ అడవిలో ఇతర చెట్లను చంపేస్తున్న చెట్లు.. కానీ, అసలు నిజం వేరే ఉంది!
ఆ అడవిలో దెయ్యాలు ఉన్నాయని, అవి చెట్లను కూడా పాతాయాని.. వాటికి బదులు వేరే మొక్కలు నాటితే అవి వాటిని చంపేస్తాయని అంతా కథలు కథలుగా చెప్పుకున్నారు. కానీ, పరిశోధనల్లో అసలు రహస్యం బయటపడింది.
అడవులు అనగానే.. మనకు గుర్తుకొచ్చేది గుబురైన చెట్లు, పొదలే కదూ. కానీ, ఆ అడవిలో అడుగుపెడితే.. ఒకే ఒకే రకం చెట్లు కనిపిస్తాయి. వాటి చుట్టుపక్కల మరే జాతీ మొక్కలు, చెట్లు పెరగవు. ఒక వేళ పెరిగినా అవి చచ్చిపోతాయి. ఎవరైనా అక్కడ కొత్త జాతి మొక్కను నాటినా.. ఎన్నాళ్లో బతకదు. అక్కడి వాతావరణ పరిస్థితులే అందుకు కారణం ఏమో అని చాలామంది భావించారు. ఆ ప్రాంతానికి కొద్ది దూరంలో పెరిగే మొక్కలను సేకరించి కూడా అక్కడ నాటారు. కానీ, అదే ఫలితం కనిపించింది. కేవలం అక్కడ ఒకే జాతి చెట్లు పెరుగుతున్నాయి. ఎందుకంటే.. అది దెయ్యాలు నివసించే ప్రాంతమట. అక్కడ కేవలం దెయ్యాలు నాటిన ఒక జాతి మొక్క జీవించగలదట. ఆ ప్రాంతానికి వెళ్తే.. దెయ్యాలు వెంటాడుతాయట. అందుకే, ఆ అడవికి అంతా డెవిల్స్ గార్డెన్ అని పేరు పెట్టారు. స్థానిక గిరిజనులు సైతం ఎప్పుడూ ఆ ప్రాంతానికి వెళ్లే సాహసం చేయరు.
ప్రపంచంలోనే అతిపెద్ద అటవీ ప్రాంతం అమెజాన్. ఇక్కడి రెయిన్‌ఫారెస్ట్‌లో కొన్ని లక్షల రకాల చెట్లు పెరుగుతున్నాయి. కానీ, డెవిల్ గార్డెన్స్‌లో మాత్రం కేవలం ఒకేరకానికి చెందిన చెట్లు పెరుగుతున్నాయి. వాటి చుట్టుపక్కల ఎక్కడా మరే ఇతర జాతి మొక్కలు పెరగవు. ఒక వేళ మొలిచినా.. ఒక రోజు వ్యవధిలోనే కనుమరుగవుతాయి. కొన్ని వందల ఏళ్ల నుంచి అక్కడ ఈ పరిస్థితి ఉంది. స్థానిక గిరిజనులు కూడా అవి దెయ్యాలు నాటిన చెట్లుగా భావిస్తారు. అందుకే, అక్కడ వేరే జాతి మొక్కలు పెరగవని చెబుతుంటారు. అది దుష్టశక్తులు నివసించే ప్రాంతమని పురాణాల్లో కూడా పేర్కొన్నారు. అంతేకాదు.. వీటిని కదిలే అడవులని కూడా పేర్కొంటారు. ఎందుకంటే.. ఆ చెట్లు కాలక్రమేనా విస్తరిస్తున్నాయేగానీ.. తరగడం లేదు. దాని చుట్టుపక్కల ఉన్న ఇతర జాతి చెట్లకు కూడా అవి ప్రమాదకరంగా మారాయి. అయితే, చెట్ల వల్ల మిగతా చెట్లు ఎందుకు చనిపోతున్నాయనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఆ చెట్లు విషవాయులు విస్తరిస్తాయా? లేదా వాటి వేళ్లు ఏమైనా రసాయనాలు విడుదల చేస్తాయా అనే సందేహాలతో పరిశోధకులు ఎన్నో పరీక్షలు జరిపారు. ఎట్టకేలకు ఆ పని దెయ్యాలు చేస్తున్న పని కాదని తెలుసుకున్నారు. అక్కడ వేరే చెట్లు పెరగకపోవడానికి కారణం.. చీమలని తెలుసుకుని ఆశ్చర్యపోయారు.
ఔను.. చిన్న చీమల వల్లే మొత్తం ఆ అడవి స్వరూపం మారిపోయింది. కానీ, చీమలకు ఇతర జాతి మొక్కలను నాశనం చేసేంత సామర్థ్యం ఉందా? అవి ఎలా ఇతర మొక్కలను అంతం చేస్తున్నాయనేది కూడా ఆసక్తి కలిగించింది.
అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌లోని డెవిల్స్ గార్డెన్స్ దాదాపు పూర్తిగా ఒకే రకమైన వృక్షజాతి చెట్లు పెరుగుతున్నాయి. దురోయా హిర్సుటా రకానికి చెందిన ఈ చెట్టు మూలాలు బలమైన మొక్కల పెరుగుదల నిరోధకాన్ని కలిగి ఉంటాయని తొలుత భావించారు. ఈ చెట్లలోని ప్లూమెరిసిన్ వల్ల ఇతర మొక్కలు దాని దరిదాపుల్లో పెరగలేవని అనుకున్నారు. కానీ వారి అంచనాలు తప్పపని 2000 సంవత్సరంలోనే తెలుసుకున్నారు. ఆ చెట్ల చుట్టుపక్కల మొలిచే ఇతర జాతి మొక్కలను చంపేది.. దురోయా హిర్సుటా కాదని, లెమన్ యాంట్స్ అని పిలిచే చీమలని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. హిర్సుటా చెట్లు 12 అడుగుల కంటే ఎత్తు పెరగవు. చెప్పాలంటే.. అమెజాన్ అడవుల్లో పెరిగే చెట్లతో పోల్చితే వీటి ఎత్తు చాలా తక్కువ.
అడవుల్లో చెట్లు వాటంతట అవే పెరుగుతాయని మనకు తెలిసిందే. కానీ, ఈ చెట్లను మాత్రం ఎవరో వరుసగా నాటినట్లుగా కనిపిస్తాయి. అందుకే, పూర్వికులు వాటిని దెయ్యాలే పాతి ఉంటాయని నమ్మేవారు. ఆ ప్రాంతంలో నడుచుకుని వెళ్తున్నప్పుడు అడవిలోని ఇతర ప్రాంతాలకు, ఆ ప్రాంతానికి మధ్య వ్యత్యాసాన్ని చాలా సులభంగా గుర్తించవచ్చు. లెమన్ యాంట్‌ను మైర్మెలాచిస్టా షూమన్నీ అని కూడా అంటారు. అవి హిర్సుటా చెట్ల బోలు, కాండాల్లో క్యాప్సుల్ తరహా గూళ్లను ఏర్పాటు చేసుకుని జీవిస్తుంటాయి. అవి వాటి మనుగడ కోసం.. ఆ చెట్ల విస్తరణకు సహరిస్తున్నాయి. ఈ చీమలు ఇతర చెట్లను పెరగకుండా ఉంచేందుకు వాటిలో ఉత్పత్తయ్యే ‘Herbicide’ (హెర్బిసైడ్)ను ఉపయోగిస్తున్నాయని తెలుసుకున్నారు. ఈ రసాయాన్ని కలుపు మొక్కల నివారణలో ఎక్కువగా వాడతారు. చీమలు కూడా తమలోని ఆ రసాయాన్ని ఇతర మొక్కలపై చల్లడం ద్వారా చుట్టుపక్కలే మరే జాతి మొక్కలు పెరగకుండా చేస్తున్నాయని తెలుసుకున్నారు.
Also Read: చనిపోయినా వదలరు.. మూడేళ్ల తర్వాత సమాధుల నుంచి శవాలను బయటకు తీసి.. అరాచకం కాదు, ఆచారం
ఇది నిజమా.. కాదా అని తెలుసుకోవడం కోసం పరిశోధకులు.. డెవిల్స్ గార్డెన్‌లో సాధారణ సెడ్రెలా ఓడోరాటా అనే మొక్కలను నాటారు. ఊహించినట్లే.. చీమలు ఆ మొక్కలపై దాడి చేసి ఆ మొక్కలను పెరగకుండా చేశాయి. ఆ చీమలు తమ శరీరంలోని విషాన్ని (రసాయనాలు)ను ఆ మొక్కల్లోకి చొప్పించాయి. అంతే.. 24 గంటల్లోనే ఆ మొక్కలన్నీ చనిపోయాయి. ఆ మొక్కలు మొత్తం.. కాల్చేసినట్లుగా మాడిపోయాయి. ఆ చీమలు మొక్కలను చంపేందుకు ఫార్మిక్ ఆమ్లాన్ని వదులుతున్నట్లు తెలుసుకున్నారు. మరో చిత్రమైన విషయం ఏమిటంటే.. డెవిల్స్ గార్డెన్‌లో పెద్ద చీమల కాలనీలే ఉన్నాయి. శాస్త్రవేత్తలు దాదాపు 15 వేల రాణాలు(చీమలకు లీడర్) ఆ కాలనీల్లో నివిస్తున్నాయని తెలుసుకున్నారు. సుమారు 800 ఏళ్ల నుంచి ఆ చీమలు ఉనికిలో ఉండటానికి కారణం ఇదేనని భావిస్తున్నారు.
Also Read: మీరు మారరా? చైనీసే కాదు.. ఈ దేశస్తులూ గబ్బిలాలు తినడం ఆపలేదు.. ఎందుకు తింటున్నారో తెలిస్తే షాకే!
ఎందుకు చంపేస్తున్నాయి?: ఈ లెమన్ చీమలు.. మట్టితో పుట్టను నిర్మించుకోడానికి బదులుగా హిర్సుటా చెట్లనే ఆవాసంగా మార్చుకున్నాయి. ఆ చీమల జాతి మనుగడ కూడా ఆ చెట్లపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే, హిర్సుటా చెట్లు మాత్రమే అక్కడ పెరగడం కోసం ఆ చీమలు అక్కడ వేరే జాతి మొక్కలను పెరగకుండా చేస్తాయి. ఇతర మొక్కలను చంపడం ద్వారా ఆ చీమలు హిర్సుటా మొక్కలు పెరిగేందుకు స్థలాన్ని ఇస్తాయి. అందుకే అక్కడ కేవలం హిర్సుటా చెట్లే కనిపిస్తాయి. ఎన్ని హిర్సుటా చెట్లు అక్కడ పెరిగితే.. అన్నీ చీమల కాలనీలు ఏర్పాటవుతాయి. అంటే.. భవిష్యత్తులో చీమలకు అవి ఆవాసాలుగా మారుతాయి. చూశారుగా.. చిన్న చీమ తమ మనుగడ కోసం ఎంత ప్లానింగ్‌తో ఉందో. నిజంగా ప్రకృతి చాలా చిత్రమైనది కదూ.