No Smoking: సిగరెట్లు మానకపోతే చూపు పోయే ప్రమాదం, కళ్లను కాపాడుకోండిలా
సిగరెట్లో గుండెకు, ఊపిరితిత్తులకే కాదు, కళ్లకు కూడా చాలా ప్రమాదం.
ధూమపానం వల్ల కలిగే లాభం ఒక్కటి కూడా లేదు,అదే నష్టాలు చెప్పమంటే ఆగకుండా ఒక గంటసేపు చెప్పచ్చు. రెండు మూడు నిమిషాలు కలిగే కిక్కు కోసం సిగరెట్ కాలిస్తే శరీరంలోని ప్రధాన అవయవాలకు ముప్పుతప్పదు. ధూమాపానం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, మధుమేహం వంటి రోగాలు వస్తాయనే చాలా మందికి తెలుసు. కానీ సిగరెట్ పొగ కళ్లను కూడా ప్రభావితం చేస్తుంది. కంటిలోని రక్తనాళాలపై పడే ప్రభావం దీర్ఘకాలికంగా కంటి చూపు పోయేలా చేస్తుంది. ధూమాపానం చేస్తున్న వారిలో కింద చెప్పిన లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆ అలవాటును మానివేయాలి. కళ్ల వైద్యులను సంప్రదించాలి.
1. చూపు మసకగా మారడం
ధూమాపానం వల్ల కళ్లకు సరిగా ఆక్సిజన్ అందదు. దీనివల్ల చూపు మసకబారడం, కళ్లలో మంట వంటివి కలుగుతాయి. వ్యాయామం చేయడం ద్వారా కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అంతేకాదు సిగరెట్ తాగడం మానివేయాలి. కంటివ్యాయామాలను వైద్యులను అడిగి తెలుసుకుని రోజులో కాసేపు చేయాలి.
2. కళ్లు పొడి బారడం
ధూమపానం వల్ల కళ్లపై చాలా ప్రతికూల ప్రభావాలు పడతాయి. అందులో కళ్ల పొడిబారిపోవడం ఒకటి. కళ్లలో డీహైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది. వారు కంప్యూటర్ స్క్రీన్ కూడా సరిగా చూడలేరు. ఈ సమస్యతో బాధపడుతున్నవారు ప్రతి 20 నిమిషాలకోసారి కంటికి విశ్రాంతి ఇవ్వాలి. అలాగే పొడి కళ్లకు ఐడ్రాప్స్ ను వైద్యుని పర్యవేక్షణలో వాడాలి. ధూమపానం ఆపకపోతే సమస్య తీవ్రంగా మారుతుంది.
3. కంటి శుక్లాలు
సిగరెట్ పొగ వల్ల కంటిశుక్లాలు వచ్చే ప్రమాదం ఎక్కువ. ఇవి వస్తే చూడడం చాలా కష్టమవుతుంది. కంటిశుక్లాలు వచ్చాయో అవి కేవలం ఆపరేషన్ ద్వారానే తగ్గుతాయి. కాబట్టి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.
పైన చెప్పిన లక్షణాలతో పాటూ చూపు ముందు పొగ మంచు కురిసినట్టు కనిపించడం, లైట్లు చూస్తుంటే మరింత మెరిసినట్టు కనిపించడం, వెలుతురు తగ్గినప్పుడు వస్తువులను చూడడంలో ఇబ్బంది పడడం వంటివి కనిపిస్తాయి.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
కంటిచూపు మందగిస్తున్నప్పుడు ధూమపానం వెంటనే మానేయాలి. అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
1. స్క్రీన్ టైమ్ తగ్గించుకోవాలి.
2. కొవ్వు పట్టిన చేపలు తినాలి. కొవ్వులో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి అవసరం.
3. వ్యాయామం చేయాలి.
4. నేరుగా ఎండలోకి వెళ్లకూడదు. ఆ కిరణాలకు కళ్లు దెబ్బతింటాయి.
5. చేతులతో కళ్లను రుద్దడం, నలపడం చేయకూడదు.
6. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా చూసుకోవాలి. అంటే మధుమేహం ఉంటే దాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి.
Also read: రాత్రిళ్లు పక్కతడపడం ఆ ప్రాణాంతక వ్యాధికి సంకేతం కావచ్చు , అధ్యయనంలో షాకింగ్ రిజల్ట్
Also read: ఆవలింతలు ఎందుకొస్తాయో తెలుసా? ఇవే కారణమట