Yawning: ఆవలింతలు ఎందుకొస్తాయో తెలుసా? ఇవే కారణమట
ఆవలింతలు వస్తుంటాయి, కానీ అవెందుకు వస్తాయో చాలా మందికి తెలియదు.
మన శరీరంలో జరిగే ప్రతీ చర్యకు ఒక కారణం ఉంటుంది. అలాగే ఆవలింతలు రావడానికి కూడా ప్రత్యేక కారణాలు ఉన్నాయి. కొంతమంది ఒకసారి ఆవలించి ఊరుకుంటారు. మరికొందరు మాత్రం వరుస పెట్టి ఆవులిస్తూనే ఉంటారు. అసలిలా ఆవలింతలు ఎందుకొస్తాయో తెలుసుకుందాం రండి.
ఎందుకు వస్తాయి?
ఆవలింతలు ఏదో పనిలేని చర్యలా భావిస్తారు చాలా మంది. కానీ శరీరం ఇచ్చే సంకేతాలలో ఇవి కూడా ఒకటి. ఆవలింత మీ మెదడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిని తెలియజేస్తుంది. మెదడు తీవ్రంగా అలసిపోయినప్పుడు ఆవలింతలు వస్తాయని ఒక థియరీ ఉంది.తీవ్రంగా అలసిపోయినప్పుడు శ్వాసక్రియ అంత జోరుగా సాగదు. ఆ లోటును నోరు చాపి పెద్దగా తీసే ఆవులింత తీరుస్తుందని అంటారు. ఆవులింత వల్ల శరీరం కూడా సేదతీరుతుంది. అందుకే ఆవులింతలు తీసే సమయంలో చాలా బద్ధకంగా అనిపిస్తుంది. ఏ పనీ వేగంగా చేయాలనిపించదు. అలాగే మెదడుకు రక్త ప్రసరణ తగ్గినప్పుడు కూడా ఆవలింతలు వచ్చే అవకాశం ఉందని చెబుతారు. ఆవలించడం వల్ల మెదడు తిరిగిన తనను తాను యాక్టివ్ గా చేసుకుంటుందని కొన్ని అధ్యయనాల్లో కూడా తేలింది. కనుక ఆవలింతలు వస్తే మంచిది. అవి బద్దకానికి సంకేతం కాదు.
నిద్రకు సంకేతం కాదు
ఆవులించడం వ్యాధి కాదు, కానీ పక్కవారికి అంటుకుంటుందన్నది మాత్రం నిజం. అంతెందుకు పెంపుడు జంతువులు కూడా తమ యజమానులు ఆవులించడం చూస్తే తాము ఆ పని చేస్తాయి.ఆవులింతలు శరీరానికి చాలా అవసరం. రిలాక్స్ మోడ్‌ను ఆన్ చేస్తాయి. అలాగని నిద్రకు సంకేతాలు మాత్రం కావు. అంతెందుకు రాత్రంతా నిద్రపోయి ఉదయం లేచాక కూడా చాలా మందికి ఆవలింతలు వస్తూనే ఉంటాయి. దానికి కారణం నిద్ర తగ్గడమో, ఇంకా నిద్రపోవాలనో కాదు, మెదడుకి ఆ సమయంలో రక్త ప్రసరణ మందకొడిగా సాగడం కారణం కావచ్చు.
ఒక్కో ఆవలింత తీయడానికి ఆరు సెకన్ల సమయం పడుతుంది. ఒక మనిషి తన జీవిత కాలంలో ఆవలించడానికే 400 గంటలు సమయం తీసుకుంటాడని ఒక అంచనా. అలాగే జీవిత కాలంలో దాదాపు రెండున్నర లక్షల సార్లు ఆవులిస్తాడని కూడా ఒక లెక్క. ఆవలింతలు మొదలయ్యేది గర్భస్థ శిశువుగా తల్లి గర్భంలో ఉన్నప్పుడే. అప్పట్నించే ఆవలింతలు తీస్తూ ఉంటాం. మరణించే వరకు కొనసాగే ప్రక్రియ ఇది.
Also read: రాత్రిళ్లు పక్కతడపడం ఆ ప్రాణాంతక వ్యాధికి సంకేతం కావచ్చు , అధ్యయనంలో షాకింగ్ రిజల్ట్
Also read: బార్లీ జావ తాగితే వడదెబ్బే కాదు, ఈ వ్యాధులు కూడా రావు