AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Pension Guidelines: ఏపీలో పెన్షన్‌దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వరుసగా 2 నెలలు పెన్షన్ తీసుకోకపోయినా మూడో నెలలో మొత్తం 3 నెలల పెన్షన్ అందించేలా మార్గదర్శకాలు జారీ చేసింది.
AP Government New Guidelines For Pension Distribution: పెన్షన్‌దారులకు ఏపీ ప్రభుత్వం (AP Government) గుడ్ న్యూస్ చెప్పింది. పింఛన్ల పంపిణీపై కొత్త మార్గదర్శకాలు (New Guidelines) విడుదల చేసింది. వరుసగా 2 నెలలు పింఛన్ తీసుకోకున్నా మూడో నెలలో ముందు నెలల పింఛన్‌తో కలిపి మొత్తం ఇచ్చేలా ఆదేశాలు జారీ చేసింది. వరుసగా 3 నెలలు పింఛన్ తీసుకోకుంటే శాశ్వతంగా వలస వెళ్లినట్లు భావిస్తూ పింఛన్ నిలిపివేయనున్నారు. ఈ నెల నుంచే ఈ గైడ్ లైన్స్ అమల్లోకి వస్తాయి. అయితే, ఇప్పటివరకూ ఒక నెలలో పింఛన్ తీసుకోకుంటే దాన్ని మళ్లీ ఇచ్చేవారు కాదు. ఇప్పుడు దాన్ని మారుస్తూ పెన్షన్ల పంపిణీని సులభతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (Minister Kondapalli Srinivas) తెలిపారు.
మొదటి నెలలో పెన్షన్ తీసుకోకపోయినా రెండో నెలలో 2 నెలల పెన్షన్ మొత్తాన్ని కలిపి ఇస్తారని, ఒకవేళ 2 నెలల పాటు వరుసగా పెన్షన్ తీసుకోకపోతే ఆ మొత్తాన్ని కలిపి మూడో నెలలో ఒకేసారి ఇస్తామని వెల్లడించారు. 3 నెలల పాటు పింఛన్‌దారుడు పెన్షన్ తీసుకోకుంటే వారిని శాశ్వత వలసదారులుగా గుర్తించి పెన్షన్ నిలిపేస్తామని.. వారు తిరిగి యధా స్థానానికి వచ్చిన తర్వాత పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే పెన్షన్ పునరుద్ధరిస్తామని అన్నారు. వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్న కుటుంబ యజమాని అకస్మాత్తుగా మరణించిన పక్షంలో అతని భార్యకు మరుసటి నెలలోనే వితంతు పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం సంబంధిత అధికార యంత్రాంగానికి ఉత్తర్వులు ఇచ్చిందని అన్నారు. జిల్లాస్థాయిలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్లు, క్షేత్రస్థాయిలో సంబంధిత ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు ఇచ్చినట్టు మంత్రి తెలిపారు.
Also Read: Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై