Artery Plaque : గుండెపోటుకు కారణమవుతోన్న కొలెస్ట్రాల్.. సర్జరీ అవసరం లేకుండా ఇలా నివారించవచ్చట
Heart Health : గుండెపోటు రావడానికి ప్రధాన కారణం ధమనుల్లో ఫలకం ఏర్పడడమే. అయితే దానిని సర్జరీలేకుండా కూడా తగ్గించుకోవచ్చట. ఎలా అంటే..

Reverse Artery Plaque Without Surgery : ఈ మధ్యకాలంలో గుండెపోటు(Heart Attack) కేసులు వేగంగా పెరిగాయి. దీనికి ఒక కారణం ధమనులలో ఫలకం ఏర్పడటమే. ఈ సమస్యను "అథెరోస్క్లెరోసిస్" అంటారు. ఇది గుండెపోటుకు ప్రధాన కారణం. ఈ ఫలకం జిగట పొరలా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్, కాల్షియం, ఇతర పదార్థాలతో తయారవుతుంది. దీని వలన ధమనుల గోడలు బ్లాక్ అవుతాయి. ఇరుకైనవిగా మారతాయి. దీనివల్ల గుండెకు రక్త ప్రవాహం తగ్గుతుంది. దీనివల్లే చాలామంది గుండెపోటు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు.
ఈ ఫలకం ఏర్పడిన తర్వాత దానిని తొలగించలేమని.. మందులు, స్టెంట్లు లేదా శస్త్రచికిత్స మాత్రమే మార్గమనుకుంటారు. కానీ న్యూయార్క్‌కు చెందిన బోర్డ్-సర్టిఫైడ్ ఎమర్జెన్సీ మెడిసిన్ డాక్టర్ వాసిలీ ఎలియోపోలోస్ దీనికో పరిష్కారం కనుగొన్నారు. ధమనులకు అడ్డంకిగా ఏర్పడిన ఈ ఫలకం శాశ్వతంగా ఉండదని కనుగొన్నట్లు తెలిపారు. కొన్ని అంశాలపై దృష్టి పెడితే.. గుండె ప్రమాదాన్ని తగ్గించవచ్చని, ఫలకాన్ని కూడా తిప్పికొట్టవచ్చని చెప్తున్నారు.
ఫలకం క్లియర్ అవుతుందా?
డాక్టర్ వాసిలీ ఎలియోపోలోస్ దీని గురించి మాట్లాడుతూ.. "ఫలకం శాశ్వతంగా ఉంటుందని చెప్తారు. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. ధమనులలో పేరుకుపోయిన ఫలకాన్ని స్టెంట్లు, శస్త్రచికిత్స లేకుండా కూడా తగ్గించుకోవచ్చు అని తెలిపారు. గుండెపోటుకు ప్రధాన కారణం కాల్షియం పేరుకుపోవడం మాత్రమే కాదని.. మృదువైన ఫలకం చిరిగిపోవడమేనని వివరించారు. ఒత్తిడి వల్ల కూడా ఈ సమస్య వచ్చే ప్రమాదం ఉంది. శస్త్రచికిత్స లేదా స్టెంటింగ్ తక్షణ ఉపశమనం ఇస్తుంది. ప్రాణాలను కూడా కాపాడుతుంది. కానీ ఇది వ్యాధి మూలాలపై పనిచేయదు. అందుకే గుండెపోటును నివారించడం చాలా ముఖ్యమని చెప్తున్నారు.
ఎలా గుర్తించాలంటే..
డాక్టర్ వాసిలీ ప్రకారం.. అసలు ప్రమాదాన్ని గుర్తించడానికి ముందుగా.. అధునాతన పరీక్షలు చేయించడం అవసరమని తెలిపారు. సాధారణ కొలెస్ట్రాల్ నివేదిక పూర్తి చిత్రాన్ని చూపించదు. అయితే దీనిలో మొదటి పరీక్ష APOB పరీక్ష అని.. ఇది అసలు లిపిడ్ కణాల లోడ్‌ను రిపోర్ట్‌లో చూపిస్తుందని తెలిపారు. రెండవది హై సెన్సిటివ్ CRP, LP-PLA2 చేయించుకోవాలి. ఇందులో ఫలకాన్ని పెంచే మంట.. మార్కర్ల రూపంలో కనిపిస్తుంది. మూడవది CCTA స్కానింగ్ ద్వారా దీని గురించి తెలుసుకోవచ్చు. దీనిద్వారా ఫలకం ఎక్కడ ఏర్పడుతోంది.. ఏ రకమైనది.. వంటివి తెలుసుకోవచ్చు. దాని ద్వారా అన్ని జాగ్రత్తలు తీసుకోగలుగుతారు.






















