Asthma: కొవ్వొత్తుల పొగ వల్ల ప్రాణాలు పోవచ్చు జాగ్రత్త!
ఇంట్లో ఆస్తమా రోగులు ఉన్నారంటే చాల జాగ్రత్తగా ఉండాలి. శ్వాస తీసుకోవడంలో ఏమాత్రం ఇబ్బంది పడినా అది వాళ్ళ ప్రాణాల మీదకి వస్తుంది.
వాతావరణం చల్లగా ఉంటే ఆస్తమా ఉన్న వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. చలికాలం వస్తుందంటేనే భయపడిపోతారు. మంచు కారణంగా ఇంటి నుంచి అడుగు కూడ బయటకి పెట్టలేని పరిస్థితి. ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడిపోతారు. అయితే ఇవి మాత్రమే కాదు కొవ్వొత్తుల నుంచి వచ్చే పొగ, వంట చేసేటప్పుడు వచ్చే పొగ వల్ల తేలికపాటి ఆస్తమా ఉన్న వారు ప్రమాదంలో పడవచ్చని తాజా అధ్యయనం హెచ్చరిస్తుంది. కొవ్వొత్తులు వెలిగించినప్పుడు, వంట చేసేటప్పుడు గది బాగా వెంటిలేషన్ లేకపోతే 18 నుంచి 25 సంవత్సరాల వయసు కలిగిన ఆస్తమా రోగులు తీవ్ర దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. అవుట్ డోర్ మాత్రమే కాదు ఇండోర్ వాయు కాలుష్యం పీల్చడం వల్ల కూడా ఆస్తమా రోగులు తీవ్ర అనారోగ్యానికి గురావుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కొవ్వొత్తులు వెలిగించినప్పుడు వచ్చే పొగ వల్ల తేలికపాటి ఆస్తమా ఉన్నవారిలో చికాకు, మంట వంటి ప్రతికూల ఆరోగ్య ప్రభావాలు కలిగిస్తుందని తాజా అధ్యయనం తెలిపింది. ఇది మాత్రమే కాదు డీఎన్ఏ దెబ్బతినడం, రక్తంలో మంట సంకేతాలు కూడా పరిశోధకులు గుర్తించారు. అందుకే వంట చేసేటప్పుడు, కొవ్వొత్తులు వెలిగించినప్పుడు గదిలో తగినంత వెంటిలేషన్ ఉండే విధంగా చూసుకోవాలి. ఆస్తమా చిన్న వయసు వారిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. శ్వాస తీసుకోవడం కష్టతరం చేస్తుంది. అలర్జీ, కాలుష్యం వంటి కారణాల వల్ల ఊపిరితిత్తులుకి గాలిని తీసుకెళ్ళే శ్వాస నాళాల వాపు వలన ఈ పరిస్థితి సంభవిస్తుంది. ఊపిరి ఆడకపోవడం, గురక, ఛాతీలో బిగుతుగా అనిపించడం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాలలో తీవ్రమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది, ఒక్కోసారి అది ప్రాణాంతకం కావచ్చు.
అధ్యయనం సాగింది ఇలా..
పార్టికల్ అండ్ ఫైబర్ టాక్సికాలజీలో ప్రచురించిన అధ్యయనం ప్రకారం ఇండోర్ వాయు కాలుష్య కారకాలు ఆస్తమా రోగుల మీద ఎంతవరకు ప్రభావం చూపుతాయో తెలిపోనది. ఇందులో 18 నుంచి 25 సంవత్సరాల వయసు కలిగిన 36 మంది ఆస్తమా బాధితులకు వంట చేసేటప్పుడు వచ్చే ఉద్గారాలకు, ల్యాబ్ లో కొవ్వొత్తుల నుంచి వచ్చే పొగని పీల్చడం వల్ల ఎలా రియాక్ట్ అవుతారో పరిశీలించారు. సుమారు ఐదు గంటల పాటు వాళ్ళు ఇటువంటి గాలిలో ఉండే విధంగా చూశారు. ఎక్స్ పోజర్ సమయంలో పరిశోధకులు రోగుల కణాలు ఎలా మారుతున్నాయో పరిశోధించారు. వంట పొగ కొవ్వొత్తులు పీల్చిన వారిలో చికాకు ఎక్కువగా కనిపించింది.
శీతాకాలం సమీపిస్తోంది. కొవ్వొత్తులు వెలిగించినప్పుడు, వంట చేసేటప్పుడు తలుపులు, కిటికీలు తెరవకుండా ఉంటారు. కారణం బయట చలిగాలి ఇంట్లోకి వచ్చేస్తుందని, ఇల్లు వేడిగా ఉంచడం కోసం తలుపులు మూసేసుకుని ఉంటారు. కానీ అది ఎంత మాత్రం కరెక్ట్ కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఇండోర్ వాతావరణం తీవ్రమైన ఊపిరితిత్తులు, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. క్యాన్సర్ ని తగ్గించడంలో సహాయపడుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: పెరుగు మిలిపోయిందా? ఇదిగో ఈ టేస్టీ వంటలు చేసేయండి