New Moms: పాలిచ్చే తల్లులు తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే
గర్భం దాల్చినప్పుడే కాదు ప్రసవించిన తర్వాత కూడా బాగా తినాలి. లేదంటే తల్లి, బిడ్డ ఇద్దరు అనారోగ్యాల బారిన పడతారు.
మాతృత్వం ఒక మధురానుభూతి. అది మాటల్లో వర్ణించలేనిది. ఇప్పడు అదే అనుభూతి చెందుతున్నారు బాలీవుడ్ క్యూట్ బ్యూటీ అలియా భట్. ఇటీవలే అలియా పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి ప్రసవించే వరకు పోషకాలు నిండిన ఆహారం సమృద్ధిగా తీసుకుంటారు. ఎందుకంటే తల్లి ఇద్దరికీ సరిపడా ఆహారం తీసుకోవాలి. లేదంటే బిడ్డ ఎదుగుదల సక్రమంగా ఉండదు. అయితే కడుపుతో ఉన్నప్పుడే కాదు ప్రసవించిన తర్వాత కూడా తల్లి అదే విధంగా తినడం చాలా ముఖ్యం. తల్లిపాలు ఇచ్చేటప్పుడు అదనపు కేలరీలు అవసరం. లేదంటే బిడ్డకి సరిపడినంత పాలు తల్లి దగ్గర ఉండవు. అంతే కాదు ప్రసవించిన తర్వాత బరువు తగ్గితే దాన్ని మళ్ళీ తిరిగి పొందేందుకు 500-600 కేలరీలు అదనంగా తినాల్సి ఉంటుంది.
కొత్త తల్లులు బాగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. పాలు, నీళ్ళు ఎక్కువగా తీసుకోవాలి. కానీ కెఫీన్ మాత్రం తీసుకోవడం నివారించాలి. తల్లి పాలు శిశువుకి ఎంతో బలం ఇస్తాయి. వాటి వల్లే బిడ్డకి రోగనిరోధక శక్తి వస్తుంది. అందుకే కనీసం ఆరు నెలల పాటు బిడ్డకి తల్లి పాలు ఇవ్వడం చాలా ముఖ్యం అని అందరూ చెప్తారు. పాలు ఇవ్వడం వల్ల తల్లికి మేలు చేస్తుంది. పాలు సమృద్ధిగా రావాలి తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి.
కొత్త తల్లులు తీసుకోవాల్సిన ఆహారం
☀ మాంసం, గుడ్లు, చేపలు, డైరీ ఉత్పత్తులు, బీన్స్, నట్స్, విత్తనాలతో సహా ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ రోజుకి కనీసం 2-3 సార్లు తినేందుకు ప్రయత్నించాలి.
☀ ఒక వేళ మాంసాహారం తినని వాళ్లయితే డ్రై ఫ్రూట్స్, గింజలు, నట్స్ వంటి ఐరన్, జింక్ ఎక్కువగా పొందే ఆహారం తీసుకోవాలి.
☀పసుపు, ఆకుపచ్చ కూరగాయలు, ఆకుకూరలు తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకోవాలి.
☀ ఓట్ మీల్, తృణధాన్యాలు ఎంపిక చేసుకోవడం ఉత్తమం
☀ఆరోగ్యకరమైన ఆహారం తల్లికి, బిడ్డకి అవసరమైన శక్తిని అందిస్తుంది.
☀ప్రతి భోజనంలో సగం ప్లేట్ లో పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. మిగతా సగం తృణధాన్యాలు ఉండేలా ఎంపిక చేసుకోవాలి.
☀ అధిక ఉప్పు, సంతృప్త కొవ్వులు, చక్కెరలు అధికంగా ఉండే ప్యాక్ చేసిన, ప్రాసెస్ చేసిన ఆహారాలు, పానీయాలు నివారించాలి.
పాలిచ్చే తల్లులకి ఉత్తమ ఆహారం
☀పాల ఉత్పత్తులు
☀చిక్కుళ్ళు
☀బ్లూ బెర్రీస్
☀నారింజలు
☀గుడ్లు
☀ఆకుపచ్చ కూరగాయలు
☀తృణధాన్యాలు
☀నట్స్
☀ సాల్మన్ చేపలు
ఆరోగ్యకరమైన పోషకాలు నిండిన ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన కేలరీలు, విటమిన్లు, ఖనిజాలు పొందుతారు.
తల్లిపాల ప్రయోజనాలు
ప్రసవించిన తర్వాత కొన్ని రోజుల పాటు ముర్రుపాలు వస్తాయి. అవి అప్పుడే పుట్టిన శిశువుకి చాలా మంచిది. అందులో యాంటీబాడీస్ పుష్కలంగా ఉంటాయి. లేత పసుపు రంగులో ఉండే ఆ పాలు శిశువుకు రోగనిరోధక శక్తి పెరిగేలా చేయడంతో పాటు పుట్టిన వెంటనే వచ్చే ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షణగా నిలుస్తుంది. వీటిలో శిశువుకి అవసరమైన ఇమ్యూనోగ్లోబిన్ ఎ ఉంటుంది. ఇది శిశువు గొంతు, జీర్ణవ్యవస్థకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ సోకకుండా రక్షణ గోడలాగా నిలుస్తుంది. ముర్రుపాలల్లో ఉండే కొలొస్ట్రమ్ శిశువుకు అన్నీ రకాల పోషకాలను అందిస్తుంది. ఇందులో ప్రోటీన్లు ఎక్కువగా ఉండటంతో పాటు చక్కెర తక్కువగా ఉంటుంది. ఇవి నవజాత శిశువుకి మంచి ఆహారం.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also read: బ్రేక్ ఫాస్ట్ గా అరటి పండు తీసుకుంటున్నారా? అలా చేస్తే ఆరోగ్యానికి హానికరం