Alarm snooze: అలారమ్ పెట్టుకుని నిద్రలేస్తున్నారా? మీరు ఈ సమస్యతో బాధపడుతున్నట్లే!
సహజంగా నిద్ర లేచే వారితో పోలిస్తే అలారం పెట్టుకొని నిద్రలేచే వారిలో క్రానికల్ టైర్డ్ నెస్ కనిపిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మోగుతున్న అలారాన్ని రోజూ స్నూజ్ చేసి లేవడానికి బద్ధకిస్తున్నారంటే మీరు క్రానికల్ టైర్డ్ నెస్ తో బాధపడున్నారని అర్థం. ఒక అధ్యయనం ప్రకారం వైట్ కాలర్ జాబ్స్ లో ఉన్న వారిలో దాదాపు 57 శాతం మంది ఉదయం మేల్కొనడానికి అలారమ్ వాడుతున్నారట. వీరితో పోల్చినపుడు సహజంగా నిద్ర లేచేవారు పొద్దంతా చురుకుగా పనుల్లో ఉండడం మాత్రమే కాదు, కాఫీ వినియోగం కూడా తక్కువగా ఉంటోందట.
⦿ అలారమ్ ఆఫ్ చేసి తిరిగి పడుకున్నా కూడా వారికి నిద్ర చాలిన ఫీలింగ్ ఉండటం లేదు. అదే సహజంగా మెలకువ వచ్చి మేల్కొన్న వారికి నిద్ర చాలడంతో సంబంధం లేకుండా అలసిపోయామనే కంప్లైంట్ ఉండటం లేదని నిపుణులు అంటున్నారు.
⦿ సహజంగా మెలకువ వచ్చి మేల్కొనడం వల్ల శరీరం మీద అలర్ట్ గా ఉండాల్సిన ఒత్తిడి ఉండదు. కానీ అలారమ్ వల్ల మేల్కొన్నపుడు గాఢ నిద్రలో శరీరంలో రకరకాల హార్మోన్ల ప్రభావం వల్ల ఒక రకమైన రిలాక్సింగ్ మోడ్‌లో ఉంటుంది.
⦿ అలారమ్ వల్ల మేల్కొనడంతో అలర్ట్ గా ఉండాల్సిన ఒత్తిడి శరీరం మీద ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సహజంగానే నిద్రా భంగానికి అలారమ్ కారణం అవుతుంది.
⦿ ఇలా అలారమ్ సహాయంతో నిద్ర లేచే వారు సాధారణంగా రాత్రుళ్లు పొద్దుపోయే వరకు మెలకువగా ఉండే వారే. స్లీప్ సైకిల్ డిస్టర్బ్ కావడం వల్ల వీరిలో అలసట ఎక్కువగా కనిపిస్తుంది.
⦿ అలారమ్ వాచ్ లేదా స్మార్ట్ ఫోన్ ఏదైనా సరే అందులో కచ్చితంగా స్నూజ్ బటన్ ఉంటుంది. అలారమ్ మోగిన వెంటనే నిద్ర లేవడానికి తయారుగా ఉండకపోవడం వల్ల స్నూజ్ బటన్ వాడుతారు.
⦿ ఇలా స్నూజ్ బటన్ వాడే వారిలో ఎక్కువ మంది క్రానికల్లీ టైర్డ్ గా ఉన్న వారే అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ స్టీఫేన్ అభిప్రాయపడ్డారు. మనలో ముగ్గురిలో ఒకరు మాత్రమే సరిపడినంత నిద్రపోతున్నారట. అంటే మిగతా వారంతా కూడా వారి అలసటను మేనేజ్ చెయ్యడానికి రకరకాల పద్దతులు పాటిస్తున్నారనే అర్థం.
స్త్రీలలో ఎక్కువ
మహిళల్లో దాదాపుగా 50 శాతం మంది స్నూజ్ బటన్ వాడేవారేనట. ఇలాంటి వారే నిద్రపోయే సమయంలో ఎక్కువ డిస్టర్బ్ అవుతారు. నిజానికి వీళ్లంతా కూడా చాలా కాలంగా పనిలో తీరిక లేకుండా గడుపుతున్న వారే. పెద్ద పెద్ద డిగ్రీలు ఉండి వైట్ కాలర్డ్ జాబ్స్ చేస్తున్నవారే కావడం గమనార్హం. ఇలా వైట్ కాలర్ జాబ్స్ లో ఉన్న వారిలో 57 శాతం మంది స్నూజ్ బటన్ వాడుతున్నారని ఈ అధ్యయన సారాంశం.
ఇక్కడ స్నూజ్ బటన్ వాడడం కాదు సమస్య నిద్ర లేవడానికి అలారమ్ వాడాల్సి వస్తోంది అంటే వారు తమ నిద్ర చెడగొట్టుకుని బలవంతంగా నిద్రలేచే ప్రయత్నం చేస్తున్నారని అర్థం. అలారమ్ వాడడం అనేదే ఇక్కడ ఆక్షేపించాల్సిన విషయం అని స్లీప్ అనే జర్నల్లో ప్రొఫెసర్ ఆరేన్ స్ట్రేజిల్ అభిప్రాయపడ్డారు. అలారమ్ మోగించి బలవంతంగా నిద్ర లేవడం వల్ల క్రానికల్ టైర్డ్ నెస్ బారిన పడే ప్రమాదం పొంచి ఉందని గమనించాలి.
Also read: ఫూల్ మఖానా రోజూ ఇలా తింటే కంటి నిండా నిద్రే నిద్ర
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.