(Source: ECI/ABP News/ABP Majha)
ఫూల్ మఖానా రోజూ ఇలా తింటే కంటి నిండా నిద్రే నిద్ర
ఫూల్ మఖానా తినేవారి సంఖ్య తక్కువగానే ఉంది. వీటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
దక్షిణ భారతదేశంలో కన్నా ఉత్తర భారతదేశంలో వీటిని అధికంగా తింటారు. వీటిని ఆంగ్లంలో ‘Fox nuts’ అంటారు. తెలుగులో వీటిని తామర గింజలు అంటారు. వీటిని పచ్చివి తిన్నా, వండుకుని తిన్నా మంచిదే. వండిన వాటి కన్నా, పచ్చి వాటిలోనే పోషక విలువలు ఎక్కువ. ఇవి తినడం వల్ల కంటి నిండా నిద్ర వస్తుంది. ఎవరైతే నిద్రలేమితో బాధపడుతున్నారో వారు రాత్రిపూట వీటిని తింటే మంచిది. ఆందోళన, నిద్రపట్టకపోవడం వంటి సమస్యలు ఉండడం వల్ల నిద్ర రాదు. అలాంటప్పుడు రాత్రిపూట గ్లాసు పాలు తాగి, వీటిని తింటే మంచి ఫలితం ఉంటుంది.
ఆ రోగాలు దూరం...
ఫూల్ మఖానా తినడం వల్ల క్యాన్సర్, గుండెజబ్బులు వంటి పెద్ద రోగాలు దరికి చేరవు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. సోడియం కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి అధిక రక్తపోటు ఉన్నవారు కూడా దీన్ని పెంచుకోవచ్చు. పొటాషియం ఎక్కువగా ఉంటుంది.కాబట్టి అరటి పండు తిన్నంత బలం దీనికి వస్తుంది. గర్భిణులకు, బాలింతలకు ఫూల్ మఖానా ఎంతో మేలు చేస్తుంది. రక్తహీనత రాకుండా కాపాడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లలో ముఖ్యమైన గాలిక్ యాసిడ్, క్లోరోజెనిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి చర్మాన్ని మెరిపిస్తాయి. అయితే వీటిని నూనెలో వేయించకుండా, నేరుగా కళాయిలో వేయించుకుని తినాలి. పచ్చివి తిన్నా చర్మానికి మంచిదే.
ఇవి తింటే ఆకలి పెరుగుతుంది. అలాగని బరువు పెరుగుతారనుకోవద్దు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటుంది. ఇందులో హానికారక శాచురేటెడ్ కొవ్వు తక్కువగా ఉంటుంది. పీచు కూడా ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే గుండె జబ్బులు రావు. మలబద్ధకం సమస్య కూడా రాదు. ఫూల్ మఖానాతో వండిన వంటల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. కాబట్టి కాస్త తిన్నా పొట్ట నిండిన భావన వస్తుంది. మానసిక ఆందోళనలు, డిప్రెషన్ వంటివి రాకుండా అడ్డుకుంటాయి ఈ తామర గింజలు తింటే. శరీరంలోని వ్యర్ధాలు ఇవి బయటికి పంపిస్తాయి.
Also read: మానసిక ఆందోళనకు అశ్వగంధారిష్టతో చెక్ పెట్టొచ్చు, దీనితో ఇంకా ఎన్నో లాభాలు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.