Acne Myths and Facts : మొటిమలపై అపోహలు, నిజాలేంటి? నిపుణుల సలహాలతో పింపుల్స్‌కి చెక్ పెట్టండిలా
Acne Myths : ఆహారం, పరిశుభ్రత, మేకప్, చికిత్సలతో సహా మొటిమల గురించి అపోహలను తొలగిస్తూ.. స్కిన్ కేర్ నిపుణులు ఇస్తోన్న సూచనలివే.

Skin Care for Acne : చర్మ సమస్యల్లో ఎక్కువమంది ఎదుర్కొనేది మొటిమలే. మగవారి నుంచి ఆడవాళ్ల వరకు చాలామంది ఈ పింపుల్స్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే వీటిని తగ్గించుకునేందుకు ఇంటి చిట్కాల నుంచి నిపుణుల సలహాలు ఫాలో అవ్వడం వరకు అన్ని చేస్తారు. కొన్న మంచి రిజల్ట్స్ ఇస్తాయి. మరికొన్ని ఏమి ప్రభావం చూపవు. మరికొన్ని సమస్యను పెంచుతాయి కూడా. అందుకే మొటిమలు ఎందుకు వస్తున్నాయో(Pimples Causes) తెలుసుకోవడం ముఖ్యం. అయితే చాలామంది మొటిమలపై అపోహలతో ఉంటారని స్కిన్ కేర్ నిపుణులు డాక్టర్ ప్రశాంత్ అగర్వాల్ తెలిపారు. అవి ఎంతవరకు నిజమో.. మొటిమలు పెరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూసేద్దాం.
మొటిమల గురించిన అపోహలు ఇవే
అపోహ 1 : మొటిమలు టీనేజర్లకు మాత్రమే వస్తాయి.
వాస్తవం : మొటిమలు టీనేజ్ వయస్సులోనే కాదు. ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, కాలుష్యం, జీవనశైలి కారణంగా పెద్దవారిలో కూడా మొటిమలు పెరుగుతున్నాయి. 20, 30, 40 ఏళ్ల వారికి కూడా మొటిమలు వస్తాయి.
అపోహ 2 : వేయించిన ఆహారాలు మొటిమలకు కారణమవుతాయి
వాస్తవం : స్కిన్ హెల్త్‌కి ఆహారానికి సంబంధం ఉంది. కానీ.. చాక్లెట్స్ లేదా డీప్ ఫ్రై చేసిన ఆహారాలు మాత్రమే నేరుగా మొటిమలకు కారణం కావట. మొటిమలు పెరిగేందుకు ఇవి కారణం కానీ.. వచ్చేందుకు మాత్రమే కారణం కాదని చెప్తున్నారు. అలాగే అధిక గ్లైసెమిక్ ఆహారాలు అంటే గోధుమ రొట్టెలు, స్వీట్లు, సోడాలు వంటివి ఇన్సులిన్ స్థాయిలను పెంచి మొటిమలకు కారణమవుతాయట.
అపోహ 3 : చర్మం మురికిగా మారడం వల్ల మొటిమలు వస్తాయి
వాస్తవం : చర్మం మురికిగా ఉండటం వల్ల మొటిమలు రావు. మీకు తెలియని విషయం ఏంటంటే.. ఎక్కువగా కడగడం వల్ల చర్మం పొడిబారి మొటిమలు తీవ్రమవుతాయట. మొటిమలు ప్రధానంగా రంధ్రాలు మూసుకుపోవడం, అధిక నూనె ఉత్పత్తి, బ్యాక్టీరియా పేరుకుపోవడం వల్ల వస్తాయి అంతేకానీ మురికి వల్ల కాదు. అయితే మీరు రోజుకు రెండుసార్లు ఫేస్ వాష్ చేస్తే సరిపోతుంది. ముఖాన్ని కడగడానికి మైల్డ్ క్లెన్సర్ ఉపయోగించండి.
అపోహ 4 : సన్‌స్క్రీన్‌తో మొటిమలు తగ్గిపోతాయట..
వాస్తవం : సన్‌స్క్రీన్ వల్ల స్వల్పకాలంలో మొటిమలు తగ్గుతాయి. కానీ దీర్ఘకాలంలో స్కిన్ మరింత నూనెను ఉత్పత్తి చేసి.. మొటిమలకు కారణమవుతుంది. కాబట్టి చర్మవ్యాధి నిపుణులు సూచించే సన్స్స్క్రీన్స్ వాడితే మంచి ఫలితాలు ఉంటాయి.
అపోహ 5 : మేకప్ మొటిమలకు కారణమవుతుంది
వాస్తవం : అన్ని సౌందర్య సాధనాలు మొటిమలు రప్పించవు. మొటిమలకు అనుకూలమైన, నూనె లేని, నాన్-కామెడోజెనిక్ చర్మ సంరక్షణ ఉత్పత్తులు రంధ్రాలను మూసుకుపోకుండా చేస్తాయి. కానీ మేకప్ తీయకపోవడం, ఎక్కువ కాలం ఉంచుకోవడం వల్ల మొటిమలు పెరిగే అవకాశం చాలా ఉంది.
అపోహ 6 : మొటిమలు వాటంతటా అవే తగ్గిపోతాయి
వాస్తవం : కొన్నిసార్లు మొటిమలు ఎలాంటి మచ్చలు లేకుండా కాలక్రమేణా తగ్గిపోతాయి. అలా అని పూర్తిగా పట్టించుకోవడం మానేస్తే మొటిమలు, మచ్చలు పెరుగుతాయి. చర్మవ్యాధి నిపుణులు ఇచ్చే చికిత్స తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో మచ్చలు రాకుండా ఉంటాయి. అలాగే స్కిన్ హెల్తీగా మారుతుంది.
అపోహ 7 : మొటిమలను నొక్కితే అవి త్వరగా నయం అవుతాయి
వాస్తవం : మొటిమలను చాలామంది స్కిన్‌లోకి నొక్కేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా చర్మంలోకి లోతుగా వెళ్లి పరిస్థితి మరింత దిగజార్చుతుంది. దీనివల్ల వాపు, మచ్చలు కూడా వస్తాయి. కాబట్టి పదే పదే మొటిమలు ముట్టుకోవద్దు. చర్మవ్యాధి నిపుణులు ఇచ్చే ఎక్స్ట్రాక్షన్లు వాడితే మంచిది.
అపోహ 8 : DIY సహజ నివారణలు ఎల్లప్పుడూ పనిచేస్తాయి
వాస్తవం : కలబంద లేదా తేనె చర్మాన్ని ఉపశమనం కలిగిస్తాయి. అయితే చాలా హోమ్ టిప్స్ అంటే నిమ్మరసం, టూత్‌పేస్ట్ లేదా ఎక్స్‌ఫోలియేటింగ్ స్క్రబ్‌లు మొటిమలను మరింత తీవ్రతరం చేస్తాయట. సైన్స్-ఆధారిత చికిత్సలే ఎల్లప్పుడూ సురక్షితమైన ఎంపిక.
కాబట్టి మొటిమల గురించిన అపోహలు వదిలి.. సరైన చికిత్స తీసుకోవడం వల్ల సమస్య తగ్గుముఖం పడుతుందని చెప్తున్నారు నిపుణులు. మొటిమలు సహజమైనవే. కాబట్టి వాటిని సరిగ్గా హ్యాండిల్ చేస్తే సులభంగా కంట్రోల్ చేయవచ్చు. సరైన స్కిన్‌కేర్, నీరు ఎక్కువగా తాగడం, ఒత్తిడిని తగ్గించుకుంటే సమస్య దూరమవుతుంది.






















