TSPSC Group 1 Notification: గ్రూప్ 1 తొలి నోటిఫికేషన్ జారీకి సర్వం సిద్ధం, ఒకట్రెండు రోజుల్లో టీఎస్‌పీఎస్సీ ప్రకటన
TSPSC Group 1 Notification: తొలి గ్రూప్ 1 నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి టీఎస్‌పీఎస్సీ సర్వం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
TSPSC Group 1 Recruitment: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలి గ్రూప్ 1 నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో తొలి గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలకు తెలంగాణ పబ్లిష్ సర్వీస్ కమిషన్ (TSPSC) సర్వం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో గ్రూప్ 1లో భాగంగా పలు శాఖల్లోని 503 పోస్టులకు నోటిఫికేషన్ (TSPSC Group 1 Notification) విడుదల కానుంది. పోస్టులకు విద్యార్హత, వయసు, తదితర అంశాలను బోర్డు పరిశీలించి, అన్ని సరిగానే ఉన్నట్లు నిర్ధారించింది. దరఖాస్తుల స్వీకరణకు ఎన్ని రోజులు సమయం ఇవ్వాలి, ప్రిలిమినరీ ఎన్ని రోజుల్లో నిర్వహించాలి వంటి అంశాలపై తాత్కాలిక టైంటేబుల్‌ను టీఎస్‌పీఎస్సీ సిద్ధం చేసుకుంది.
అక్కడే చిక్కుముడి..
కొన్ని పోస్టులను కొత్తగా గ్రూప్ 1 కేటగిరిలో చేర్చారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం మల్టీ జోనల్ కేడర్‌లో ఉన్న పోస్టులు రాష్ట్ర కేడర్‌లో, రాష్ట్ర కేడర్ పోస్టులు మల్టీ జోనల్ లోకి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం వీటిపై నిర్ణయం తీసుకుని ఒకట్రెండు రోజుల్లో గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, మరోవైపు గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలలో కొన్ని మార్పులు జరిగాయి. ఈ రెండూ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఇంటర్వ్యూలు ఎత్తివేశారు. దాంతో గ్రూప్ 1లో అయితే మొత్తం రాతపరీక్షలో మెరిట్ ఆధారంగా ఆయా కేటగిరిలలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
గ్రూప్1 పోస్టుల భర్తీని ఈ ఏడాది డిసెంబర్‌లోగా పూర్తి చేసేలా టీఎస్‌పీఎస్సీ అధికారులు ప్లాన్ చేస్తున్నారు. కోర్టు కేసులు, ఇతర చిక్కులు లేకుండా ఉండేలా ఈసారి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఈ వారంలోనే విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. గ్రూప్1 పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలుపెట్టేందుకు ఏప్రిల్ నెలాఖరులోగా టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తుందని తెలుస్తోంది. అదేరోజు టీఎస్‌పీఎస్సీ పూర్తిస్థాయి సమావేశం నిర్వహిస్తుండటంతో, గ్రూప్ 1లోని 503 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తారని నిరుద్యోగులు సైతం భావిస్తున్నారు.
నో ఇంటర్వ్యూ.. నో టెన్షన్..
గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగ నియామకాలపై అపోహలు తొలగించడంలో భాగంగా సీఎం కేసీఆర్ ఇదివరకే ఈ పోటీ పరీక్షలకు ఇంటర్వ్యూలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై టీఎస్‌పీఎస్సీ అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. మరోవైపు ఆర్థికశాఖ ఆమోదం తెలిపిన ఉద్యోగాలలో గ్రూప్ 1 పోస్టులు ఉండటంతో.. ఏప్రిల్ నెలాఖరులో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అందించి అభ్యర్థులకు శుభవార్త అందించే అవకాశాలు లేకపోలేదు. అభ్యర్థులు ఓటీఆర్ వివరాలు అప్‌డేట్ చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ అధికారులు సూచించారు. ఈ నెలలో నోటిఫికేషన్ విడుదలైతే జూన్‌లో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించే ఛాన్స్ ఉంది.