గురుకులాల్లో 12 వేల ఖాళీలు, పండగ నాటికి నోటిఫికేషన్!
ప్రస్తుత నియామకాల్లో భాగంగా ఇవి భర్తీ కానున్నాయి. దాదాపు 12 వేలకుపైగా పోస్టులకు వారం, పది రోజుల్లో ఒక్కొక్కటిగా ప్రకటనలు జారీ చేసేందుకు గురుకుల నియామక బోర్డు సన్నాహాలు చేస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గురుకులాల్లో ఖాళీగా ఉన్న 12 వేల పోస్టులకు నోటిఫికేషన్ జారీచేయాలని గురుకుల నియామకబోర్డు నిర్ణయించింది. ఈ ఏడాదికి మంజూరైన 33 బీసీ గురుకుల పాఠశాలలు, 15 బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో మంత్రిమండలి ఆమోదించిన దాదాపు 2,591 ఖాళీ పోస్టులకు ఆర్థికశాఖ అనుమతులు వచ్చిన వారం నుంచి పది రోజుల్లో ప్రకటనలు ఇచ్చేందుకు ముందస్తు కసరత్తు పూర్తిచేసింది. సంక్షేమశాఖల వారీగా ప్రతిపాదనలు పరిశీలించిన బోర్డు, బీసీ గురుకులాలకు సంబంధించి ఆర్థికశాఖ నుంచి అనుమతుల కోసం ఎదురుచూస్తోంది. అదనపు పోస్టులకు రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ ఉత్తర్వులు వచ్చిన వెంటనే ప్రతిపాదనలు నియామక బోర్డుకు పంపించేలా బీసీ గురుకుల సొసైటీ ఇప్పటికే రోస్టర్, జోన్లు, మల్టీజోన్ల వారీగా పోస్టులను గుర్తింపు పూర్తిచేసింది. ఈనెల రెండో వారంలో ప్రకటన జారీ చేయాలని గురుకుల బోర్డు భావిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సంక్షేమ గురుకులాల్లో 9,096 పోస్టులను మంజూరు చేసింది. దీంతో పాటు అదనపు పోస్టులతో కలిపి ఒకేసారి ఉద్యోగ ప్రకటనలు రానున్నాయి. ఇవి వెలువడిన తరువాత కనీసం మూడు నెలల సమయం ఉండేలా బోర్డు జాగ్రత్తలు పడుతోంది. గురుకులాల్లో ఒక్కో అభ్యర్థి అర్హతల మేరకు రెండు, ఆపైన పోస్టులకు దరఖాస్తు చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో అన్ని పోస్టులకు సన్నద్ధమై, పరీక్షలు రాసేలా షెడ్యూలు రూపొందించనుంది. ఉద్యోగ ప్రకటనలు ఒకేసారి ఇచ్చినప్పటికీ తొలుత పై నుంచి దిగువ స్థాయి పోస్టులకు పరీక్షలు నిర్వహించనుంది. పరీక్షల ఫలితాల్లోనూ తొలుత ఉన్నత స్థాయి పోస్టులకు వెలువరించి, ఆ పోస్టుల నియామకాలు పూర్తయిన తరువాత దిగువ స్థాయి పోస్టుల ఫలితాలు ఇవ్వాలని నిర్ణయించింది. తద్వారా గురుకులాల్లో ఖాళీలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోనున్నట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి.
బీసీ గురుకులాల్లో ఎక్కువ పోస్టులు...
గురుకుల ఉద్యోగాల భర్తీకి సంబంధించి అత్యధిక పోస్టులు బీసీ గురుకులాల్లోనే ఉన్నాయి. ఈ సొసైటీ పరిధిలో గతంలో అనుమతించిన 3,870 పోస్టులకు అదనంగా మరో 3వేల ఖాళీలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో బీసీ సొసైటీ పరిధిలోనే దాదాపు 6 వేలకు పైగా బోధన పోస్టులు ఉండనున్నాయి. ఇప్పటికే 2017లో మంజూరైన 119 బీసీ గురుకులాలు జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ అయ్యాయి. వచ్చే ఏడాది నుంచి మరో 119 కళాశాలలు అప్‌గ్రేడ్ కానున్నాయి. దీంతో ఈ సొసైటీ పరిధిలో అత్యధిక పాఠశాలలు, జూనియర్ కళాశాలలు ఉన్నాయి. పాఠశాలలు అప్‌గ్రేడ్ కావడం, కొత్తగా ఈ ఏడాది గురుకులాలు రావడంతో వీటిలోనూ పోస్టులు భర్తీకానున్నాయి. బీసీ గురుకుల సొసైటీ తరువాత అధికంగా ఎస్సీ గురుకుల సొసైటీలో 2,267 పోస్టులు ఉన్నాయి. గురుకుల సొసైటీల్లో సీనియర్ కేడర్ అధికారిగా ఉన్న ఎస్సీ సొసైటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న రొనాల్డ్‌రాస్ బోర్డుకు ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. గతంలో బోర్డు కన్వీనర్‌గా పనిచేసిన అధికారి కేంద్ర సర్వీసులకు వెళ్లడంతో ఆయన స్థానంలో బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్యబట్టు కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. మిగతా ఎస్టీ, మైనార్టీ, సాధారణ గురుకుల సొసైటీల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు.
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల సొసైటీల్లో రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు బోధన, బోధనేతర సిబ్బంది సర్దుబాటు పూర్తికావడంతో జోన్లు, మల్టీజోన్ల వారీగా పోస్టులను గుర్తించింది. తొలుత ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ, గిరిజన రిజర్వేషన్ల పెంపుతో వీటికి సవరణలు పూర్తిచేసింది. గిరిజనులకు పదిశాతం రిజర్వేషన్లు అమలయ్యేలా రోస్టర్ ప్రాతిపదికన పోస్టులను రిజర్వు చేసింది. ఈ ప్రక్రియను సొసైటీలన్నీ పూర్తిచేసి, ఇటీవల గురుకుల నియామక బోర్డుకు ప్రతిపాదనలు పంపించాయి. ఈ ప్రతిపాదనలన్నింటినీ సొసైటీ ఒకసారి ఇప్పటికే పరిశీలించింది. పోస్టుల గుర్తింపు, ప్రభుత్వ అనుమతి రావడంతో భర్తీకి ప్రకటనలు ఏవిధంగా విడుదల చేయాలన్న విషయమై బోర్డువర్గాలు సమాలోచనలు చేస్తున్నాయి.
పక్కా ప్రణాళికతో ముందుకు..
టీజీటీ, పీజీటీ, లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, ప్రిన్సిపల్ పోస్టులన్నిటికీ ఒకేసారి వెలువరించాలా? లేదా ? ఒక్కోకేటగిరీ పోస్టుకు కొంత కాల వ్యవధితో ఇవ్వాలా? అనే విషయాన్ని పరిశీలిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అన్ని పోస్టుల పరీక్షలు రాసేందుకు వీలుగా అవకాశమివ్వాలని, ఈ మేరకు నోటిఫికేషన్ల వెల్లడి నుంచి పరీక్ష తేదీల ఖరారు వరకు ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ప్రాథమికంగా నిర్ణయించింది. గురుకులాల్లోని బోధన పోస్టుల్లో బ్యాక్‌లాగ్ ఏర్పడకుండా ఉన్నతస్థాయి నుంచి దిగువకు క్రమపద్ధతిలో భర్తీ చేయాలన్న ప్రతిపాదనను బోర్డు పరిశీలిస్తోంది. రాతపరీక్షలు నిర్వహించిన తరువాత ఫలితాలను ఉన్నత పోస్టుల నుంచి కిందిస్థాయి పోస్టుల వరకు కాలవ్యవధిలో వెల్లడించి నియామకాలు పూర్తిచేయాలని భావిస్తోంది.
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...