Teachers Day: సీఎం కేసీఆర్ 'టీచర్స్ డే' కానుక, గురుకుల కాంట్రాక్ట్ టీచర్ల క్రమబద్దీకరణ, ఉత్తర్వులు జారీ
గత 16 సంవత్సరాలుగా గురుకులాల్లో పనిచేస్తున్న 567 మంది కాంట్రాక్టు టీచర్ల క్రమబద్దీకరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సెప్టెంబరు 4న ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ తెలిపారు. సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవం కానుకగా.. గత 16 సంవత్సరాలుగా గురుకులాల్లో పనిచేస్తున్న 567 మంది కాంట్రాక్టు టీచర్ల క్రమబద్దీకరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సెప్టెంబరు 4న ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే బీసీ గురుకులాల్లోని 139 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులను రెగ్యులర్ చేసిన ప్రభుత్వం.. తాజాగా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న 567 మంది కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను క్రమబద్దీకరించింది. అంతేకాకుండా.. గురుకులాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయులకు 12 నెలల జీతం, బేసిక్ పేతో పాటు ఆరు నెలల ప్రసూతి సెలవులను కూడా ప్రభుత్వం ప్రకటించింది.
2007లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకులాల్లో మొత్తంగా 567 మంది ఉపాధ్యాయులను కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించింది. అందులో స్టాఫ్ నర్సులతోపాటు, లైబ్రేరియన్లు కూడా ఉన్నారు. అయితే రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేయించిన నాటి ఉమ్మడి ప్రభుత్వం వేతనాలను మాత్రం ఇవ్వలేదు. తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ ప్రభుత్వం మానవీయకోణంలో ఆలోచించి.. గురుకులాల్లో కాంట్రాక్టు ఉపాధ్యాయులకు రెగ్యులర్ ఉపాధ్యాయులతోపాటు పీఆర్సీని అమలు చేయడంతోపాటు, 12 నెలల పూర్తి వేతనాన్ని చెల్లిస్తున్నది.కాగా, గతంలో ఇచ్చిన హామీ మేరకు తాజాగా సాంఘిక సంక్షేమ గురుకులాల్లోని కాంట్రాక్టు ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం తాజాగా జారీ చేసింది.
కాంట్రాక్టు పద్ధతిలో ఎస్సీ గురుకులాల్లో పనిచేస్తున్న 567 మంది ఉపాధ్యాయుల్లో వారిలో 504 మంది మహిళలే కావడం విశేషం. ఇక ప్రభుత్వం నిర్ణయంపై కాంట్రాక్టు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలల కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల సంఘం ప్రతినిధులు మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.
టీచర్లందరికీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు..
ఉపాధ్యాయుల దినోత్సవం ( సెప్టెంబర్ 5) సందర్భంగా టీచర్లందరికీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, జ్ఞానాన్ని పెంపొందించి.. లక్ష్యం పట్ల వారికి స్పష్టమైన అవగాహనను కలిగించి, వారిని కార్యసాధకులుగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర వెలకట్టలేనిదనీ సీఎం అన్నారు. మాతృదేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్యదేవోభవ అనే సూక్తి తల్లిదండ్రుల తర్వాత గురువుకు ఉన్న ప్రాధాన్యతను తెలియచేస్తున్నదని పేర్కొన్నారు.
ALSO READ:
సెప్టెంబరు 12 నుంచి జేఎల్ రాతపరీక్షలు, ఏ ఎగ్జామ్ ఎప్పుడంటే?
తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించిన రాతపరీక్షల తేదీలను టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్ 12 నుంచి రాత పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు అక్టోబర్ 3 వరకు కొనసాగనున్నాయి. ఈ పరీక్షలు పూర్తిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించనున్నారు. మొత్తం 16 సబ్జెక్టులకు 11 రోజుల పాటు ఉదయం జనరల్ స్టడీస్ పేపర్, మధ్యాహ్నం సంబంధిత సబ్జెక్టు పేపర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పరీక్ష తేదీలను ఇప్పటికే విడుదల చేసింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
నాబార్డులో 150 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు, ఎంపికైతే నెలకు రూ.89,150 వరకు జీతం
ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న 'నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(నాబార్డు)' దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 150 పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 2న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. సెప్టెంబరు 29 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రాతపరీక్షలు (ప్రిలిమినరీ, మెయిన్), ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..