TSPSC: ఎన్నికల తర్వాత జోరందుకోనున్న నియామకాల ప్రక్రియ - కసరత్తు మొదలుపెట్టిన కమిషన్
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఊపందుకోనుంది. ఇప్పటికే నిర్వహించిన రాతపరీక్షల తుది ఫలితాలను పార్లమెంటు ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే వెలువరించాలని భావిస్తోంది.
TSPSC Recruitment: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఊపందుకోనుంది. ఇప్పటికే నిర్వహించిన రాతపరీక్షల తుది ఫలితాలను పార్లమెంటు ఎన్నికల కోడ్ (Election Code) ముగిసిన వెంటనే వెలువరించాలని భావిస్తోంది. ఈ మేరకు TSPSC కసరత్తులు చేస్తోంది. అప్పటివరకు రాతపరీక్షల తుది కీల (Final Answer Keys) వెల్లడి, జనరల్ ర్యాంకు జాబితాల (GRL) ప్రకటన, సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తిచేయనుంది. ఈ మేరకు రెండు రానున్న నెలల్లో పూర్తిచేయాల్సిన పనులకు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గత రెండేళ్లలో మొత్తం 27 ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది. వీటిద్వారా 18 వేలకు పైగా ఖాళీలను భర్తీచేయాల్సి ఉంది. అయితే 2023లో ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా గ్రూప్-1తోపాటు 5 ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన నియామక పరీక్షలు రద్దయ్యాయి. ఆ తర్వాత మళ్లీ నిర్వహించినా టెక్నికల్ సమస్యలతో ఫలితాలు వెల్లడికాలేదు. ఎట్టకేలకు ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా భ్రష్టుపట్టిన టీఎస్‌పీఎస్సీని కొత్త ప్రభుత్వం ప్రక్షాళన చేసింది. ఛైర్మన్‌తోపాటు కమిషన్‌కు సభ్యల నియామకం చేపట్టింది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టీఎస్‌పీఎస్సీ కొత్త బోర్డు ఏర్పాటైంది.
10 నోటిఫికేషన్ల జనరల్ ర్యాంకు జాబితాలు వెల్లడి..
➥ కొత్తగా ఏర్పాటైన బోర్డు రెండు నెలల్లోనే మూడు నోటిఫికేషన్ల నియామక ప్రక్రియ పూర్తిచేసింది. దీంతోపాటు పది ఉద్యోగ ప్రకటనలకు జనరల్ ర్యాంకు జాబితాలను కమిషన్ విడుదలచేసింది.
➥ వీటితోపాటు కొత్తగా జారీచేసిన గ్రూప్-1 నోటిఫికేషన్‌తోపాటు.. కీలకమైన గ్రూప్-2, 3తోపాటు డీఏవో, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు రాతపరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది.
➥ ఇప్పటికే జనరల్ ర్యాంకు జాబితాలు ప్రకటించిన ఉద్యోగాలకు సంబంధించి త్వరలోనే సర్టిపఫికేట్ వెరిఫికేషన్ చేపట్టనుంది. ఇందులో భాగంగా జిల్లా స్థాయి పోస్టులైన గ్రూప్-4 ఖాళీల భర్తీకి త్వరలోనే 1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితాలు వెలువరించనున్నారు.
➥ మరోవైపు ఏఈఈ పోస్టులకు సంబంధించి జనరల్ అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇక స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తికాగానే.. తుది ఫలితాలు వెల్లడించనున్నారు.
➥ ఏఈ పోస్టులకు సంబంధించిన తుది ఆన్సర్ కీని టీఎస్‌పీఎస్సీ తాజాగా ప్రకటించింది. ఇంటర్ విద్యా విభాగంలో 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టులకు 2022 డిసెంబరులో ఉద్యోగ ప్రకటన జారీ అవగా 2023 అక్టోబరులో రాత పరీక్షలు పూర్తయ్యాయి. వారం, పది రోజుల్లో కీ వెల్లడించాలని భావిస్తోంది.
ఆన్సర్ 'కీ' సమస్యలకు పరిష్కారం..
ఉద్యోగ నియామకాలకు నిర్వహించే రాతపరీక్షల ప్రాథమిక 'కీ' అనంతరం అభ్యంతరాలకు అవకాశం లేకుండా.. ఉండేందుకు కమిషన్ తగు కార్యచరణ సిద్దం చేసింది. గతంలో ప్రశ్నపత్రం రూపొందించే సమయంలోనే నిర్ణయించిన సమాధానాన్ని ప్రిలిమినరీ ఆన్సర్ 'కీ'గా ఇచ్చేవారు. ఆన్సర్ కీ విడుదల చేసిన తర్వాత.. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకుని, సబ్జెక్టు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకునేవారు. దీనివల్ల ఫైనల్ ఆన్సర్ కీ, ఆ తర్వాత ఫలితాల వెల్లడికి చాలా సమయం పట్టేది. ఈ నేపథ్యంలో ముందుగానే సబ్జెక్టు కమిటీ జవాబులు పరిశీలించి ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రాథమిక కీ వెలువరిస్తోంది. దీంతో అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు దాదాపు తగ్గిపోతున్నాయి. అప్పటికీ ఏమైనా ఉంటే.. మరోసారి పరిశీలించి తుదికీ వెలువరిస్తోంది.