TSLPRB: ఎస్ఐ ఫలితాల వెల్లడికి సర్వం సిద్ధం, ఏ క్షణమైనా తుది ఎంపిక జాబితా వెల్లడి!
తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎస్‌ఐ అభ్యర్థుల తుది ఎంపిక ఫలితాల వెల్లడికి పోలీసు నియామక మండలి ఏర్పాట్లు చేస్తోంది. ఖాళీలకు అనుగుణంగా తుది ఫలితాలను ప్రకటించడానికి కసరత్తు చేస్తున్నారు.
తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎస్‌ఐ అభ్యర్థుల తుది ఎంపిక ఫలితాల వెల్లడికి పోలీసు నియామక మండలి ఏర్పాట్లు చేస్తోంది. అభ్యర్థుల ఎంపికజాబితాలో కీలకమైన కటాఫ్ మార్కుల ప్రక్రియను పూర్తిచేసిన అధికారులు.. జిల్లాలు, సామాజికవర్గాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఖాళీలకు అనుగుణంగా తుది ఫలితాలను ప్రకటించడానికి కసరత్తు చేస్తున్నారు. ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా.. ఒకటికిరెండు సార్లు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.
తుది జాబితా వెల్లడించిన తర్వాత అర్హత సాధించిన అభ్యర్థుల బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్, వ్యక్తిగత ప్రవర్తన, క్రిమినల్ కేసులపై ఆరా తీయనుంది. గరిష్ఠంగా పది రోజుల్లోనే స్పెషల్ బ్రాంచ్(ఎస్‌బీ) విభాగంతో విచారణ జరిపించిన అనంతరం అభ్యర్థులకు ఎంపిక లేఖలు పంపనుంది. దీన్నిబట్టి ఆగస్టు రెండోవారంలోగా అర్హుల జాబితాను పోలీసు, ఎక్సైజ్, ఫైర్, జైళ్లు.. ఇలా అన్ని విభాగాలకు పంపనుంది.
కానిస్టేబుల్ ఫలితాలపై జీవో నం.46 ఎఫెక్ట్..
ఎస్‌ఐ ఎంపిక ఫలితాలు ఏ క్షణమైనా వెలువడే అవకాశమున్నప్పటికీ.. కానిస్టేబుల్ ఎంపిక ఫలితాల వెల్లడి విషయంలో మాత్రం జాప్యం జరుగుతోంది. దీనికి జీవో నం.46కు సంబంధించిన న్యాయవివాదం నడుస్తుండడమే కారణం. ఈ జీవో రాష్ట్రప్రభుత్వంలోని 9 శాఖలకు సంబంధించిందైనా ప్రస్తుతం హోంశాఖ పరిధిలోని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్(టీఎస్‌ఎస్‌పీ) చుట్టూ కేంద్రీకృతమైంది. కంటీజియస్ జిల్లా కేడర్ పోస్టుల భర్తీ కోసం రూపొందించిన రేషియో కారణంగా తమకు అన్యాయం జరుగుతోందంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయనుంది. దీంతో ఎలాంటి తీర్పు వెలువడుతుందోనని అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఎస్ఐ పోస్టులు కంటీజియస్ జిల్లా కేడర్ పరిధిలో లేకపోవడంతో వాటి ఫలితాల వెల్లడిలో సమస రాలేదు. కాని కానిస్టేబుల్ పోస్టులు మాత్రం ఇదే కేడర్‌లో ఉండటంతో న్యాయస్థానం తీర్పు కోసం వేచి చూడాల్సి రానుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే జీవో నం.46 విషయం సాధారణ పరిపాలన శాఖ పరిధిలో ఉండడంతో ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరమేర్పడింది.
రద్దు చేయాల్సిందే అంటున్న కానిస్టేబుల్ అభ్యర్థులు..
తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్(టీఎస్‌ఎస్పీ) నియామకాల్లో కొత్తగా తెచ్చిన జీవో 46ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జులై 26న పలువురు గ్రామీణ ప్రాంత పోలీస్ అభ్యర్థులు సచివాలయ ముట్టడికి యత్నించిన సంగతి తెలిసిందే... పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 31 మందిని ముషీరాబాద్ ఠాణాకు తరలించారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ.. రాష్ట్రమంతా పాత పద్ధతిలో కానిస్టేబుల్ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి(సైబరాబాద్), మేడ్చల్-మల్కాజిగిరి(రాచకొండ), సంగారెడ్డి జిల్లాల వారికి 53% రిజర్వేషన్లు కల్పించి.. మిగతా 29 జిల్లాల వారికి 47% కేటాయించడంతో గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
ALSO READ:
1876 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - అర్హతలు, ఇతర వివరాలు ఇలా!
ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో 1876 ఎస్‌ఐ (గ్రౌండ్ డ్యూటీ), ఎస్‌ఐ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ (SSC CPO 2023) విడుదల చేసింది. బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, సశస్త్ర సీమాబల్ విభాగాలు సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ కిందకు వస్తాయి. మొత్తం ఖాళీల్లో 1710 పురుషులకు కేటాయించగా.. 166 పోస్టులను మహిళలకు కేటాయించారు. డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి జులై 21న నోటిఫికేషన్ విడుదలకాగా.. జులై 22 నుంచి ఆగస్టు 15 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. అక్టోబరులో రాతపరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రిసెర్చ్‌లో 55 గ్రాడ్యుయేట్& టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ పోస్టులు
ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రిసెర్చ్ గ్రాడ్యుయేట్& టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 55 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్, డిప్లొమా ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 04 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..