APPSC: 'గ్రూప్-2' ప్రిలిమ్స్ నిర్వహణకు సర్వం సిద్ధం, హాజరుకానున్న 4.8 లక్షల మంది అభ్యర్థులు, ఈ సూచనలు పాటించాాల్సిందే!
ఏపీలో ఫిబ్రవరి 25న జరుగనున్న గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష(స్ర్కీనింగ్)లకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1327 కేంద్రాలు ఏర్పాట్లుచేశారు.
APPSC Group 2 Prelims Exam: ఏపీలో ఫిబ్రవరి 25న జరుగనున్న గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష(స్ర్కీనింగ్)లకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. గ్రూప్-2 పోస్టులకు మొత్తం 4,83,525 మంది దరఖాస్తు చేసుకోగా.. వీరికోసం రాష్ట్రవ్యాప్తంగా 1327 కేంద్రాలు ఏర్పాట్లుచేశారు. ఉదయం 10.30.గం.ల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్షలు (జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ) నిర్వహించనున్నారు. గ్రూప్-2 పరీక్ష నిర్వహణకు 24 మంది అఖిల భారత సర్వీసుల అధికారులు, 450 మంది రూట్ అధికారులు, 1330 మంది లైజనింగ్ అధికారులను ప్రభుత్వం నియమించింది. పరీక్ష కేంద్రాల్లో 24,142 మంది ఇన్విజిలేటర్లను, 8500 ఇతర సిబ్బందిని నియమించింది.
గ్రూప్-2 పరీక్షల నిర్వహణకు సంబంధించి ఫిబ్రవరి 23న జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఏపీపీఎస్సీ ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 25న నిర్వహించనున్న 'గ్రూపు-2' ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను సీఎస్ ఆదేశించారు. జిల్లాల్లో పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలను సిఎస్ ఆదేశించారు. అదే విధంగా ఆయా పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు.
విస్తృత బందోబస్తు..
పరీక్షల నిర్వహణ కోసం ఆయా పరీక్ష కేంద్రాల వద్ద విస్తృత బందోబస్తు ఏర్పాటుచేశారు. ఇందుకోసం 3971 మంది పోలీసు సిబ్బందిని నియమించడంతో పాటు.. పరీక్షా పత్రాలు, జవాబు పత్రాలు తదితర కాన్ఫిడెన్సియల్ మెటీరియల్ నిర్దేశిత ప్రాంతాలకు సురక్షితంగా తరలించేందుకు వీలుగా 900 మంది ఎస్కార్ట్ సిబ్బందిని ప్రభుత్వం నియమించింది. అలాగే మొత్తం పరీక్షల తీరును ఏపీపీఎస్సీ నుండి 51 మంది అధికారులు పర్యవేక్షించనున్నారు. పరీక్షలు జరుగుతున్న తీరును నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా పలు పరీక్షా కేంద్రాలను సీసీటీవీ కెమెరాలతో అనుసంధానించినట్లు సీఎస్ తెలిపారు.
ప్రిలిమినరీ పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు ఆఫ్‌లైన్ (OMR) విధానంలో ప్రిలిమినరీ (స్క్రీనింగ్) పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు 150 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. పరీక్షలో నెగెటివ్ మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.3 మార్కుల చొప్పున కోత విధిస్తారు.
అభ్యర్థులకు ముఖ్య సూచనలు..
➥ అభ్యర్థులు ఉదయం 9 గంటల వరకు పరీక్ష కేంద్రానిక చేరుకోవాల్సి ఉంటుంది. నిమిషం ఆలస్యమైన పరీక్ష రాసేందుకు అనుమతించరు.
➥ అభ్యర్థులు తమకు ప్రశ్నపత్రం ఇచ్చిన వెంటనే, సూచించిన ప్రకారం అన్ని ప్రశ్నలు ఉన్నాయో లేదో చెక్ చేకోవాలి.
➥ తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ప్రశ్నపత్రం ఉంటుంది.
➥ ఓంఎఆర్ షీటులో సమాధానాలను బ్లూ/బ్లాక్ బాల్‌పాయింట్ పెన్నుతో మాత్రమే సమాధానాలు గుర్తించాలి (సర్కిల్ పూరించాలి). అనవసరపు గుర్తులు పెట్టకూడదు. వైట్నర్ వాడకం నిషేధం.
➥ సమాధాన పత్రం నింపడానికి కూడా బ్లూ/బ్లాక్ పెన్ను మాత్రమే వాడాలి. జెల్ పెన్నులు, ఇంక్ పెన్నులు, పెన్సి్ల్స్ వాడకూడదు.
➥ సమాధాన పత్రం (ఓఎంఆర్ ఆన్సర్ షీటు)లో నిర్దేశించిన ప్రదేశంలో అభ్యర్థి సంతకంతోపాటు, ఇన్విజిలేటర్ సంతకం కూడా తప్పనిసరిగా ఉండాలి. సంతకాలు లేని సమాధానపత్రాలు పరిగణనలోకి తీసుకోరు.
➥ ఓఎంఆర్ ఆన్సర్ షీటు మీద ఏదైనా రఫ్ వర్క్ గాని, గీతలు గీయడం గాని, చింపడం, పిన్ చేయడం లాంటివి చేయకూడదు.
➥ ఓఎంఆర్ షీటులో జవాబులు మార్చడానికి వైట్నర్, బ్లేడు, రబ్బరు లేదా ఏ విధమైన దిద్దుబాటు చర్యలు చేసినా సమాధానపత్రాలను పరిశీలించరు.
➥ ఇచ్చిన ప్రశ్నలకు బుక్‌లెట్‌లో జవాబులు గుర్తించకూడదు. ఓఎంఆర్ షీటులో మాత్రమే సమాధానాలు రాయాలి. దీన్ని తీవ్రంగా పరిగణిస్తారు.
➥ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు క్యాలిక్యులేటర్లు, మ్యాథ్స్/లాగ్ టేబుల్స్, మొబైల్‌ఫోన్లు, బ్లూటూత్ పరికరాలు, ఇతర ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. ఆభరణాలు కూడా వేసుకురాకపోవడం మంచిది.
➥ పరీక్ష సమయం ముగిసిన తర్వాతనే అభ్యర్థులను బయటకు పంపుతారు. పరీక్ష మధ్యాలో ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు అనుమతించరు.
➥ పరీక్షలో కాపీ/చీటింగ్‌కు పాల్పడినట్లయితే పరీక్ష నుంచి బహిష్కరిస్తారు.
➥ రఫ్ వర్కును ప్రశ్నపత్రం చివరి పేజీలో మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది.
➥ పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉన్న కారణంగా జవాబులు జాగ్రత్తగా గుర్తించాల్సి ఉంటుంది. ప్రతి తప్పు సమాధానాకి 0.3 చొప్పున మార్కుల్లో కోత విధిస్తారు.
ఆంధ్రప్రదేశ్‌లో 899 గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్సీ(APPSC) డిసెంబరు 7న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్-2 పోస్టులకు సంబంధించి మొత్తం 899 ఖాళీల్లో.. 53 క్యారీడ్ ఫార్వర్డ్ పోస్టులకాగా, 846 తాజా ఖాళీలు ఉన్నాయి. వీటిలో 333 ఎగ్జిక్యూటివ్(Excutive), 566 నాన్-ఎగ్జిక్యూటివ్(Non Excutive) పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల నుంచి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జవనరి 17తో గడువు ముగియనుంది. గ్రూప్-2 పోస్టుల భర్తీని ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల ఆధారంగా భర్తీచేయనున్నారు. అభ్యర్థులకు ఫిబ్రవరి 25న స్క్రీనింగ్ పరీక్ష (ప్రిలిమినరీ పరీక్ష) నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఏపీపీఎస్సీ నిర్ణయించిన నిష్పత్తి ఆధారంగా మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు. మెయిన్ పరీక్ష తేదీలను తర్వాత ప్రకటించనున్నారు. మెయిన్ రాత పరీక్షలో కనబరచిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష(CPT) నిర్వహిస్తారు. స్క్రీనింగ్ పరీక్ష, మెయిన్ పరీక్ష రెండూ ఆఫ్‌లైన్ మోడ్(ఓఎంఆర్) ఆబ్జెక్టివ్ విధానంలోనే జరుగుతాయి. కొత్త సిలబస్ ప్రకారమే గ్రూప్-2 పరీక్ష నిర్వహించనున్నారు.