పూర్తిగా పంచదార తినడం మానేస్తే శరీరంలో ఏం జరుగుతుంది?
పంచదార వల్ల శరీరానికి ఆరోగ్యం కన్నా అనారోగ్యమే ఎక్కువని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి.
ఆహారంలో ఎక్కువ చక్కెర పదార్థాలు తినేవాళ్లు అధికంగా రోగాల బారిన పడుతున్నట్టు ఎన్నో పరిశోధనలు, అధ్యయనాలు చెప్పాయి. ముఖ్యంగా చక్కెర వల్ల ఊబకాయం, గుండె జబ్బులు, టైప్ 2 మధుమేహం బారిన వారు పడుతున్నారు. అయితే ఒక్కసారి ఆలోచించండి? మీకు ఎలాంటి ఆరోగ్యాన్ని ఇవ్వని చక్కెరను పూర్తిగా మీ డైట్ నుంచి తొలగిస్తే ఏమవుతుంది? దానివల్ల మీకు నష్టం కలుగుతుందా? లేక లాభమా? ఈ విషయంపై పోషకాహార నిపుణులు స్పందించారు. అమెరికన్ హాట్ అసోసియేషన్ ప్రకారం చక్కెర అధికంగా ఉండే పదార్థాలను చాలా తక్కువగా తినడం గుండెకు మంచిది. అయినప్పటికీ చాలామంది చక్కెర పదార్థాలే అధికంగా తింటారు. చక్కెరను పూర్తిగా లేదా కొన్ని రోజులపాటు తాత్కాలికంగా ఆపేసి మీ శరీరంలో జరిగే మార్పులను, మీ మానసిక స్థితిలో వచ్చిన మార్పులను ఒకసారి చెక్ చేసుకోండి. మీకు మంచి మార్పులు కనిపిస్తే చక్కెరను పూర్తిగా మానేయడమే మంచిది. చక్కెరను పూర్తిగా డైట్ నుంచి తీసేయడం వల్ల కలిగే లాభాలు ఆరోగ్య నిపుణులు ఇలా చెబుతున్నారు.
యవ్వనంగా కనిపిస్తారు
పంచదార తినడం తగ్గించే వారి రంగు మెరుగుపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మొటిమలు రావడం తగ్గుతుంది. అలాగే కొలెజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది మీ మేని ఛాయలో మార్పులు తెస్తుంది. చక్కెరను విడిచిపెట్టడం అనేది చాలా చవకైన చర్మ సంరక్షణ పద్ధతి.
శరీరానికి మేలు
శరీరంలో మంట, వాపు వంటివి రాకుండా ఉండాలంటే చక్కెరను తినడం మానేయాలి. ఎందుకంటే చక్కెరలో ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. కాబట్టి దీన్ని తినడం మానేస్తే శరీరంలో ఎలాంటి వాపు, నొప్పులు కనబడవు. అంతేకాదు అలసట కూడా ఉండదు. ఉద్రేకం, కోపం తగ్గుతాయి.
మానసిక ఆరోగ్యానికి
మీరు డిప్రెషన్ వంటి మానసిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నట్లయితే వెంటనే తీపి పదార్థాలు తినడం ఆపేయాలి. చక్కెర అధికంగా ఉండే పదార్థాలు శరీరంలో నిరాశను, ఆందోళనను పెంచుతాయి అని పరిశోధనలు చెబుతున్నాయి.
బరువు తగ్గుతారు
చక్కెర తినడం మానేస్తే అధిక బరువు సమస్య కూడా తీరిపోతుంది. నెలరోజుల పాటు తీపి పదార్థాలకు దూరంగా ఉంటే బరువు ఎలాంటి కష్టం లేకుండా తగ్గిపోవచ్చు. చక్కెర తగ్గించి, వ్యాయామం పెంచితే బరువు సులువుగా తగ్గుతారు.
మధుమేహం రాదు
ఆధునిక కాలంలో మధుమేహం వస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. ఇటీవల చేసిన పరిశోధనల్లో ప్రతి పది మంది అమెరికన్లలో ఒకరు డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. ఇదే పరిస్థితి మిగతా దేశాల్లో కూడా ఉంది. అందుకే చక్కెర తినడం మానేయడం చాలా మంచి పద్ధతి. దీనివల్ల మధుమేహం వచ్చే ప్రమాదం కూడా చాలా వరకు తగ్గుతుంది.
Also read: డుకాన్ డైట్ గురించి తెలుసా? బ్రిటన్ యువరాణి మెరుపుతీగలా ఉండడానికి కారణం ఇదే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.