Covid-19 Quarantine: కొవిడ్ నిబంధనలు గాలికి.. కుర్రాడు 5 ఏళ్లు జైలుకి!
కొవిడ్ నిబంధనలు ఉల్లఘించి బయట తిరిగినందుకు ఓ వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. వియత్నాం దేశంలో జరిగింది ఈ ఘటన.
చాలా మంది ప్రస్తుతం కొవిడ్ నిబంధనలు గాలికి వదిలి తిరుగుతున్నారు. కనీసం మాస్కులు కూడా పెట్టుకోకుండా ఇంట్లో నుంచి బయటకు వస్తున్నారు. అందరూ అలానే ఉన్నారులే.. మనల్ని ఎవరు ఏం చేస్తారులే? అని అలుసుగా తీసుకుంటున్నారు. అయితే ఇలాగే అనుకున్న వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. వియత్నాంలో ఈ ఘటన జరిగింది.
నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను వియత్నాంకి చెందిన లెవాన్ ట్రై అనే వ్యక్తికి స్థానిక కోర్టు ఐదు ఏళ్ల జైలు శిక్ష విధించింది. కొవిడ్ సోకిన ఈ వ్యక్తి క్వారంటైన్ లో ఉండకుండా చాలా మందికి ఈ వైరస్‌ను అట్టించాడంటూ వియత్నాం ప్రాంతీయ కోర్టు చేసిన విచారణలో తేలింది. ఇలా వైరస్ వ్యాప్తి చేయడం వల్ల ఒకరు చనిపోగా, మరో 8 మందికి వైరస్ సోకినట్లు కోర్టు పేర్కొంది. నిబంధనలు పాటించకుండా కొవిడ్ వ్యాప్తికి కారకుడయ్యాడని కోర్టు తేల్చింది. దీంతో ట్రై కి 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
ఏం చేశాడు?
ఆగస్టు 7న ట్రైకి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే 21 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరగడం వల్ల చాలా మందికి వైరస్‌ని వ్యాప్తి చేశాడని నివేదిక పేర్కొంది. గత నెలలో ట్రై మాదిరిగా చేసిన మరికొంతమందికి కూడా వియత్నాం స్థానిక కోర్టుల్లో ఇలాంటి శిక్షలే విధించారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి వియత్నాం ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. పక్కా క్వారంటైన్ సహా కొవిడ్ నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటోంది.