సప్లిమెంట్లను వాడుతున్నారా? ఏ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు గ్రీన్ టీ తాగకూడదో తెలుసా?
ఆహారం ద్వారా పోషకాలు లభించాలి. కానీ కొంతమంది పోషకాల కోసం సప్లిమెంట్ల మీద ఆధారపడుతుంటారు.
శరీరంలో పోషకాహార లోపం ఉన్నప్పుడు వైద్యులు అవసరమైన సప్లిమెంట్లను సూచిస్తారు. కొంతమంది వైద్యుల సూచన లేకపోయినా కూడా సప్లిమెంట్లను తమకు తామే వాడుతూ ఉంటారు. సప్లిమెంట్ల విషయంలో ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో మెడికల్ షాప్ వాళ్లు కూడా ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండానే అందరికీ వాటిని అందిస్తున్నారు. అయితే కొన్ని రకాల సప్లిమెంట్లు తీసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆ సప్లిమెంట్లలో కొన్ని కాంబినేషన్లు ప్రమాదకరంగా ఉంటాయి.
ఇనుము
ఎక్కువమంది మహిళల్లో ఐరన్ లోపం ఉంటుంది. పిల్లల్లో కూడా ఇదే లోపం అధికంగా ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఎవరు ఐరన్ సప్లిమెంట్లను వాడతారో వాళ్లు గ్రీన్ టీ ని పక్కన పెట్టాలి. గ్రీన్ టీ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందుకే గ్రీన్ టీ ని ఎక్కువ మంది తాగుతారు. అయితే ఐరన్ సప్లిమెంట్లు వేసుకుంటున్నప్పుడు గ్రీన్ టీ ని తాగకపోవడం మంచిది. గ్రీన్ టీ గుణాలు శరీరం ఐరన్ శోషించుకోకుండా చేస్తుంది. దీనివల్ల మీరు ఐరన్ సప్లిమెంట్లు తీసుకున్నా కూడా ఫలితం ఉండదు. ఇనుము మన శరీరానికి అత్యవసరమైనది. అది తగ్గితే రకరకాల వ్యాధులు వస్తాయి. రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. కాబట్టి ఐరన్ సప్లిమెంట్లు వాడేవాళ్లు అవి వాడినంత కాలం గ్రీన్ టీ కి దూరంగా ఉండటమే బెటర్.
మెగ్నీషియం - కాల్షియం
ఈ సప్లిమెంట్లు కూడా మార్కెట్లో విరివిగా దొరుకుతాయి. వీటిని విడివిడిగా వేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో లాభం. కానీ ఒకేసారి కలిపి వేసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. మెగ్నీషియం, క్యాల్షియాన్ని శరీరం శోషించుకోవడంలో అడ్డుపడుతుంది.దీనివల్ల కాల్షియం లోపం అధికమైపోతుంది. తద్వారా ఎముకల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ రెండిటిని కలిపి వేసుకోవడం వల్ల మెగ్నీషియం శోషణ కూడా తగ్గుతుంది. మెగ్నీషియం శరీరంలో తగ్గడం వల్ల నరాలు, కండరాల పనితీరు మారిపోతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. రక్తపోటు నియంత్రణలో ఉండదు. కాబట్టి మెగ్నీషియం, క్యాల్షియం ఒకేసారి కలిపి వేసుకోకూడదు. కనీసం రెండు గంటల తేడాతో వేసుకుంటే మంచిది.
విటమిన్ సి - కాపర్
విటమిన్ సి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో, రక్త పోటును తగ్గించడంలో ముందుంటుంది. అయితే విటమిన్ సి సప్లిమెంట్లు, కాపర్ సప్లిమెంట్లు కలిపి వేసుకోకూడదు. విటమిన్ సి, కాపర్ ను శరీరం గ్రహించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల కాపర్ లోపం ఏర్పడే అవకాశం ఉంది. కాపర్ మన శరీరానికి అవసరం. గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.
విటమిన్ డి, ఈ, కే
ఇవన్నీ విడివిడిగా చూస్తే ఎంతో మేలు చేసేవి. కానీ కలిపి వేసుకుంటే మాత్రం ఎలాంటి మేలు ఉండదు. ఈ మూడు మానవ శరీరానికి అత్యవసరమైనవి. వీటిని కలిపి వేసుకున్నప్పుడు విటమిన్ కె శోషణను విటమిన్ డి, విటమిన్ ఈ అడ్డుకుంటాయి. అందుకే ఈ మూడు సప్లిమెంట్లను రెండు గంటల గ్యాప్ లో వేసుకోవడం మంచిది.
కాపర్ - జింక్
ఈ రెండింటి కాంబినేషన్ కూడా ప్రమాదకరమైనది. శరీరంలో జింక్ లోపించినా ప్రమాదమే, కాపర్ లోపించినా ప్రమాదమే. ఈ లోపాల వల్ల మనిషికి తీవ్రమైన అలసట వస్తుంది. ఎముకలు పెళుసుగా మారి, విరిగిపోయే ప్రమాదం ఉంది. అలాగే కాపర్, జింక్ ఒకదాని శోషణను ఇంకొకటి తీవ్రంగా అడ్డుకుంటాయి. ఈ రెండింటి లోపం శరీరంలో ఏర్పడుతుంది. వీటిని కూడా రెండు గంటల వ్యవధితో వేసుకోవడం మంచిది.
Also read: సంతానోత్పత్తి అవకాశాలను పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే, స్త్రీ పురుషులిద్దరికీ పనిచేస్తాయి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.