థైరాయిడ్ సమస్య రాకూడదంటే ఏం చేయాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
సీతాకోక చిలుక ఆకారంలో మెడ దగ్గర ఉండే చిన్న గ్రంథి. అయితే జీవక్రియలు సజావుగా జరగడానికి మాత్రం ఇది సరిగ్గా పనిచెయ్యడం అవసరం.
థైరాయిడ్ పనితీరులో తేడాను త్వరగా నిర్ధారించుకోకపోతే ఆస్టియోపొరోసిస్, కార్డయోవాస్క్యూలార్ డిసీజ్ వంటి ఎన్నో రకాల తీవ్రమైన అనారోగ్యాలకు కారణం అవుతుంది. అకారణంగా బరువు పెరుగుతుంటే మాత్రం ముందుగా తెలుసుకోవాల్సింది థైరాయిడ్ గ్లాండ్ పనితీరులో మార్పు వచ్చిందా, లేదా అనే.
థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచెయ్యాలంటే మాత్రం తప్పనిసరిగా సమతుల ఆహారం తీసుకోవాలి. అయోడిన్ థైరాయడ్ కు అత్యంత అవసరమైన పోషకం. ఇదొక్కటే కాదు ఇంకా కొన్ని సూక్ష్మ పోషకాల మీద కూడా ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. థైరాయిడ్ అబ్‌నార్మలిటీస్ ఉన్నవారు తప్పకుండా డైట్ లో మార్పులు చేసుకుని తీరాలని చెబుతున్నారు.
థైరాయిడ్ పనితీరు మెరుగ్గా ఉంచుకోవడానికి అవసరమైన పోషకాలు
అయోడిన్ – థైరాయిడ్ పనితీరుకు అయోడిన్ చాలా కీలకం. ట్రైయోడోథైయోనిన్ (T3) థైరాక్సిన్ (T4) థైరాయడ్ హార్గోన్లు అయోడిన్ ద్వారా శరీరంలో ఉత్పత్తి అవుతాయి. అయోడిన్ లోపం థైరాయిడ్ వ్యాధికి కారణం అవుతుంది.
విటమిన్ డి – విటమిన్ డి తక్కువగా ఉన్నపుడు థైరాయిడైటిస్, గ్రేవ్స్ వ్యాధి వంటివి రావచ్చు.
సెలీనియం – సెలీనియం, థైరాయిక్సిన్ ఉత్పత్తికి చాలా అవసరం. ఆక్సిడేషన్, ఒత్తిడి వల్ల థైరాయిడ్ గ్లాండ్ ను ఈ పోషకమే రక్షిస్తుంది.
జింక్ - T3, T4, TSH హార్మోన్లు తగిన స్థాయిలో ఉత్పత్తి జరగాలంటే జింక్ తప్పని సరిగా కావాలి.
విటమిన్ B, విటమిన్ A, E వంటి ఇతర పోషకాలు కూడా థైరాయిడ్ పనితీరు సరిగ్గా ఉండడానికి అవసరం. వీటిలో ఒకటి కంటే ఎక్కువ పోషకాల లోపం ఏర్పడితే థైరాయిడ్ ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాదు ఒకసారి థైరాయిడ్ సమస్యలు మొదలైతే రకరకాల ఆరోగ్య సమస్యలు కనిపిస్తాయి. రకరకాల లక్షణాలు గుర్తించవచ్చు.
- చిన్న పనికే అలసిపోవడం
- గుండె వేగం పెరగడం
- అకారణంగా బరువు పెరగడం
- అతిగా ఆకలి లేదా ఆకలి మందగించడం
- చాలా బద్దకంగా ఉండడం
- దేనిమీదా ఆసక్తి లేకపోవడం, ఒక్కోసారి డిప్రెషన్, మూడ్ స్వింగ్స్
ఇలా చాలా రకాల లక్షణాలు కనిపిస్తాయి. వీటన్నీంటికి కారణం థైరాక్సిన్ లెవెల్స్ లో తేడా రావడమే. త్వరగా సమస్యను నిర్ధారణ చేసుకుని చికిత్స తీసుకోవడం అవసరం. మందులతోపాటు కొన్ని చిన్నచిన్న జీవన శైలి మార్పులు కూడా అవసరం.
- క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం.
- శరీర బరువు నియంత్రణలో ఉంచుకోవడం.
- కొవ్వులు కలిగిన ఆహారం తగ్గించడం.
- ప్రొటీన్ కలిగిన ఆహారం తీసుకోవడం.
- ఆహారంలో కార్బోహైడ్రేట్ కంటెంట్ తగ్గించడం.
- తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తీసుకోవడం.
- తరచుగా థైరాక్సిన్ లెవల్స్ ఎలా ఉన్నాయో పరీక్షించుకోవాలి.
- మీరు తీసుకునే ఆహారంలో చేసుకునే మార్పుల గురించి తప్పకుండా డాక్టర్‌కు చెప్పాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.