Errolla Srinivas: బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ - తీవ్ర ఉద్రిక్తత, పోలీస్ రాజ్యమంటూ హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం
Telangana News: బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ సమయంలో ఆయన పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని నమోదైన కేసులో ఆయనపై చర్యలు చేపట్టారు.
BRS Senior Leader Errolla Srinivas Arrested: బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను (Errolla Srinivas) గురువారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ సమయంలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించారంటూ ఆయనపై కేసు నమోదైంది. దీనిపై ఈ ఉదయం నోటీసులు ఇచ్చేందుకు వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఆయన నివాసానికి టాస్క్ ఫోర్స్ పోలీసులు చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయన తలుపులు తెరవలేదు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు శ్రీనివాస్ ఇంటికి భారీగా చేరుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి మాసబ్‌ట్యాంక్ పీఎస్‌కు తరలించారు. కాగా, పోలీస్ విధుల అడ్డగింతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Kaushik Reddy), ఎర్రోళ్ల శ్రీనివాస్ సహా మరికొంతమందిపై గతంలో కేసు నమోదైంది. కేసు దర్యాప్తు అధికారిగా మాసబ్ ట్యాంక్ ఇన్‌స్పెక్టర్ ఉన్నారు.
'కుట్ర పూరితమే..'
తన అరెస్టుపై ఎర్రోళ్ల శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అక్రమంగా తనను అరెస్ట్ చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ సర్కారు ప్రశ్నిస్తున్న వారిని వేధిస్తోందని.. 14 ఏళ్ల పాటు ఉద్యమంలో పాల్గొన్నానని, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌గా పని చేశానని చెప్పారు. తెల్లవారుజామున వచ్చి ఇంటి డోర్లు కొట్టడమేంటని నిలదీశారు. ప్రభుత్వం అక్రమంగా ఎన్ని కేసులు పెట్టినా, ఎంత నిర్బంధించినా ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.
మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం
అటు, శ్రీనివాస్ అరెస్టుపై మాజీ మంత్రి హరీశ్‌రావు (HarishRao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఇందిరమ్మ రాజ్యమా? పోలీస్ రాజ్యమా?' అని ప్రశ్నించారు. 'అడిగితే అరెస్టులు.. ప్రశ్నిస్తే కేసులు.. నిలదీస్తే బెదిరింపులు.. ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ గారి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. ఉదయాన్నే పోలీసులు ఇంటి వద్దకు వచ్చి అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గం. కుటుంబ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండా, ఎలాంటి నోటీసు లేకుండా అరెస్ట్ చేయడం పూర్తిగా అప్రజాస్వామికం. ప్రజాస్వామ్య పాలనని డబ్బా కొడుతూ, రాక్షస పాలన కొనసాగిస్తున్నారు. సీఎం నియంతలా వ్యవహరిస్తున్నారు. హోం మంత్రిగా శాంతి భద్రతల నిర్వహణలో విఫలమైన రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ కార్యకర్తలను వేధించడంపైనే దృష్టి పెట్టారు. ఈ పైశాచిక ఆనందం ఎక్కువ కాలం నిలవదు. తెలంగాణ సమాజమే మీకు తగిన బుద్ధి చెబుతుంది.' అని ట్వీట్ చేశారు.
ఇందిరమ్మ రాజ్యమా? పోలీస్ రాజ్యమా?
— Harish Rao Thanneeru (@BRSHarish) December 26, 2024
అడిగితే అరెస్టులు..
ప్రశ్నిస్తే కేసులు..
నిలదీస్తే బెదిరింపులు...
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ గారి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను.
ఉదయాన్నే పోలీసులు ఇంటి వద్దకు వచ్చి…