Overripe Banana: ఒత్తిడి తగ్గించుకోవాలా? మాగిన అరటిపండు తినేయండి - ఇంకా లాభాలెన్నో!
అతిగా పండిన అరటిపండు తినాలంటే ఎవరికీ నచ్చదు. కానీ ఇది తింటే అనేక అనారోగ్య సమస్యలు దూరంఅవుతాయి.
ఎల్లో కలర్ లో నిగనిగలాడుతూ ఉంటేనే కొంతమంది అరటి పండ్లు తింటారు. వాటి మీద ఏ కొంచెం మచ్చ కనిపించినా, పండిపోయినా తినకుండా పక్కన పడేస్తారు. మాగిన అరటి పండు తినాలంటే చాలా మందికి అసలు నచ్చదు. వాసన, రంగు చాలా వేరుగా ఉంటుంది. కానీ మాగిన అరటి పండు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పండులో విటమిన్లు, ఫైబర్, కాల్షియం, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు ఉన్నాయి. బాగా పండిన అరటి పండులో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇది ఒత్తిడి, ఆందోళన తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు బాగా పండిన అరటిపండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అనేక వ్యాధుల నుంచి బయటపడేందుకు ఇవి సహాయపడతాయి.
కణాలు దెబ్బతినకుండా నిరోధిస్తుంది
బాగా పండిన అరటి పండు తింటే రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది అనేక వ్యాధులను నివారిస్తుంది. కణాలు దెబ్బతినకుండా నిరోధిస్తుంది.
గుండెకి మేలు
అతిగా పండిన అరటిపండ్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటుని నియంత్రించడంలో సహాయపడతాయి. ఇవి తింటే కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
జీర్ణం సులభం
మాగిన అరటి పండులో ఉండే స్టార్చ్ ఫ్రీ షుగర్ గా మార్చబడుతుంది. దీని వల్ల సులభంగా జీర్ణమవుతాయి. వీటిని తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి కూడా అందుతుంది. జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవాళ్ళు పండిన అరటిపండ్లు ఎక్కువగా తీసుకోవాలి.
గుండె మంట తగ్గిస్తుంది
ఇవి తింటే గుండెల్లో మంట సమస్యను అధిగమించవచ్చు. నిజానికి ఇవి యాంటాసిడ్ గా పని చేస్తాయి. ఇందులో ఉండే గుణాలు పొట్ట లోపలి పొరను హానికరమైన యాసిడ్స్ నుంచి రక్షిస్తాయి. ఇవి తింటే ఎసిడిటీ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
క్యాన్సర్ ని నివారిస్తుంది
బాగా పండిన అరటి పండ్ల తొక్కపై ప్రత్యేక రకమైన పదార్థం ఏర్పడుతుంది. దీన్ని ట్యూమర్ నెక్రొసిస్ ఫ్యాక్టర్ అంటారు. ఇది క్యాన్సర్, ఇతర అసాధారణ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది.
కండరాల నొప్పి తగ్గిస్తుంది
కండరాల నొప్పితో బాధపడుతుంటే మీకు పండిన అరటిపండు చక్కగా మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో పొటాషియం ఉంటుంది. ఇది కండరాల నొప్పి, తిమ్మిరి నుంచి ఉపశమనం పొండటంలో సహాయపడుతుంది.
ఎన్ని తినాలి?
అరటిపండ్లలో అధికంగా ఫైబర్ ఉంటుంది. వీటిని అతిగా తింటే పొట్ట ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఎక్కువగా తింటే పళ్ళు పుచ్చిపోతాయి. నిద్ర ఎక్కువగా ఉంటుంది. మైగ్రేన్ ఉన్న వాళ్ళు రోజుకి ఒకటికి మించి తింటే ఇతర సమస్యలకు దారితీస్తుంది. అందుకే రోజుకి రెండుకు మించి అరటిపండ్లు తినకుండా ఉండటమే మంచిది. ఇది తిన్న తర్వాత గోరు వెచ్చని నీటిని తాగితే జలుబు, దగ్గు వంటివి రాకుండా ఉంటుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: వేసవిలో ఐస్ యాపిల్స్ తింటే చాలా మంచిదట - ప్రయోజనాలివే!