Stress: ఈ లక్షణాలు కనిపిస్తే మీరు అధిక ఒత్తిడికి లోనవుతున్నట్టే లెక్క -జాగ్రత్త పడండి
అధిక ఒత్తిడి తెలియకుండానే శరీరం పై దాడి చేస్తుంది, మానసికంగా శారీరకంగా చితికి పోయేలా చేస్తుంది.
ఒత్తిడి చేసే గాయాలు భౌతికంగా శరీరంపై కనిపించవు, కానీ మానసికంగా చాలా కుంగదీస్తుంది. తద్వారా శారీరక సమస్యలు కూడా వస్తాయి. అందుకే ఒత్తిడి కనిపించని ఒక మహమ్మారి అని చెబుతారు. మన శరీరం ఒత్తిడిని కొంతమేరకు తట్టుకోగలదు. కొంతమేరకు నయం చేసుకోగలదు. కానీ శరీరం తట్టుకోలేనంత ఒత్తిడి కూడా ఇప్పుడు ఆధునిక జీవితంలో కలుగుతుంది.ఇది శరీరంలోని అవయవాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించవచ్చు. అనారోగ్యానికి గురి అయ్యేలా చేయవచ్చు. కాబట్టి అధిక ఒత్తిడి కలుగుతున్నట్లు అనిపిస్తే మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవడం చాలా మంచిది. ఒత్తిడిని నియంత్రించాలంటే మొదట దాని లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలి. ఈ లక్షణాలు గుర్తించడం కష్టమే కానీ అసాధ్యమేమీ కాదు. ఒత్తిడిని పట్టించుకోకుండా వదిలేస్తే అది అధిక రక్తపోటుకు, ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు వంటి సమస్యలకు కారణం అవుతాయి. అధిక ఒత్తిడి కలిగినప్పుడు మనలో కనిపించే శారీరక లక్షణాలు ఇవే. ఇవి మీలో కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
దీర్ఘకాలిక తలనొప్పి
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం దీర్ఘకాలికంగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతుంటే అది ఒత్తిడి వల్లేనేమో అని అనుమానించాలి. ఒత్తిడి కండరాలను ప్రభావితం చేయడం ద్వారా శరీరంలో నొప్పిని పుట్టిస్తుంది. తలనొప్పి, వెన్నునొప్పి ఒత్తిడి వల్ల వస్తాయి.
నిద్రలేమి
దీర్ఘకాలిక ఒత్తిడి అలసటకు కారణం అవుతుంది. అలాగే నిద్రలేమి కూడా మొదలవుతుంది. 7000 మంది పెద్దలపై చేసిన ఒక అధ్యయనంలో ఒత్తిడి కారణంగా అలసటకు, నిద్రలేమికి గురవుతున్న వారి సంఖ్య అధికంగా ఉన్నట్టు తెలిసింది. నిద్రా సామర్థ్యాన్ని తగ్గించడంలో ఒత్తిడి ప్రభావితంగా పనిచేస్తుందని చెబుతున్నారు.
లైంగిక జీవితం
ఒత్తిడి భార్యాభర్తల మధ్య లైంగిక జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అధిక ఒత్తిడి లోనయ్యే వ్యక్తులు లైంగిక సామర్ధ్యాన్ని, ఆసక్తిని కూడా కోల్పోతారు. అలసట, మానసిక సమస్యలు, హార్మోన్లలో మార్పులు వంటి వాటి వల్ల వారిలో లైంగిక ఆసక్తి తగ్గిపోతున్నట్టు గుర్తించారు.
బరువు పెరగడం
అధిక ఒత్తిడికి గురైన వారిలో ఆకలి వేయడంలో మార్పులు వస్తాయి. కొంతమందిలో ఆకలి తగ్గిపోతే, మరికొందలో ఆకలి పెరిగిపోతుంది. అలాంటివారు అతిగా తినేస్తారు. దీనివల్ల బరువు కూడా అమాంతం పెరుగుతారు. ఎవరిలో అయితే ఆకలి తగ్గుతుందో, వారు హఠాత్తుగా బరువు తగ్గిపోతారు.
కాబట్టి అధిక ఒత్తిడిని తేలిగ్గా తీసుకోవడం మంచిది కాదు. ఇది గుండె జబ్బులతో ముడిపడి ఉంటుంది. గుండె పోటు వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి.
Also read: కుండ దోశెను చూశారా, ఎలా తినాలని మాత్రం అడగవద్దు
Also read: మధుమేహం ఉన్నవాళ్లు తియ్యగా ఉండే పైనాపిల్ తినవచ్చా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.