Diabetes: మధుమేహం ఉన్నవాళ్లు తియ్యగా ఉండే పైనాపిల్ తినవచ్చా?
పైనాపిల్స్ రుచి అదిరిపోతుంది. అందుకే వాటికి ఫ్యాన్స్ ఎక్కువ.
పైనాపిల్ రుచి, వాసన చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. అందుకే కేకులు, డిసర్ట్ లు, క్రీములు, స్వీట్లు అన్నింట్లో పైనాపిల్ వాడకం పెరిగింది. అంతేకాదు ఈ పండు నిండా విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికం. రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతో ఉపయోగపడతాయి. ఈ పండులో ఉండే విటమిన్ సి, మాంగనీసు, డైజెస్టివ్ ఎంజైమ్‌లు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ పండును మితంగా తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలా అని రోజుకో పండు తింటే మాత్రం గుండెల్లో మంట, వికారం వంటి సమస్యలు మొదలవుతాయి. అయితే ఇప్పుడు ఎంతోమంది సందేహం మధుమేహం ఉన్నవారు పైనాపిల్ తినవచ్చా? లేదా ఈ పండు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయా? అని. దీనికి పుర్డ్యూ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సమాధానాన్ని ఇచ్చారు.
విటమిన్ సి నిండుగా ఉండే పండ్లను చాలా మితంగా తినాలి. అలాగే వాటిని సరిగా పండకుండా తినడం మంచిది కాదు. ఒక్కొక్కసారి ఇవి తీవ్రమైన విరోచనాలకు, వాంతులకు కారణం అవుతాయి. బాగా పండిన పైనాపిల్ రోజుకు రెండు మూడు ముక్కలు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే పైనాపిల్ పండులో గ్లూకోజ్, సుక్రోజ్ కంటెంట్ అధికంగా ఉంటుంది. దీనిని అధిక మొత్తంలో తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు అధికంగా పైనాపిల్‌ను తినడం మంచిది కాదు. రోజుకి ఒకటి లేదా రెండు ముక్కలు తినడం మంచిదే కానీ అంతకుమించి అధికంగా తింటే రక్తంలో చక్కర స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. అరకప్పు పైనాపిల్‌లో కార్బోహైడ్రేట్లు 15 గ్రాములు ఉంటాయి. కార్బోహైడ్రేట్లు కూడా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచేందుకు సహకరిస్తాయి. కాబట్టి డయాబెటిస్ రోగులు రోజుకు రెండు ముక్కలతో సరిపెట్టుకుంటే మంచిది.
పైనాపిల్ రసంలో బ్రోమలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ బ్రోమలైన్ సహజంగా మన శరీరానికి ప్రమాదకారి కాదు, కానీ కొంతమంది తమకున్న ఆరోగ్య సమస్యల కారణంగా రక్తాన్ని పలుచబరిచే మందులను వాడుతూ ఉంటారు. అలాంటివారు ఈ పైనాపిల్ అధికంగా తీసుకుంటే అధిక రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. అలాగే చిగుళ్ళు, దంత సమస్యలు ఉన్నవారు కూడా పైనాపిల్ ని తక్కువగా తినాలి. పైనాపిల్‌లో ఉండే ఆమ్లత్వం కారణంగా చిగుళ్ళు, దంత ఎనామిల్ పాడయ్యే అవకాశం ఉంది. మన రోగనిరోధక వ్యవస్థ పైనాపిల్‌లో ఉన్న ప్రోటీన్‌ను పొడి లేదా ఎలర్జీగా భావించడం వల్లే ఇలా దంత ఎనామిల్ క్షీణిస్తుంది.
ఏదేమైనా పైనాపిల్ అధికంగా తింటే పొట్ట కూడా అసౌకర్యంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఖాళీ పొట్టతో పైనాపిల్ తినకూడదు. దీనివల్ల ఆమ్లస్థాయిలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి పైనాపిల్ ను రోజుకు రెండు మూడు ముక్కలతో సరిపెట్టుకొని వదిలేయాలి. అది కూడా ఇతర ఆహారాన్ని తిన్న తర్వాతే పైనాపిల్‌ని తినాలి.
Also read: హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్‌లాగే కంటి స్ట్రోక్ కూడా వస్తుంది, దీని లక్షణాలు ఇవే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.