అబ్బాయిలు జాగ్రత్త, ఇలాంటి వ్యాయామాలు చేస్తే టెస్టోస్టెరాన్ స్ఠాయిలు పడిపోతాయి
జిమ్‌కు వెళ్లడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్కరూ జిమ్ బాట పడుతున్నారు.
ఏ జిమ్‌లో చూసినా అమ్మాయిలు కన్నా, అబ్బాయిలే ఎక్కువగా కనిపిస్తారు. టోన్ బాడీ కోసం, కండల కోసం వారు జిమ్‌కు వెళుతుంటారు. మరికొందరు బరువు తగ్గించుకోవడం కోసం కూడా వెళుతుంటారు. ఏదేమైనా వ్యాయామం మితంగానే చేయాలి. అతిగా చేస్తే అనర్ధాలు తప్పవు. ముఖ్యంగా అబ్బాయిలు కొన్ని రకాల వ్యాయామాలు అధికంగా చేయడం వల్ల టెస్టోస్టోరోన్ హార్మోన్ పై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ హార్మోన్ పురుషుల్లో ప్రధాన సెక్స్ హార్మోన్. పునరుత్పత్తిలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కండరాలు నిర్మించడంలోనూ, కండల పెరుగుదలలో కూడా ఈ హార్మోన్ ప్రధానమైనది. కొన్ని వ్యాయామాలు టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుంటే, మరికొన్ని తగ్గిస్తున్నాయి. దానికి కారణం వ్యాయామం అతిగా చేయడమే.
ఎప్పుడు పెరుగుతాయి?
టెస్టోస్టెరాన్ స్థాయిలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. చేసే పనులను బట్టి రోజంతా మారుతూ ఉంటాయి. సాధారణంగా ఉదయం మధ్యాహ్నం వేళల్లో గరిష్టంగా ఉంటాయి. తీవ్రంగా కష్టపడ్డాక ఓ గంటపాటు అధికంగా ఉంటాయి. ఆ తర్వాత సాధారణ స్థాయికి చేరుకుంటాయి.
బరువులు ఎత్తడం
అధ్యయనాల ప్రకారం స్ట్రెంత్ ఎక్సర్‌సైజులు, హైపర్ ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ వల్ల టెస్టోస్టెరాన్ తాత్కాలికంగా పెరుగుతుందని తేలింది. ముఖ్యంగా వెయిట్ లిఫ్టింగ్ చేయడం వల్ల ఈ హార్మోన్ ఉత్పత్తిపై ప్రభావం తీవ్రంగా ఉన్నట్టు గుర్తించారు. అలా ఎక్కువ కాలం పాటు అధికంగా ఉండడం మంచిది కాదు. కాబట్టి బరువులెత్తే వ్యాయామాలు ఎక్కువ సేపు చేయకూడదు.
కార్డియో ఎక్సర్‌సైజులు
అధ్యయనాలు చెబుతున్న ప్రకారం కార్డియో వంటి వ్యాయామాలు టెస్టోస్టెరాన్‌ను తగ్గిస్తాయి. వీటిని దీర్ఘకాలం పాటు చేయకుండా, మితంగా చేసి ఆపివేయాలి. లేకుంటే స్థాయిలు పడిపోయి పునరుత్పత్తిపై ప్రభావం పడుతుంది.
మంచి ఆరోగ్యం కోసం, అధిక బరువు తగ్గించుకోవడం కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే ఏదైనా కూడా అతిగా ఉండకూడదు. మితంగానే ఉండాలి. అతిగా వ్యాయామాలు చేయడం వల్ల టెస్టోస్టెరాన్ స్థాయిలు అమితంగా పెరిగిపోవడం లేదా తగ్గిపోవడం జరుగుతుంది. ఇది ఆరోగ్య అసమతుల్యతతో ముడిపడి ఉంటుంది. జిమ్‌లో కఠోర వ్యాయామాలు చేసేటప్పుడు అవి దీర్ఘకాలంగా కాకుండా కొన్ని నిమిషాల్లోనే ఆపేయడం మంచిది. బరువు తగ్గేందుకు ఉత్తమమైన పద్ధతి నడక. మీరు ఎంత నడిచిన టెస్టోస్టోరాన్ స్థాయిల్లో పెద్దగా మార్పులు ఉండవు. మార్పులు ఉన్నా కూడా అవి చెడు ప్రభావాలను చూపించవు. కండల కోసం ఎక్కువ శ్రమిస్తే పిల్లలు పుట్టే సామర్థ్యం తగ్గిపోతుంది. కాబట్టి వ్యాయామం అతి కాకుండా చూసుకోవాలి.
Also read: కంది పప్పును ఇలా వండితే మీరు తిన్నా కూడా, అది వ్యర్థమే, వండాల్సిన పద్ధతి ఇది
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.