Protien Food: కంది పప్పును ఇలా వండితే మీరు తిన్నా కూడా, అది వ్యర్థమే, వండాల్సిన పద్ధతి ఇది
ప్రోటీన్ కోసం పప్పును తినేవాళ్లు ఎంతోమంది, కానీ పప్పును ఎలా పెడితే అలా తింటే ప్రోటీన్లు లభించవు.
నాన్ వెజిటేరియన్లు చికెన్, గుడ్ల నుంచి మంచి ప్రోటీన్‌ను పొందుతారు. కానీ శాకాహారులు మాత్రం ప్రోటీన్ కోసం కందిపప్పు పైన ఎక్కువగా ఆధారపడతారు. రోజూ కందిపప్పు తినడం వల్ల శరీరానికి తగినంత ప్రోటీన్ వస్తుందని అనుకుంటారు. శరీరానికి కావాల్సిన ప్రోటీన్ కోసం వైద్యులు రోజూ పప్పు తినమని వారికి సూచిస్తారు. కానీ శరీరానికి సరిపడా ప్రోటీన్ అందాలంటే, ఎలా పడితే అలా పప్పును తింటే ఉపయోగం ఉండదు. చాలా మంది నాలుగు భాగాల నీరు, ఒక భాగం పప్పు వేసి నీళ్లలాగా వండుతారు. దాన్నే తింటారు. ఇలా నీళ్ల పప్పుని తినడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్ అందదని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. కూర వండినట్టుగానే కాస్త గట్టిగా పప్పును వండుకొని తింటే తగినంత ప్రోటీన్ శరీరానికి అందుతుందని వివరిస్తున్నారు. ‘రోజు తింటున్నాం కదా, నీళ్ల పప్పు అయితేనేం అనుకోవచ్చు’... అదే తప్పు అభిప్రాయం. రోజూ తిన్నా కూడా పప్పును కాస్త గట్టిగా వండుకునే తినాలి, లేకుంటే ప్రోటీన్ లోపం త్వరగా వచ్చేస్తుంది.
అధ్యయనాల ప్రకారం ఒక వ్యక్తికి ఒక రోజులో అవసరమైన ప్రోటీన్ అతని శరీర బరువుపై ఆధారపడి ఉంటుంది. ఒక కిలోగ్రామకు 0.8 గ్రాముల ప్రోటీన్ అవసరం. అంటే 50 కిలోల బరువు ఉండే వ్యక్తికి రోజుకు 40 గ్రాముల ప్రోటీన్ అవసరమని అర్థం. 100 గ్రాముల పప్పులో 16 గ్రాముల ఫైబర్, 24 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. నలుగురు సభ్యులు ఉన్న కుటుంబం రోజుకు 100 గ్రాముల పప్పును వండినట్లయితే, ఒక వ్యక్తికి కేవలం రెండు నుంచి మూడు గ్రాములకు మాత్రమే వస్తుంది. మన శరీరానికి రోజువారి అవసరమైన ప్రోటీన్ కంటే ఈ మొత్తం చాలా తక్కువ. శరీరానికి తగినంత ప్రోటీన్ అందకపోతే జుట్టు రాలడం, నీరసం, బద్ధకం పెరగడం వంటివి జరుగుతాయి. కాబట్టి ప్రోటీన్ లోపం లేకుండా చూసుకోవాలి.
ప్రోటీన్లు 20 రకాల అమైనో ఆమ్లాలతో కలిసి తయారవుతాయి. వీటిలో 9 అమైనో ఆమ్లాలు ఆహారం ద్వారా మనం పొందగలము. పాలు, పన్నీర్, పెరుగు, చికెన్, చేపలు, గుడ్లు వంటి జంతు మూలాల్లో ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. అందుకే నాన్ వెజిటేరియన్లకు ప్రోటీన్ లోపం ఏర్పడదు. కేవలం శాఖాహారుల్లోనే ప్రోటీన్ లోపం కనిపిస్తుంది. అందుకే వారికే వైద్యులు అధికంగా ప్రోటీన్ కోసం ఏం తినాలో సూచిస్తూ ఉంటారు.శాకాహారులు తినే ప్రోటీన్ మూలకాల్లో ముఖ్యమైనది కందిపప్పు. దీనిలో అధికంగా ప్రోటీన్లు ఉంటాయి. అందుకే రోజూ కందిపప్పుతో ఆహారం తినమని సూచిస్తుంటారు వైద్యులు.
అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే పప్పులో ప్రోటీన్ కంటే, రెండు రెట్లు అధికంగా కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ప్రతి 100 గ్రాముల పప్పులో 24 గ్రాములు ప్రోటీన్ ఉంటే, దానికి రెట్టింపు పరిమాణంలో పిండి పదార్థాలు ఉంటాయి. అయితే పప్పు తినవద్దని మేము చెప్పడం లేదు, పప్పులో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి మేలే చేస్తాయి. మధుమేహలు కూడా ధైర్యంగా కందిపప్పును తినవచ్చు.
ప్రోటీన్ ఎలా పొందాలి
మాంసాహారులకు ప్రత్యేకంగా ప్రోటీన్ కోసం ఏం తినాలో చెప్పక్కర్లేదు. వారు తినే మాంసాలలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. కానీ శాకాహారులు మాత్రం కచ్చితంగా ప్రోటీన్ కోసం ప్రత్యేకంగా ఆహారాన్ని తినాలి. ముఖ్యంగా తృణధాన్యాలతో పప్పులను కలిపి తీసుకోవడం అవసరం. ప్రోటీన్ సప్లిమెంట్లను కూడా తినవచ్చు. అయితే వైద్యుల సూచన మేరకే వాటిని తినాలి. చిక్కుళ్ళు వంటి వాటిలో కూడా ప్రోటీన్ అధికంగా ఉంటుంది. కొంతమంది ప్రోటీన్ కోసం ప్రోటీన్ షేకులపై ఆధారపడతారు. అది ఆరోగ్యకరమైన పద్ధతి కాదు. శాఖాహారులు ప్రోటీన్ కోసం బాదంపప్పు, వేరుసెనగలు, వాల్నట్స్ ,చియా సీడ్స్ వంటివి రోజూ తినాలి. క్వినోవా వంటి ధాన్యాల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అవిసె గింజలు, సోయాబీన్స్, ఓట్స్, పచ్చి బఠానీలు వంటి వాటిల్లో ప్రోటీన్ లభిస్తుంది.
Also read: అర్ధరాత్రి ఆహారం తినాలన్న కోరికలు కలుగుతున్నాయా? అందుకు కారణాలు ఇవే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.