గుండెపోటుకు దారితీసే కారణాలివే, ముందే తెలుసుకుంటే భవిష్యత్తుకు మంచిది
గుండె పోటును మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అంటారు. ఇదొక మెడికల్ ఎమర్జెన్సీ. ఈ సమస్యలో రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల గుండె కండరాలు బలహీనపడతాయి.
గుండెకు రక్తాన్ని తీసుకువెళ్లే ధమనుల్లో రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడటం వల్ల గుండె సమస్యలు ఉత్పన్నం అవుతాయి. సమయానికి చికిత్స అందకపోతే ఈ సమస్య ప్రాణాలకు హాని చెయ్యవచ్చు కూడా. గుండెపోటు గురించి సరైన అవగాహన ఉంటే ఈ ప్రమాదాన్ని నివారించేందుకు అవకాశం ఉండొచ్చు. గుండెపోటు రావడానికి ముందు శరీరంలో జరిగే మార్పులేమిటి? ఏ కారణాలతో గుండెపోటు రావచ్చు వంటి సమాచారం అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వీటిలో కొన్ని కారణాలను మనం దూరం పెట్టడం లేదా అలవాట్లు మార్చుకోవడం ద్వారా పరిష్కరించవచ్చు. మరి కొన్నింటికి పెద్దగా పరిష్కారాలు ఉండకపోవచ్చు. ముందుగా డాక్టర్ సలహా తీసుకోవాలి. అయితే, గుండె సమస్యలకు దారితీసే కొన్ని కారణాలపై కూడా ముందుగా అవగాహన పెంచుకోవడం అవసరం. అవేంటో చూసేయండి మరి.
కొలెస్ట్రాల్
కొలెస్ట్రాల్ స్థాయిలను తరచుగా పరీక్షించి చూసుకోవడం చాలా అవసరం. తేడాలు వచ్చినపుడు కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువ ఫైబర్, తక్కువ కొవ్వులు కలిగిన ఆహారం తీసుకోవాలి.
షుగర్
డయాబెటిస్ గుండెకు హాని కలిగిస్తుంది. షుగర్ లెవెల్స్ అదుపులో లేకపోతే గుండెపోటు ప్రమాదం పొంచి ఉన్నట్టే. అదుపులో లేని డయాబెటిస్‌తో బాధ పడుతున్న 65 సంవత్సరాల వయసు వారిలో దాదాపు 68 శాతం మంది గుండెజబ్బుల బారిన పడినట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. కనుక కచ్చితంగా డయాబెటిస్ అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది.
బీపీ
బీపీ లేదా హైపర్ టెన్షన్ నేరుగా గుండెజబ్బులకు కారణం అవుతుంది. బ్లడ్ ప్రెషర్ పెరిగితే గుండె మీద ఒత్తిడి పెరుగుతుంది. గుండె కండరాలు బిగుసుకు పోవడం వల్ల గుండెపోటు రావచ్చు. డాక్టర్ సలహా మేరకు తప్పనిసరిగా బీపీ అదుపులో పెట్టుకునే జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారంలో ఉప్పు తగ్గించడం, కొవ్వు పదార్థాలు తగ్గించడం, పరిమితులకు లోబడి మద్యం తీసుకోవడం, ఎక్కువ ఒత్తిడి లేకుండా జాగ్రత్త పడడం వంటి కొన్ని మార్పులతో బీపీని అదుపులో పెట్టుకోవచ్చు.
అధిక బరువు
కొలెస్ట్రాల్ పెరగడం, బీపీ పెరగడం, డయాబెటీస్ వీటన్నీంటికి శరీర బరువుతో నేరుగా సంబంధం ఉంటుంది. బరువు మోతాదు మించకుండా జాగ్రత్త పడాలి. తప్పనిసరిగా సమతుల ఆహారం తీసుకోవాలి. బరువు నియంత్రణలో ఉంచుకోవడం గుండె ఆరోగ్యానికి మాత్రమే కాదు ఓవరాల్ హెల్త్ కి తప్పనిసరి.
స్మోకింగ్
ప్రతి ఐదు గుండె పోటు మరణాల్లో ఒకటి స్మోకింగ్ వల్లే ఏర్పడుతున్నాయి. సిగరెట్ తాగే అలవాటున్నవారిలో గుండె పోటు ప్రమాదం రెండు నుంచి నాలుగు రెట్లు పెరుగుతుంది. పొగ గుండెకు చేరే ఆక్సిజన్ పరిమాణాన్ని తగ్గిస్తుంది. బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఫలితంగా రక్తనాళాలు దెబ్బతింటాయి. రక్తం చిక్కబడుతుంది. కనుక పొగతాగే అలవాటు మానెయ్యాలి.
తగినంత వ్యాయామం
ప్రస్తుత కాలంలో శారీరక శ్రమ రోజువారీ జీవన శైలిలో ఉండటం లేదు. తగినంత శారీరక శ్రమ లేకపోవడం వల్ల గుండెజబ్బుల ప్రమాదం చాలా పెరిగిపోయింది. వ్యాయామం తగినంత ఉన్నపుడు బరువు అదుపులో ఉండటం మాత్రమే కాదు గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్, డయాబెటిస్, బీపి వంటి అన్ని సమస్యలకు వ్యాయామం చాలా చక్కని పరిష్కారం. పెద్దవారు వారానికి కనీసం 75 నిమిషాల జాగింగ్ వంటి వ్యాయామం తప్పక చెయ్యాలి. లేదా 150 నిమిషాల వాకింగ్ వంటి మోడరేట్ వ్యాయామం చెయ్యాలి. అంతేకాదు నిత్య జీవితంలో ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ఇందుకు మెడిటేషన్, యోగా వంటివి సాధన చెయ్యాలి.
వయసు పెరిగే కొద్దీ గుండె పోటు ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి 45 సంవత్సరాల తర్వాత పురుషులు, 50 సంవత్సరాల వయసు తర్వాత మహిళలు తప్పనిసరిగా గుండె ఆరోగ్యానికి సంబంధించిన అన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.