Brown rice: బ్రౌన్ రైస్ తినడం వల్ల డయాబెటిస్ నిజంగా అదుపులో ఉంటుందా? ఎలా?
మధుమేహం ఉన్న వారికి బ్రౌన్ రైస్ తినమని సిఫారసు చేస్తారు. ఆ బియ్యం తినడం వల్ల నిజంగా ఉపయోగం ఉందా?
బ్రౌన్ రైస్‌నే దంపుడు బియ్యం అని పిలుస్తారు. ఒకప్పుడు వీటినే తినేవారు. ఇప్పుడు తెల్లటి పాలిష్ బియ్యం తినడం అలవాటైంది. ఎప్పుడైతే మనం తెల్లటి బియ్యం తినడం మొదలుపెట్టామో ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువ అవడం మొదలైంది. దంపుడు బియ్యం రంగు తక్కువగా, ముతకగా ఉంటాయి, అందుకే వాటిని తినేందుకు ఎక్కువ మంది ఇష్టపడరు, కానీ అలాంటి బియ్యం తినడం వల్లే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వరి పొట్టును తొలగించడానికి బియ్యానికి పాలిష్ పెడతారు. పొట్టు కింద ఉండే పొరలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కానీ పాలిష్ చేసి ఆ పొర మొత్తాన్ని తీసి పడేస్తారు. దీని వల్ల బియ్యం తెల్లగా మారిపోతాయి. కానీ పోషకాలన్నీ బయటికి పోతాయి. అందుకే తెల్ల బియ్యం తినడం వల్లే నష్టాలే కానీ లాభాలు ఉండవు.
డయాబెటిస్‌కి చెక్
హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు చెప్పిన ప్రకారం తెల్లబియ్యాన్ని వారంలో అయిదు సార్ల కన్నా ఎక్కువ సార్లు తినే వారిలో డయాబెటిస్ ముప్పు పెరుగుతున్నట్టు తేలింది. అదే దంపుడు బియ్యం తినడం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతున్నట్టు గుర్తించారు. పూర్తిగా దంపుడు బియ్యం తినలేం అనుకునే వారు, తెల్లబియ్యం, దంపుడు బియ్యం కలిపి వండుకుంటే మధుమేహం వచ్చే ముప్పు 16 శాతం తగ్గుతుంది. ఈ బియ్యంలో ఉండే పిండి పదార్థాలు వేగంగా జీర్ణం కావు. నెమ్మదిగా జీర్ణం అవుతాయి. కాబట్టి రక్తంలోకి గ్లూకోజ్ ఒకేసారి విడుదలయ్యే అవకాశాలు తక్కువ. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. దీని వల్ల ఆకలి త్వరగా వేయదు కూడా. ఈ బియ్యం గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ. దంపుడు బియ్యంలో సోడియం కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి రక్తపోటు పెరిగే అవకాశం తగ్గుతుంది. అంటే అధిక రక్తపోటు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గిపోతుంది.
ఆహారాన్ని శక్తి మార్చడంలో నియాసిన్, విటమిన్ బి3 కీలక పాత్ర పోషిస్తాయి. అవి దంపుడు బియ్యంలో అధికంగా ఉంటాయి.అలాగే మెగ్నీషియం కూడా అధికంగా ఉంటుంది. అది ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దంపుడు బియ్యంలో పీచు ఎక్కువగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల గుండెకు కూడా చాలా మంచిది. కొలెస్ట్రాల్ కూడా చేరదు. మెనోపాజ్‌కు దగ్గర పడుతున్న స్త్రీలు దంపుడు బియ్యాన్ని తినడం ఇతర సమస్యలేవీ రాకుండా ఉంటాయి. చెడె కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా ఉంటుంది. పెద్ద పేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దంపుడు బియ్యం తినడం వల్ల చర్మానికి కూడా ఎంతో మంచిది. చర్మంపై ముడతలు, గీతలు త్వరగా రావు.
Also read: మగవారికే ఎక్కువ క్యాన్సర్ ముప్పు, కారణాలు ఇవే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.