Diabetes: మీకు డయాబెటిస్ ఉందా? శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే మీ కిడ్నీలు ప్రమాదంలో పడినట్టే
డయాబెటిస్ ఉన్నవారు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి, లేకుంటే కిడ్నీలు దెబ్బ తినే అవకాశం ఎక్కువ.
డయాబెటిస్ వచ్చిందంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అది అదుపులో లేకపోతే శరీరంలోని ప్రధాన అవయవాలకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కిడ్నీలు పాడయ్యే ఛాన్సులు ఎక్కువ. మధుమేహ రోగులు ‘డయాబెటిక్ నెప్రోపతి’ అనే సమస్యను అభివృద్ధి చేసే ప్రమాదం ఉంది. దీన్నే డయాబెటిక్ కిడ్నీ వ్యాధి అని కూడా పిలుస్తారు. సాధారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో లేనప్పుడు, మధుమేహం మందులు సరిగ్గా వాడనప్పుడు ఇది వస్తుంది. డయాబెటిక్ కిడ్నీ వ్యాధి వచ్చిందో లేదో తెలుసుకోవడానికి మీ శరీరం కొన్ని లక్షణాలను చూపిస్తుంది. ఆ లక్షణాలను తేలిగ్గా తీసుకోకూడదు. మూత్రపిండాలు పాడయ్యాయి అని చెప్పడానికి శరీరం పంపించే హెచ్చరిక సంకేతాలు ఇవన్నీ.
చేతులు, పాదాల వాపు
శరీరం నుండి అదనపు ద్రవాన్ని తొలగించడం అనేది మూత్రపిండాల పని. మూత్రపిండాలు సరిగా పనిచేయనప్పుడు శరీర భాగాలలో అదనపు ద్రవాలు నిలిచిపోతాయి. ఇది వాపుకు దారితీస్తుంది. సాధారణంగా ఈ నీరు చేతులు, పాదాలు, చీలమండలలో కనిపిస్తుంది. అప్పుడు చేతులు, పాదాలు, చీలమండలు ఉబ్బినట్టు అవుతాయి. ఇలా అయ్యాయంటే మూత్రపిండాల్లో సమస్య ఉందని అర్థం చేసుకోవాలి.
పొడి చర్మం, దురద
చర్మం పొడిగా మారడం, దురదలు రావడం అనేది మూత్రపిండ వ్యాధికి మరొక లక్షణం. విష పదార్థాలు, వ్యర్ధాలు రక్తంలో పేరుకుపోతేనే ఇలా చర్మంపై దురదలు వస్తాయి. చర్మంపై దద్దుర్లు, ఎరుపు మచ్చలు, పొడిబారిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడండి.
మూత్రంలో ప్రోటీన్
అల్బుమిన్... ఇది ఒక రకమైన ప్రోటీన్. డయాబెటిక్ కిడ్నీ వ్యాధి వచ్చిన వారిలో ప్రారంభ దశల్లో ఇది మూత్రంలో కనిపించే అవకాశం ఉంది. మూత్ర పరీక్ష ద్వారానే దీన్ని గుర్తిస్తారు. మూత్రంలో ప్రోటీన్ ఉందంటే అది మూత్రపిండాల వ్యాధి అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మూత్రపిండాలు ప్రోటీన్‌ను మూత్రం నుంచి బయటికి పోకుండా అడ్డుకుంటాయి. కిడ్నీలు సరిగా పని చేయనప్పుడే ప్రోటీన్ ఇలా మూత్రంలో కలిసి బయటికి పోతుంది.
ఆకలి పెరగడం లేదా తగ్గడం
డయాబెటిక్ కిడ్నీ వ్యాధి వచ్చిన వారిలో ఆకలి విపరీతంగా పెరుగుతుంది లేదా చాలావరకు తగ్గిపోతుంది. ఈ రెండూ కూడా ఆ కిడ్నీ వ్యాధి లక్షణాలే. రక్తంలో వ్యర్ధాలు చేరడం వల్ల వికారంగా, వాంతులు వచ్చినట్టు, ఆకలి లేనట్టు, బరువు తగ్గడం వంటివి జరుగుతాయి.
తీవ్ర బలహీనత
డయాబెటిక్ కిడ్నీ వ్యాధి ఉన్న వ్యక్తులలో అలసట, బలహీనత అధికంగా ఉంటుంది. ఎముక మధ్యలో ఎర్ర రక్త కణాల సృష్టి తగ్గినప్పుడు ఇలా అనిపిస్తుంది. తద్వారా రక్తహీనత వస్తుంది. మూత్రపిండాలు ఎరిత్రోపొయిథినిన్‌ను ఉత్పత్తి చేయడం మానేయడం వల్లే ఇలా జరుగుతుంది.
మధుమేహం ఉన్నవారిలో పై లక్షణాల్లో ఏది అనిపించిన వెంటనే జాగ్రత్త పడింది.
Also read: వారానికోసారి బాడీ మసాజ్ చేయించుకుంటే ఈ సమస్యలన్నీ మాయం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.