Rice: వైట్ రైస్, బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్.. వీటిల్లో ఏ రైస్ తింటే మంచిది? వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటి?
రైస్‌లో చాలా రకాలున్నాయి. మరి, ఏ రైస్ తింటే ఏం లాభాలు కలుగుతాయో, ఎవరికి మంచి చేస్తుందో తెలుసుకుందాం.
చాలా మంది రోజుకి రెండు పూటలా అన్నం తింటారు. రైస్ చాలా ముఖ్యమైన ఆహారం. అయితే రైస్‌లోనూ అనేక రకాలు ఉన్నాయి. వీటిల్లో ఏది ఆరోగ్యకరమైనది ? వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. వైట్ రైస్ తినడం వల్ల బరువు పెరుగుతారని వైద్యులు చెబుతుంటారు. అందుకే ఈ మధ్య కాలంలో వైట్ రైస్ తినడం తగ్గించారు. ముడి బియ్యానికి పాలిష్ బాగా చేసి రైస్‌ను తెల్లగా మారుస్తారు. దీంతో అందులో ఉండే పోషకాలు పోతాయి.
Also Read: ఈ కాంబినేషన్ ఫుడ్స్‌ని పొరపాటున కూడా కలిపి తినకండి... స్లో పాయిజన్ అయ్యే అవకాశం ఉంది
ఇక రైట్ రైస్ కన్నా బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్‌లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇవి ఆరోగ్యానికి మంచిది. ఒక్కో రకం బియ్యంలో భిన్నరకాల పోషకాలు ఉంటాయి కాబట్టి పలు ప్రయోజనాలు కలుగుతాయి. ఇప్పుడు ఏ రైస్ తింటే ఏ రకాల ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం.
వైట్ రైస్
దాదాపుగా ప్రతి కుటుంబంలో వైట్ రైస్ తినేవారే ఎక్కువ. పాలిష్ ఎక్కువ చేయడం వల్ల ఈ రైస్‌లో పోషకాలు ఏమీ ఉండవు. కానీ ఈ రైస్ శక్తిని అందిస్తుంది. అందువల్ల తక్షణ శక్తి కోసం వైట్ రైస్‌ను తినవచ్చు. కానీ బరువు తగ్గాలనుకునేవారు, షుగర్, కొలెస్ట్రాల్ ఉన్న వారు ఈ రైస్‌ను తినకపోవడమే మంచిది.
రెడ్ రైస్
రెడ్ రైస్ గురించి చాలా మందికి తెలియదు. కానీ ఈ రైస్ కూడా మనకు మార్కెట్‌లో లభిస్తుంది. ఇది ఒక ప్రత్యేకమైన రైస్ వెరైటీ. ఈ ధాన్యం గింజలు ఎరుపు రంగులో ఉంటాయి. వీటిల్లో యాంథో సయనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అందువల్లే ఈ రైస్ ఎరుపు రంగులో ఉంటుంది. ఈ రైస్‌లో పోషకాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా ఈ రైస్‌లో ఉండే ఫైబర్, ఐరన్ శరీరంలోని వాపులను తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతాయి. హైబీపీ తగ్గిస్తుంది. బరువు తగ్గుతాం. షుగర్ ఉన్నవారు ఈ రైస్ తింటే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.
బ్రౌన్ రైస్
పాలిష్ చేయని ముడి బియ్యాన్నే బ్రౌన్ రైస్ అంటారు. ఇందులో బియ్యంపై పొట్టు కొద్దిగా అలాగే ఉంటుంది. అందువల్ల వైట్ రైస్‌తో పోలిస్తే బ్రౌన్ రైస్‌లో పోషకాలు ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా ఫైబర్, బి విటమిన్లు, మెగ్నిషియం, ఐరన్ ఉంటాయి. జింక్ కూడా ఈ రైస్‌లో ఉంటుంది. అయితే బ్రౌన్ రైస్‌ను తీసుకోవడం వల్ల మలబద్దకం ఉండదు. షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయవచ్చు.
బ్లాక్ రైస్
రెడ్ రైస్ లాగే బ్లాక్ రైస్ కూడా ఒక ప్రత్యేకమైన రైస్. బ్లాక్ రైస్‌ను చైనీయులు ఎక్కువగా తింటారు. ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియెంట్లు, ఫైటో కెమికల్స్, విటమిన్ E, ప్రోటీన్లు, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల ఈ రైస్‌లో అత్యంత పోషక విలువలు ఉన్న రైస్‌గా చెప్పవచ్చు. మిగిలిన అన్ని రైస్‌ల కన్నా ఈ రైస్‌లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. కనుక దీన్ని తరచూ తింటే ఆరోగ్యంగా ఉండవచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ఈ కథనానికి ‘abp దేశం’ ఎలాంటి బాధ్యత వహించదని గమనించగలరు.