Covid cases: ఆరు రోజుల్లో అకస్మాత్తుగా పెరిగిన కోవిడ్ కేసులు... మళ్లీ ఆ నగరంలోనే... కలవరపెడుతున్న డేటా
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మళ్లీ కరోనా కలవరం మొదలైంది. సెప్టెంబరు నెల మొదటి ఆరురోజుల్లోనే 2,570 కేసులు నమోదయ్యాయి.
ముంబైలో కరోనా కేసులు పెరుగుతుండడం మళ్లీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఆగస్టు నెలలో నగరంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 9,147 కాగా, సెప్టెంబరులో కేవలం మొదటి ఆరు రోజుల్లోనే 2,570 కేసులు నమోదయ్యాయి. అంటే ఆగస్టు నెలలో వచ్చిన మొత్తం కేసుల్లో ఇది 28 శాతంతో సమానం. వినాయక చవితి ముందు ఇలా కేసులు పెరుగుతుండడంతో ముంబై మున్సిపల్ అధికారుల్లో కలవరాన్ని పుట్టిస్తోంది. వినాయక ప్రతిష్టలు, నిమజ్జనాల సమయంలో జనాలు విపరీతంగా గుమిగూడే అవకాశం ఉంటుంది. అప్పుడు వైరస్ మరింతగా విస్తరించ వచ్చనే అభిప్రాయం అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
తాజా గణాంకాల ప్రకారం... గత ఆరురోజుల్లోనే నగరంలో 21 కరోనా మరణాలు సంభవించాయి. ఆగస్టు నెలలో మొత్తం 157 మరణాలు నమోదయ్యాయి. రోజువారీగా నమోదయ్యే కరోనా కేసులు సోమవారం 2,700 నుంచి 3,771 కి పెరిగింది. అంటే కేసుల వృద్ధి రేటు 0.04 శాతం నుంచి 0.06 శాతానికి పెరిగింది. ఈ డేటా ప్రకారం కేసులు గణనీయంగా పెరుగుతుండడం ముంబై వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. ఫస్ట్ వేవ్ సమయంలో కరోనాకు హాట్ స్పాట్ గా మారింది ముంబై. థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్న నేపథ్యంలో మరల నగరంలో కేసులు పెరుగుదల అధికారులకు తలనొప్పిగా మారింది.
కేరళలో కరోనా వైరస్ కేసులు కాస్త తగ్గాయి. మొన్నటి వరకు రోజుకు ముప్పై వేల కేసులు నమోదయ్యేవి. సోమవారం మాత్రం కొత్తగా 19,688 కరోనా కేసులు, 135 మరణాలు నమోదయ్యాయి. సోమవారం 28,561 మంది కరోనా రోగులు ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
దేశ వ్యాప్తంగా తగ్గిన కేసులు
ముంబై నగరంలో కేసులు పెరుగుతున్నప్పటికీ, దేశ వ్యాప్తంగా చూస్తే మాత్రం కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 31,222 మంది కరోనా బారిన పడినట్లు నిర్ధరణ అయ్యింది. 290 మరణాలు సంభవించాయి. సోమవారం ఒక్కరోజే 42,942 మంది కరోనాను జయించారు. ఇప్పటివరకు దేశంలో 3,30,58,843 మంది కరోనా బారిన పడగా, 4,41,042 మంది మరణించారు. 3,22,24,937 మంది కరోనాను జయించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3,92,864.
Also read:నిజమేనా.... మిలిటరీ డైట్ తో వారంలో బరువు తగ్గొచ్చా?
Also read:అంతులేని వ్యథ.. అవని గాథ.. ఆ ప్రమాదం ఆమెను కదలకుండా చేసింది, కానీ..
Also read: కాఫీ తాగుతున్నారా? అయితే ఈ మూడు తప్పులు చేయకండి