జిమ్ చేశాక అరటిపండ్లు, ప్రోటీన్ షేక్ కాదు వీటిని తినండి
జిమ్ చేసే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఆరోగ్యపరంగాను, అందం కోసం కూడా ప్రతిరోజు చాలామంది జిమ్ కి వెళ్తున్నారు.
జిమ్ కొందరికి ఆరోగ్యాన్ని అందిస్తే, మరి కొందరు అందం కోసం వెళుతుంటారు. కొంతమందికి ఇది ఫ్యాషన్ కూడా అయిపోయింది. అయితే జిమ్‌లో వ్యాయామం చేశాక ఎక్కువ మంది తీసుకునే ఆహార పదార్థాలు అరటి పండ్లు లేదా ప్రోటీన్ షేక్. ఈ రెండూ వెంటనే శక్తిని ఇస్తాయని వారి నమ్మకం. ఇది నిజమే కావచ్చు కానీ తీవ్రంగా వర్కౌట్ చేశాక అరటి పండ్లు లేదా ప్రోటీన్ షేక్ కన్నా బాదం పప్పులు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. బాదంపప్పులో ప్రయోజనకరమైన కొవ్వు అధికంగా ఉంటుంది. ఈ విషయం ఫ్రాంక్ఇయర్స్ ఇన్ న్యూట్రిషన్ అనే జర్నల్‌లో ప్రచురించారు. బాదం పప్పులో ఉండే ఆక్సిలిటీ అనే రసాయనం లినోలైక్ యాసిడ్‌ను కొవ్వు కణజాలం ద్వారా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. ఇది జీవక్రియ ఆరోగ్యాన్ని, శరీరంలో శక్తి సమతుల్యతను కాపాడుతుంది. నెల రోజులు పాటు వర్క్ అవుట్‌లు చేశాక 50 గ్రాముల బాదంపప్పును తిని చూడండి, మీకే తేడా తెలుస్తుంది అని చెబుతున్నారు అధ్యయనకర్తలు. అలసట తక్కువగా ఉండడం, టెన్షన్ తక్కువగా ఉండడం ఈ బాదం పప్పులు తినడం వల్ల కలుగుతుంది.
అధ్యయనం ఇలా...
క్లినికల్ ట్రయల్‌లో భాగంగా 30 నుంచి 65 సంవత్సరాల మధ్య వయసు గల 38 మంది పురుషులు, 26 మంది మహిళలపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. వీరిలో సగం మందిని వర్కౌట్ చేశాక బాదంపప్పులు తినమని చెప్పారు. మిగతా సగం మందిని అరటిపండ్లు, ప్రోటీన్ షేక్, తృణధాన్యాలతో చేసిన చాక్లెట్ బార్ వంటివి తినమని సూచించారు. నాలుగు వారాల తర్వాత వీరి రక్తం, మూత్ర నమూనాలను తీసుకున్నారు.
ఎవరైతే వర్కౌట్ తర్వాత బాదం పప్పులు తిన్నారో, వారిలో చాలా సానుకూల ప్రభావాలు కనిపించాయి. వారి జీవక్రియలో మార్పు వచ్చింది. వ్యాయామం వల్ల వచ్చే మంట, ఆక్సీకరణ ఒత్తిడి తగ్గింది. అదే మిగతా ఆహారాలు తీసుకున్న వారిలో ఆ ఇన్ప్లమ్మేషన్, ఆక్సీకరణ ఒత్తిడి అలాగే ఉన్నాయి. అందుకే బాదంపప్పులు తినమని సూచిస్తున్నారు పరిశోధన కర్తలు. బాదం ఒక ప్రత్యేకమైన సంక్లిష్టమైన పోషకాలతో కూడుకుని ఉన్నది. దీనిలో అధిక మొత్తంలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఈ, ఖనిజాలు, ఫైబర్ ఉంటాయి. అలాగే పాలిఫెనాల్స్ కూడా ఉంటాయి. ఇవి పెద్ద పేగుల్లో మంటను, ఆక్సికరణ ఒత్తిడిని నియంత్రించడానికి ఉపయోగపడతాయి. కాబట్టి జిమ్ లో తీవ్రంగా శ్రమించాక గుప్పెడు బాదంపప్పులు నానబెట్టుకొని తినడం అలవాటు చేసుకోండి.
Also read: తీవ్ర ఒత్తిడికి గురవుతున్న మగవారూ జాగ్రత్త - మీరు తండ్రయ్యే అవకాశాలు తగ్గిపోతాయి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.