Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: కాంగ్రెస్ మేనిఫెస్టో ముస్లింలకు అనుకూలంగా ఉందంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలు నిజం కాదని ఫ్యాక్ట్‌చెక్‌లో తేలింది.
Congress Manifesto 2024: ఏప్రిల్ 23వ తేదీన కర్ణాటక బీజేపీ ఓ పోస్ట్ షేర్ చేసింది. ముస్లింలకు ప్రత్యేక రిజర్వేష్‌లు, ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు పెద్ద ఎత్తున ఆస్తులనూ పంచిపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోందన్నది ఆ పోస్ట్ సారాంశం. సోషల్ మీడియాలో ఒక్కసారిగా దుమారం రేపాయి ఈ ఆరోపణలు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇలాంటి హామీలే ఉన్నాయంటూ బీజేపీ ప్రచారం మొదలు పెట్టింది. బీజేపీ చెబుతున్న దాని ప్రకారం..కాంగ్రెస్ మొత్తం ఆరు హామీలను అందులో చేర్చింది. అన్ని విద్యా సంస్థల్లో హిజాబ్‌కి అనుమతి, ముస్లింలకు ఆస్తులు పంచి పెట్టడం, ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్‌లు, మత పరమైన చట్టాల్ని అనుసరించే స్వేచ్ఛనివ్వడం, ముస్లింలను నేరుగా జడ్జ్‌లుగా నియమించడం, అన్ని సంస్థల్లోనూ ముస్లింలను కచ్చితంగా ఉద్యోగులుగా తీసుకోవాలని నిబంధన తీసుకురావడం.
X వేదికగా పెట్టిన పోస్ట్‌లో ఈ ఆరు హామీలనూ ప్రస్తావించి బీజేపీ. ఈ పోస్ట్ తెగ వైరల్ (పోస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) అవుతోంది. ఇటీవలే ప్రధాని మోదీ కూడా కాంగ్రెస్ దేశ ఆస్తుల్ని ముస్లింలకు పంచి పెడతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలోనే బీజేపీ పెట్టిన పోస్ట్ మరింత సంచలనం సృష్టించింది. అయితే...బీజేపీ చెబుతున్నట్టుగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇవేమీ లేవని తేలింది. Logically Facts సంస్థ ఫ్యాక్ట్ చెకింగ్ చేయగా బీజేపీ ఆరోపణల్లో నిజం లేదని వెల్లడైంది. లాజికల్లీ ఫ్యాక్ట్స్ టీమ్ క్షుణ్ణంగా పరిశీలించిన తరవాత ఈ విషయం వెల్లడించింది. విద్యా సంస్థల్లో హిజాబ్‌కి అనుమతినిచ్చే అంశం మేనిఫెస్టోలో ఎక్కడా ప్రస్తావించలేదని తేలింది.
ఇక ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామన్న హామీ కూడా ఎక్కడా లేదని వెల్లడైంది. దేశవ్యాప్తంగా కులగణన సర్వే చేపడతామని మాత్రం కాంగ్రెస్ హామీ ఇచ్చింది. మైనార్టీ వర్గాలు సాధికారత సాధించేలా చర్యలు చేపడతామని వెల్లడించింది. ఇక ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్‌లు అంటూ బీజేపీ చేసిన ఆరోపణలూ నిజం కాదని తేలింది. అయితే...సామాజిక న్యాయం కిందట ప్రస్తుతం అమల్లో ఉన్న 50% రిజర్వేషన్‌ల పరిమితిని తొలగించి మరీ అవసరమైన వాళ్లకి రిజర్వేషన్‌లు కల్పిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చింది. ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు (EWS) విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్‌లు ఇస్తామని మాత్రమే చెప్పింది.
ఎక్కడా ముస్లింల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదని ఫ్యాక్ట్‌చెక్‌లో తేలింది. ఇక ముస్లింలను జడ్జ్‌లుగా నియమిస్తామని ఇచ్చిన హామీలోనూ నిజం లేదని వెల్లడైంది. SC,ST,OBCలను సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో జడ్జ్‌లుగా నియమించేందుకు చొరవ చూపిస్తామని కాంగ్రెస్ చెప్పింది. అంతే కానీ ముస్లింలను జడ్జ్‌లుగా చేస్తామని మేనిఫెస్టోలో చేర్చలేదని ఫ్యాక్ట్‌చెక్‌లో తేలింది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ముస్లింలను నియమించుకోవడాన్ని తప్పనిసరి చేస్తామని కాంగ్రెస్ చెప్పినట్టు బీజేపీ ఆరోపించింది. ఇందులోనూ నిజం లేదు. మొత్తంగా కర్ణాటక బీజేపీ పెట్టిన పోస్ట్ వైరల్ అవడం వల్ల అంతా అదే నిజమని విపరీతంగా షేర్ చేస్తున్నారు. పైగా మోదీ కూడా కాంగ్రెస్‌పై ఇదే తరహా ఆరోపణలు చేయడం వల్ల ఈ పోస్ట్‌పై అందరి దృష్టి పడుతోంది. మొత్తంగా చూస్తే కర్ణాటక బీజేపీ చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం అని Logically Facts ఫ్యాక్ట్‌చెక్‌లో తెలిసింది.
Also Read: ఈ యువతి 24 గంటలూ మెలకువతోనే ఉంటుందట, నిద్రపోనివ్వని జబ్బుతో నరకం