Fact Check: 'బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్లు రద్దు' - బండి సంజయ్ అన్నట్లు ఆడియో వైరల్, అసలు నిజం ఏంటంటే?
Factly Check: బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని బండి సంజయ్ అన్నట్లుగా ఓ ఆడియో క్లిప్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఫ్యాక్ట్ లీ చెక్ క్లారిటీ ఇచ్చింది.
Fact Check On Bandi Sanjay Edited Audio Clip On Reservations Issue: దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో వివిధ పార్టీల కీలక నేతలకు సంబంధించి పలు వీడియోలు, ఆడియోలు షేర్ అవుతున్నాయి. తాజాగా, బీజేపీ నేత బండి సంజయ్ కు సంబంధించి ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఆయన అన్నట్లు ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. 'కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు తీసుకొచ్చి రాజ్యాంగానికి తూట్లు పొడిచింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తాం. అంబేడ్కర్ వల్లనే మాకు రాజ్యాంగబద్ధమైన పదవులు వచ్చాయని పార్లమెంట్ సాక్షిగా చెప్పుకొని పార్టీ బీజేపీ' అంటూ పలు వ్యాఖ్యలు బండి సంజయ్ ఈ ఆడియో క్లిప్ లో అన్నట్లుగా ఉంది. దీనిపై 'ఫ్యాక్ట్ లీ' చెక్ క్లారిటీ ఇచ్చింది. అది కావాలనే ఎడిట్ చేసిన ఆడియో అని స్పష్టం చేసింది.
అసలు నిజం ఇదే
బండి సంజయ్ బీజేపీ ఇంటర్నల్ మీటింగ్ ఆడియో లీక్ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఈ ఆడియో క్లిప్ లోని వ్యాఖ్యలు ఎడిట్ చేసినవి. ఆయన బహిరంగంగా మీడియా ముందు కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను డిజిటల్ గా కట్ చేసి.. రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఆయన అన్నట్లుగా దీన్ని రూపొందించారు.
ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని వ్యాఖ్యానించారు. అయితే, ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ బీజేపీ నేత బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల విషయంలో ప్రజలను తప్పు దారి పట్టిస్తుందని అన్నారు. ఈ క్రమంలోనే ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ‘అంబేద్కర్ చెప్పినదానికి వ్యతిరేకంగా మతపరమైన రిజర్వేషన్లు తీసుకొచ్చి రాజ్యాంగానికి తూట్లు పొడిచినటువంటి పార్టీ కాంగ్రెస్. అంబేద్కర్ వల్లే మాకు ఈ రాజ్యాంగ బద్దమైన పదవులు వచ్చాయని పార్లమెంట్ సాక్షిగా చెప్పుకోలేని పార్టీ కాంగ్రెస్. రిజర్వేషన్‌లు రద్దు చేస్తామని అమిత్ షా అన్నట్టు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తోంది. మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేసి వాటిని SC, ST, BC, అగ్రవర్ణాలలోని పేదలకు ఇస్తాం అని ఆయన అన్నారు' అని బండి సంజయ్ వెల్లడించారు.
ఇలా ఎడిట్ చేశారు
అయితే, బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలను డిజిటల్‌గా ఎడిట్ చేసి, బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ఆయన అన్నట్టు రూపొందించారు. కానీ బండి సంజయ్ ఈ ప్రెస్ మీట్‌లో ఎక్కడా కూడా అలా అనలేదు. పైగా తాము రిజర్వేషన్‌లు కొనసాగిస్తామని అయన స్పష్టం చేశారు. బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని బండి సంజయ్ అన్నట్టుగా ఉన్న ఈ క్లిప్ పూర్తిగా డిజిటల్‌గా ఎడిట్ చేసింది. ఈ మేరకు 'ఫ్యాక్ట్ లీ చెక్' పూర్తి స్ఫష్టత ఇచ్చింది.
This story was originally published by as Factly.in part of the Shakti Collective. This story has been edited by ABPDesam staff.