Tanikella Bharani: తనికెళ్ల భరణికి ‘లోక్ నాయక్’ పురస్కారం
ప్రముఖ సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి లోక్ నాయక్ పురస్కారాన్ని అందుకోబోతున్నారు. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందిస్తున్నారు.
ప్రముఖ సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి మరో పురస్కారాన్ని అందుకోబోతున్నారు. తెలుగు సాహిత్యం, సంస్కృతికి ఆయన చేస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా లోక్‌నాయక్ పురస్కారానికి తనికెళ్ల ఎంపికయ్యారు. ఈ విషయాన్ని లోక్‌నాయక్ ఫౌండేషన్ నిర్వాహకుడు, ఏపీ అధికార భాషా సంఘం చైర్మన్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు.
విశాఖపట్నం కళాభారతిలో జరిగే లోక్‌నాయక్ ఫౌండేషన్ వార్షిక సాహిత్య పురస్కారాల ప్రదానోత్సవ సభలో తనికెళ్లకు పురస్కారం అందించనున్నట్లు తెలిపారు .ఈ సందర్భంగా రూ.2 లక్షలు నగదు బహుమతి అందిస్తామన్నారు. గత 18 ఏళ్లుగా ఈ పురస్కారాన్ని అందిస్తున్నామని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. తెలుగు సంస్కృతి, భాష, సాహిత్య రంగాలకు విశేష సేవలు అందిస్తున్న వ్యక్తులకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నట్లు చెప్పారు.
అంతేగాక, మాజీ సీఎం నందమూరి తారక రామారావు శత జయంతిని పురస్కరించుకుని పలువురిని సన్మానించనున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి మరణం వరకు ఆయన వెన్నంటి ఉన్న వ్యక్తులను కూడా గౌరవించి సన్మానిస్తామని చెప్పారు. ఎన్టీఆర్ కు ప్రత్యేక అధికారిగా పనిచేసిన జి.రామచంద్రరావు, వ్యక్తిగత సహాయకుడు మోహన్, భద్రతాధికారి కృష్ణారావు, కారు డ్రైవర్ లక్ష్మణ్ ను సన్మానించి రూ.లక్ష చొప్పున నగదు బహుమతి అందిస్తామన్నారు.
ఇవాళ(సోమవారం) సాయంత్రం విశాఖలో జరిగే అవార్డుల ప్రదానోత్సవ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిజోరం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు, అతిథులుగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, సినీనటుడు మోహన్ బాబు, లోక్ సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ ఎన్. జయ ప్రకాష్ నారాయణ, విజ్ఞాన్ విద్యా సంస్థల కార్యదర్శి లావు శ్రీకృష్ణదేవరాయలు సహా పలువురు హాజరు కానున్నట్లు లక్ష్మీ ప్రసాద్ తెలిపారు.
లోక్ నాయక్ పురస్కారం అందుకోబోతున్న తనికెళ్ల భరణి తెలుగు భాషకు, సంస్కృతి కోసం ఎంతో కృషి చేశారు. రంగస్థల, సినిమా రచయిత, నటుడు తనికెళ్ల భరణి జులై 14, 1956లో పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరు మండలంలోని జగన్నాధపురంలో జన్మించారు. తెలుగు సినిమాలలో హాస్య ప్రధాన పాత్రలు ఆయన ఎక్కువగా పోషించారు. ఇప్పటి వరకు ఆయన 320 సినిమాలలో నటించారు. తనికెళ్ల భరణి.. వంశీ ‘కంచు కవచం’ సినిమాకు తొలిసారి రచయితగా, నటుడిగా పని చేశారు. ఆ తర్వాత వచ్చిన ‘లేడీస్ టైలర్’ చిత్రంతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ‘ శివ’ సినిమాతో తిరుగులేని పేరు తెచ్చుకున్నారు. ‘మొండి మొగుడు - పెంకి పెళ్ళాం’ సినిమాలో హీరోయిన్ కు పూర్తి స్థాయిలో తెలంగాణ యాస డైలాగులు రాసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పలు సినిమాల్లో చక్కటి పాత్రలు పోషించడమే కాదు.. రచయితగా కూడా తనికెళ్ల పని చేశారు. కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. సొగసు చూడతరమా, ఎగిరేపావురమా, మావిచిగురు, పరదేశి సినిమాల్లో ఆయన నటనను విమర్శకులు సైతం ప్రశంసించారు. కామెడీ, విలన్ తో పాటు పలు రకాల పాత్రల్లో ఆయన నటించి మెప్పించారు.
Also Read : 'జబర్దస్త్' ప్రోగ్రామ్‌కు 'బిగ్ బాస్' నుంచి భారీ ఝలక్
Also Read : ఫ్లాప్‌లతో కట్టిన స్టార్‌డమ్ కోట - పవన్ కళ్యాణ్ క్రేజ్ వేరే లెవల్