Vishwak Sen: బాలయ్యతో మూవీ తీస్తా, నేను లెక్కలేసి సినిమా తీస్తే ఎలా ఉంటుందో చూపిస్తా: విశ్వక్ సేన్
ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు విశ్వక్ సేన్. తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆయన తన సినిమా కెరీర్ గురించి డైరెక్షన్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Vishwak Sen: టాలీవుడ్ లో కంటెంట్ ఉన్న యంగ్ హీరోల్లో విశ్వక్ సేన్ ఒకరు. ఈ ఏడాది ‘దాస్ కా ధమ్కీ’ సినిమాతో మంచి హిట్ అందుకున్న విశ్వక్ ‘గామి’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల మందుకు రానున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘దాస్ కా ధమ్కీ’ సినిమాకు విశ్వక్ స్వీయ దర్శకత్వంలో నటించారు. ఈ మూవీ క్లీన్ హిట్ అవ్వడంతో సీక్వెల్ ను కూడా ప్లాన్ చేశారు. సీక్వెల్ పై గతంలోనే క్లారిటీ ఇచ్చారు విశ్వక్ సేన్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన సినిమా కెరీర్ గురించి, డైరెక్షన్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటిదాకా లెక్కలు వేయకుండా చేశా.. ఇప్పుడు లెక్కతో చేస్తా: విశ్వక్ సేన్
ఓ వైపు నటుడిగా వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు స్వీయ దర్శకత్వంలో కూడా పలు సినిమాలు చేస్తూ వస్తున్నారు విశ్వక్ సేన్. అందులో భాగంగానే ‘దాస్ కా ధమ్కీ’ సినిమాకు దర్శకత్వం వహించారు విశ్వక్. వాస్తవానికి ఈ సినిమా కూడా తాను చేయాల్సింది కాదని చెప్పుకొచ్చారాయన. సినిమా మధ్యలో కొన్ని కారణాల వలన తాను డైరెక్ట్ చేయాల్సి వచ్చిందన్నారు. ఒక సినిమాకు దర్శకత్వం వహించడం వలన దాదాపు ఏడాది సమయం పడుతుందని, ఈలోపు ఓ మూడు సినిమాల్లో నటించవచ్చన్నారు. కానీ ‘దాస్ కా ధమ్కీ’ సినిమాకు దర్శకత్వం వహించడం వలన తనేమీ ఫీల్ అవ్వడం లేదని, ఈ ఒక్క సినిమానే నాలుగు సినిమాలకు సమానం అని చెప్పారు. అందుకే ‘దాస్ కా ధమ్కీ’కు సీక్వెల్ ప్లాన్ చేశానని అన్నారు. అయితే ఇప్పటి వరకూ తాను సినిమా హిట్ అవుతుందా లేదా అనే లెక్కలు లేకుండా సినిమాలు చేశానని, ఇప్పుడు లెక్కలతో సినిమా తీస్తే ఎలా ఉంటుందో చూపిస్తానంటూ థీమా వ్యక్తం చేశారు.
తీస్తే బాలయ్య బాబుతో సినిమా తీయాలి
మాములుగా తనకు నటనపైనే ఎక్కువ ఆసక్తి అని, అందుకే దర్శకత్వం పై అంతగా దృష్టి పెట్టడం లేదని అన్నారు. తన సినిమాల కోసమే డైరెక్షన్ లోకి వచ్చానని చెప్పారు. అయితే ఇప్పుడున్న హీరోల్లో ఎవరితో సినిమా తీయాలని ఉంది అని అడిగితే.. తనకు బాలకృష్ణతో సినిమా తీయాలని ఉందని అన్నారు. ఆయనతో కాస్త పరిచయం ఉందని, అందుకే సినిమా తీయడం ఈజీ అవుతుందని నవ్వుతూ సమాధానమిచ్చారు. ఇక యంగ్ హీరోలతో అయితే ఎన్టీఆర్ నే తన ఫేవరేట్ అని ఆయన కాకుండా తమిళ నటుడు ధనుష్ తో సినిమా తీయాలని ఉందని చెప్పారు. అయితే ప్రస్తుతం తన దృష్టి అంతా యాక్టింగ్ పైనే ఉందని వ్యాఖ్యానించారు.
‘గామి’లో అఘోరాగా విశ్వక్ సేన్
ఇక విశ్వక్ సేన్ తాజాగా నటించిన సినిమా ‘గామి’. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉంది. ఈ మూవీకు విద్యాధర్ కవిత దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో విశ్వక్ మునుపెన్నడూ చూడని పాత్రలో కనిపించబోతున్నాడట. ఈ ఫాంటసీ అడ్వెంచర్ లో విశ్వక్ అఘోరాగా కనిపించబోతున్నాడు అని సమాచారం. చాందిని చౌదరి ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. వి సెల్యులాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ బ్యాంక్రోల్ చేసిన ఈ సినిమా ఈ వేసవిలో విడుదల కానుంది.
Also Read: ఓటీటీలో దగ్గుబాటి రానా ‘మాయాబజార్ ఫర్ సేల్’ - స్ట్రీమింగ్ ఎక్కడంటే?